మైక్రోసాఫ్ట్ సీఈవో రేసులో తెలుగోడు
న్యూయార్క్: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో పదవి రేసులో మన హైదరాబాదీ సత్య నాదెళ్ల గట్టిగా తలపడుతున్నారు. షార్ట్‌లిస్ట్ అయిన మరో అభ్యర్థి, ఫోర్డ్ సీఈవో అలాన్ ములాలీకి తీవ్ర పోటీనిస్తున్నారు. హైదరాబాద్‌కి చెందిన సత్య.. మంగళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. అటుపైనా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి ఎంబీయే చేశారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
సీఈవో రేసులో ములాలీ కాస్త ముందంజలో ఉన్నప్పటికీ.. మైక్రోసాఫ్ట్‌లోనే పనిచేస్తున్న అనుభవజ్ఞుడైన వ్యక్తిని సీఈవోగా నియమించాలని యాజమాన్యం భావించిన పక్షంలో సత్య నాదెళ్లకే మెరుగైన అవకాశాలు ఉన్నాయని పరి శీలకుల భావన. ఒకవేళ బయట వ్యక్తిని తీసుకురావాలనుకుంటే.. సుదీర్ఘ అనుభవం గల ములాలీకి అవకాశం ఉండగలదని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో బామర్ వచ్చే ఏడాదిలోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించి న నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది.