విహారం: ప్రకృతి గీసిన చిత్రం... ఆ వెదురు అడవి!
మనిషిని ప్రకృతి ఆనందపరిచినంతగా మరేదీ ఆనంద పరచలేదు. నేచర్ నెవర్ అవుట్‌డేటెడ్. మనకు తెలిసినవి, మనం చూసినవే మనకు కొత్తగా, అద్భుతంగా కనిపించడం అన్నది ఒక్క ప్రకృతి విషయంలో మాత్రమే జరుగుతుంది. అలాంటి ఓ అద్భుతమైన అనుభూతిని ఇచ్చే ఒక టూర్... అరషియామా, జపాన్. జపాన్.. అంటే మనకెప్పుడూ ఏ ఫోనో, మెషినో గుర్తొస్తుంటుంది. ఆ దేశాన్ని ఎపుడూ మనం ప్రకృతితో పోల్చి ఊహించుకున్న దాఖలాలు లేవు. అలాంటి జపాన్‌లో అక్కడే ఉండిపోవాలనిపించేటంత అందమైన ప్రదేశాలుంటాయంటే అతిశయోక్తి అనుకుంటారు. కానీ, ఒక్కసారి ఫొటోలు చూశాక అక్కడకు వెళాల్సిందే అని ఫిక్సయిపోతారు. అంతటి మనోహరంగా ఉంటుందా ప్రదేశం. వెదురు చెట్లు మనకు కొత్త కాదు, కానీ అవే వెదురు చెట్లను అక్కడ చూడటం మహానుభూతి. అది ఎంత గొప్ప అనుభూతి అంటే అక్కడకు వెళ్లొచ్చాక పర్యాటకులు ఆన్లైన్లలో తమ రివ్యూలు ద్వారా ఆ స్థలం గురించి అభిప్రాయం చెబుతూ యావరేజ్ అన్న వారే లేరంటే అర్థం చేసుకోండి... అందరి నోటా అద్భుతం అనే మాటే వస్తుంది.
ఎక్కడ ఉంటుంది?
ఈ బాంబూ ఫారెస్ట్ అరషియామా-సగానో ప్రాంతంలో ఉంటుంది. ఇది జపాన్‌లో అత్యంత ఆదరణ పొందిన టూరు. ఈ ప్రాంతం జపాన్‌లోని క్యోటో నగరానికి దగ్గరగానే ఉంటుంది. ఇది దాదాపు వెయ్యేళ్ల క్రితం నుంచే పర్యాటక స్థలంగా వర్ధిల్లుతోంది. ఒక్కో సీజను ఒక్కో అనుభూతిని ఇచ్చే ప్రాంతం ఇది. జపాన్‌లోని ఏ నగరం నుంచైనా ఇక్కడకు టూర్ ప్యాకేజీలు ఉన్నాయంటే ఇది ఎంత ప్రసిద్ధి పొందిన టూరో అర్థం చేసుకోవచ్చు.
ఈ పర్యాటక ప్రాంతంలో బాంబూ ఫారెస్ట్‌తో పాటు వెయ్యేళ్ల క్రితం నాటి టొగెట్సుక్యో వంతెన, విభిన్న జాతులకు చెందిన కోతులుండే మంకీ పార్క్, సాగా-టొరిమొటో వీధి (ఇది రెండు వందల ఏళ్ల క్రితం కట్టిన భవనాలు మాత్రమే ఉన్న వీధి), వివిధ ఆలయాలు, సాగా సీనిక్ రైల్వే వంటి వెన్నో ఉన్నాయి.
ఇక్కడ ప్రతిదానికీ ప్రత్యేకత ఉంది. టొగెట్స్యుకో వంతెన వెయ్యేళ్ల క్రితం కట్టారు. అప్పటికే ఇది పర్యాటకాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించారట. అది బాగా శిథిలం కావడంతో నిత్యం జన సందోహం ఉండే ప్రాంతమని 1930 లో దానిని పునర్నిర్మించారు. అంటే కొత్తవంతెనకు కూడా ఎనభై ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. ఇక్కడ కొండల్లో ఒక రైల్వే లైన్ ఉంది. అందులో ప్రయాణమే ఒక అనుభూతి. ఆ రైలు మార్గానికి ఒకవైపేమో ఎత్తయిన కొండ అడవులతో నిండి ఉంటుంది. మరో వైపు ఏమో నది ప్రవహిస్తూ ఉంటుంది. ఏదో ఒక అందాన్నే చూడగలం... ఎందుకంటే రెండూ వేర్వేరు వైపు ఉంటాయి కదా. ఇక్కడకు వస్తే కచ్చితంగా ఈ రైలు మార్గంలో పయనించాల్సిందే.
ఆకట్టుకునే ఆలయాలు
ఇక్కడ ఆలయాల్లో ఆధ్యాత్మికతే కాదు... ఆర్కిటెక్చర్ కూడా ప్రధానమైనదే. ఇక్కడున్న టెన్య్రుజి టెంపుల్ జపాన్‌లో ప్రముఖ జైన దేవాలయం. దీనిని 1339లో కట్టారు. కానీ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఇందులో గార్డెన్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా చెక్కుచెదరకుండా ఉండటమే కాదు ఈ మధ్యనే కట్టిన గుడి అన్నంత కొత్తగా ఉంటుంది. అందుకే దీనికి యునెస్కో గుర్తింపు దక్కింది. దీంతో ఇది ప్రపంచ పర్యాటకుల దృష్టిలో పడింది. అలాగే ప్రశాంత చిత్తంతో ధ్యానముద్రలో ఉన్న కొన్ని వందల విగ్రహాలుండే ఒతగి టెంపుల్ కచ్చితంగా చూడదగ్గది. ఇంకా ప్రకృతి మధ్య ఒదిగి ఉండే నిసోనిన్ టెంపుల్, గియోజీ టెంపుల్, అదాషినో టెంపుల్, 1596లో కట్టిన జకోజీ టెంపుల్ కనుల విందు చేసే వైవిధ్యమైన నిర్మాణాలతో సుందరంగా, ప్రశాంతంగా ఉంటాయి.
ఒక్కసారి ఆ ఫారెస్ట్‌లో అడుగుపెడితే...
అరషియామాలో మీరెన్ని చూసినా మీకు గుర్తుండేది, మిగతా అన్నింటినీ మరిపించేలా చేసేది బాంబూ ఫారెస్ట్ మాత్రమే. దానికి ముందు, దాని తర్వాత మీరు జీవిత కాలంలో ఎన్ని పర్యాటక స్థలాలు చూసినా... ఈ బాంబూ ఫారెస్ట్‌ను మాత్రం మరిచిపోరు. అంత ప్రత్యేకత దానిది. అది ఒక అడవిలా కాకుండా కళాఖండంలా కనిపిస్తుంది. స్వర్గానికి ఒక దారిని డిజైన్ చేస్తే అది కచ్చితంగా ఇలాగే చేయాలేమో అనిపించేలా ఉంటుంది ఆ ప్రదేశం. స్కేలు పెట్టి గీచినట్టు ఉండే వెదురు చెట్లు ఏపుగా పచ్చగా పెరిగి ఉంటాయి. వాటి మధ్యలో కొలిచి నిర్మించినట్టు ఉండే వెదురు బొంగుల మెట్ల దారి అలా కట్టిపడేస్తుంది. ఇంకో రూట్లో వెళితే వెదురు పలకలతో నిర్మించిన రోడ్డు. దానిమీద నడుస్తుంటే ఆ ఫీలింగే గొప్పగా ఉంటుంది. వెదురు చెట్లలో కాలిబాటకు అటు ఇటు చిన్న వెదురు కట్టెలతో రెయిలింగ్ చూడటానికి ముచ్చటేస్తుంది. మనోహరంగా పచ్చగా ఉండే ఆ వెదురు చెట్లలో ఒక్కో చోట ఒక్కరకమైన కాలిబాటలు వేశారు. ఒకచోట విశాలంగా వెదురు రోడ్లు, మరో చోట చిన్న కాలిబాటు మెట్లతో కూడిన దారి... ఇంకో చోట రాలిన ఆకుల మామూలు కాలిబాట, ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన రాళ్లతో కూడిన కాలిబాట... అబ్బో ఒకటేమిటి ఎన్నో అందాలు. అలా రోజంతా అక్కడే ఉండి ఉదయం-సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడకు వచ్చి ఫొటో దిగని పర్యాటకుడు ఉండనే ఉండరు.
ఎపుడు వెళ్లాలి!
జపాన్ టూర్లన్నీ మార్చి-నవంబరు మధ్య వెళ్లడం మంచిది. క్యోటో టూర్ అయితే మే నుంచి వెళ్లడం వల్ల దేశంలో జరిగే ప్రముఖ ఫెస్టివల్స్‌ను చూసే అవకాశం వస్తుంది. ఆగస్టు, సెప్టెంబరులో మూడు ఫెస్టివల్స్ ఉంటాయి. వీటిని కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ కాలంలో వెళితే బెటర్.
ఎలా చేరుకోవాలి...
ఇంటర్నేషనల్ టూర్స్ అంటే ఫ్లైట్ ఎక్కాల్సిందే. క్యోటో జపాన్ పెద్ద నగరాల్లో ఒకటి అయినా కూడా సొంత విమానాశ్రయం లేదు. వంద కిలోమీటర్ల దూరంలోని కన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడకు చేరుకోవాలి. అసలే జపాన్ టెక్నాలజీలో ముందుండే దేశం. ఇక అక్కడ్నుంచి క్యోటోకి చేరుకోవడానికి ఇబ్బందా చెప్పండి.. అందుకే నిశ్చింతంగా బయలుదేరండి. రోడ్డు, రైలు వంటి అన్ని అత్యాధునిక రవాణా మీకందుబాటులో ఉంటుంది. క్యోటో నుంచి అరషియామాకు కేవలం ఎనిమిది కిలోమీటర్లు. బైకులు, సైకిళ్లు కూడా అద్దెకు దొరుకుతాయి.