బుగ్గితో రాజధాని నిర్మాణం!
రాజధాని నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలో రైతుల నుండి భూ సమీకరణ జరపాలని నిర్దేశించిన ప్రాంతంలో ఇటీవల పచ్చటి పంటపొలాలను, తోటలను దుండగులు బుగ్గిపాలు చేశారు. ఈ అమానుషకాండకు రైతుల అరటి తోటలు, షెడ్డులు, డ్రిప్ ఇరిగేషన్ సామగ్రి, ఎరువులు వగైరా కాలి బూడిదయ్యాయి. సీఎం తక్షణమే విచారణకు ఆదేశించడం సమంజసమే. అయితే ఘటన జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఒక మంత్రి అనుయాయులు రైతులే తమ పంటలను తగులబెట్టు కున్నారని, ఇందులో వైఎస్సార్సీపీ కార్యకర్తల హస్త ముందని చేసిన వెకిలి వ్యాఖ్యల వల్ల బాధిత రైతు లకు పుండు మీద కారం రాసినట్టు అనిపించడం సహజమే. కాబట్టే వారు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఆమోదయోగ్యమైన రీతిలో, వారిని ఒప్పించి సేకరించిన భూము లతో రాజధానిని నిర్మిస్తేనే ప్రజలు హర్షిస్తారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. ఏదిఏమైనా భూములు ఇచ్చేదిలేదని రైతులు చెబు తుండగా, వారిని బెదిరించి అధికారాన్ని ప్రయోగించి భూములను స్వాధీనం చేసుకోవాలని చూడటం అనర్థదాయక పరిణామాలకు దారితీస్తుంది. ప్రభుత్వం విజ్ఞతను చూపాల్సిన సమయమిది.
-ఎమ్. ఎస్. రావు గోకివాడ, తూర్పు గోదావరి జిల్లా