పత్రికలపైనా నిషేధం!
మంచుకొండలతో ఎప్పుడూ చల్లగా ఉండే కశ్మీరం ఇప్పుడు రగిలిపోతోంది. గత కొన్నాళ్లుగా అక్కడ చెలరేగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి తప్ప చల్లారడం లేదు. హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన బుర్హాన్ వనీ అనే ఉగ్రవాదిని భద్రతాదళాలు కాల్చి చంపడంతో మొదలైన ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఇంటర్నెట్ను ఆపేసినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. దాంతో మూడు రోజుల పాటు పత్రికలు కూడా ఏవీ విడుదల కాకుండా అక్కడ ఆపేశారు. అధికారులు చెప్పిన మూడు రోజుల గడువు ముగిసిపోయినా కూడా మంగళవారం సైతం జమ్ము కశ్మీర్లో పత్రికలేవీ బయటకు విడుదల కాలేదు. నిషేధం ఎత్తేయాలన్న నిర్ణయాన్ని సోమవారం సాయంత్రం తర్వాత ప్రకటించడంతో.. అప్పటికప్పుడు మంగళవారం ఎడిషన్ తీసుకురావడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో పత్రికలన్నీ కలిసి నిర్ణయం తీసుకున్నాయి.
అయితే.. పత్రికలపై నిషేధం విధించిన విషయం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియలేదని సమాచారం. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ బాధ్యతలను కొత్తగా చేపట్టిన వెంకయ్యనాయుడు ఈ అంశంపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఫోన్ చేసి విచారించారు. నిషేధం ఏమైనా ఉందా అని అడిగితే.. ఇప్పుడేమీ లేదని ఆమె సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ గత నాలుగు రోజులుగా కశ్మీర్లో ఎక్కడా పత్రికలు విడుదల కాలేదు. అంటే ఇదంతా అప్రకటిత నిషేధమా అన్నది తెలియాల్సి ఉంది. పత్రికల నిషేధం అంశానికి ముఖ్యమంత్రి అనుమతి కూడా లేదని మెహబూబా ముఫ్తీ రాజకీయ సలహాదారు అమితాబ్ మట్టూ చెప్పారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఈ చర్య తీసుకోక తప్పలపేదని సీనియర్ మంత్రి నయీమ్ అఖ్తర్ అన్నారు. శనివారం తెల్లవారుజామున పోలీసులు పత్రికల కాపీలను సీజ్ చేయడంతో అప్పటినుంచి పత్రికల ప్రచురణ ఆగిపోయింది.
జూలై 8వ తేదీన భద్రతాదళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ మరణించాడు. అప్పటి నుంచి కశ్మీర్లో హింసాత్మక ఘటనలు పెచ్చుమీరాయి. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ యువతి కూడా మంగళవారం మరణించింది.