కిటకిట.. కటకట
⇒ ఏటీఎంల ముందు క్యూకట్టిన జనం
⇒ బంక్‌ల్లో నోట్లు మార్చేందుకు ప్రయత్నం
⇒ సామాజిక మాధ్యమాల్లో పేలుతున్న జోకులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
ప్రస్తుతం చెలామణిలో ఉన్న పెద్ద నోట్లు ఇకపై చెల్లవంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో జిల్లాలోని ఏటీఎంలు, పెట్రోల్ బంక్‌లు, రాత్రివేళ పనిచేసే బ్యాంకులు ఖాతాదారులతో కిటకిటలాడాయి. కరెన్సీ నోట్లను మార్చేందుకు కటకటలు మొదలయ్యాయి. రూ.500, రూ.1,000 నోట్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి చెల్లవని ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటన న్యూస్ చానల్స్‌తోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ హల్చల్ చేసింది. ఆకస్మిక నిర్ణయంతో వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు పేద, మధ్య తరగతి ప్రజలు సైతం కంగుతిన్నారు.
తమవద్ద ఉన్న రూ.500, రూ. వెయ్యి నోట్లను బ్యాంకు ఏటీఎం కౌంటర్లలోని క్యాస్ డిపాజిట్ మెషిన్ల (సీడీఎం) ద్వారా తమతమ బ్యాంక్ అకౌంట్లలో జమ చేసుకునేందుకు బారులు తీరారు. మహిళలు సైతం పెద్దఎత్తున ఏటీఎంల ఎదుట క్యూ కట్టారు. రెండు రోజులపాటు ఏటీఎం మెషిన్లు, బ్యాంకులు పనిచేయవనే ప్రకటనతో ఇబ్బందులు తప్పవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏటీఎంల వద్దకు రాత్రి 12 గంటల వరకూ జనం వస్తూనే ఉన్నారు. కొన్నిచోట్ల అయితే జనం తాకిడిని తట్టుకోలేక ఏటీఎం సెంటర్లను మూసివేశారు. పెట్రోల్ బంక్‌ల్లో ఈ నోట్లను మార్చుకోవచ్చని చెప్పడంతో ప్రజలు వాటిఎదుట క్యూ కట్టారు. వాటిలో ఉన్న రూ.100 నోట్లు అయిపోవడంతో పెట్రోల్ బంక్ల్లోనూ తగిన చిల్లర ఉంటేగాని పెట్రోల్ పోసేది లేదంటూ భీష్మించారు. మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల నల్లధనం వెలుగులోకి వస్తుందని, దొంగ నోట్లను సైతం అరికట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆక్వా రంగానికి ఆలవాలమైన ఈ జిల్లాలో దొంగనోట్ల చెలామణి అధికంగానే ఉంది. వీటివల్ల వ్యాపారులతోపాటు సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
మోదీ తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా.. ఆకస్మిక ప్రకటన వల్ల సామాన్యులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా నిర్ణయంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. రూ.500 నోట్లు, పల్లీలు చుట్టుకోవడానికి, మేకలకు ఆహారంగా వేయడానికి ఉపయోగిస్తున్నట్టుగా ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. ’మంగళవారం రాత్రి ఎవరింట్లో దీపాలు వెలుగుతుంటే వారు డబ్బులు లెక్కపెట్టుకుంటున్నట్టు లెక్క’ అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.