3లక్షలకు మించి నగదు లావాదేవిలపై నిషేధం!
న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నల్లధనం నియంత్రణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక సూచనలు చేసింది. రూ. మూడు లక్షలకు మించి జరిగే నగదు లావాదేవిలన్నింటినీ నిషేధించాలని సిఫారసు చేసింది. అదేవిధంగా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి వద్ద రూ. 15 లక్షలకు నగదు ఉండకూడదనే ఆంక్షలు విధించాలని సిఫారసు చేసింది.
నల్లధనం నియంత్రణకు రిటైర్డ్ జస్టిస్ ఎంబీ షా నేతృత్వం సుప్రీంకోర్టు సిట్ ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. సిట్ తాజాగా నల్లధనాన్ని ఎలా అదుపులోకి తేవాలన్న అంశంపై తన ఐదో నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి అందజేసింది. దేశంలో పెద్దమొత్తంలో ప్రభుత్వ లెక్కల్లోకి రాని సంపద పోగై ఉందని, ఇదంతా నగదు రూపంలో నిల్వచేయబడిందని సిట్ అభిప్రాయపడింది.
ఈ విషయమై వివిధ దేశాలు తీసుకొచ్చిన నిబంధనలు, పలు సందర్భాల్లో వివిధ న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలు పరిగణనలోకి తీసుకొని నగదు లావాదేవిలపై పరిమితి విధించాల్సిన అవసరముందని తాను భావిస్తున్నట్టు సిట్ పేర్కొంది. రూ. 3 లక్షలకు మించి నగదు లావాదేవిలన్నింటిపైనా నిషేధం విధించాలని, ఇందుకోసం ఓ చట్టాన్ని తీసుకొచ్చి.. రూ. 3 లక్షలకు మించిన లావాదేవీలను అక్రమమైనవిగా ప్రకటించి.. చట్టబద్ధంగా శిక్ష విధించాలని సిట్ సూచించింది.