'చంద్రబాబును తీసేయండి సారూ...'
బండమీదపల్లి: తమకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదని అనంతపురం జిల్లా రైతులు, డ్వాక్రా మహిళలు... వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. రుణమాఫీ చేస్తామని చంద్రబాబు తమను వంచించారని వాపోయారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసాయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం బండమీదపల్లిలో రైతులు, మహిళలతో వైఎస్ జగన్ ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
రమణారెడ్డి: బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి రెండేళ్లయింది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా.
ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ఇంకా ఎన్నిరోజులు ఎదురుచూడాలి? ఇంకా ఎన్నిరోజులు మాకీ కష్టాలు?
శివయ్య: చంద్రబాబు రుణమాఫీ అన్నాడు. లక్ష రూపాయలు పంట రుణం తీసుకున్నాను. 11 వేల రూపాయలు మాత్రమే మాఫీ అయింది. వడ్డీ కింద జమ చేసుకున్నారు. ఏడు వేల రూపాయలు అదనంగా వడ్డీ కట్టాను. బ్యాంకులో 4 తులాలు తాకట్టు పెడితే వేలానికి పెట్టారు.
పార్వతమ్మ: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు ఇప్పటివరకు పైసా మాఫీ చేయలేదు.
లక్ష్మీనర్సమ్మ: చంద్రబాబును తీసేయండి సారూ.. డ్వాక్రా రుణాలు తీసుకున్నాం. ఇంతవరకు రూపాయి కూడా మాఫీ కాలేదు. వైఎస్ రాజశేఖరెడ్డి ఉన్నప్పుడు డ్వాక్రా రుణం మాఫీ అయింది.
కాంతమ్మ: బ్యాంకులో 8 తులాల బంగారం తాకట్టు పెట్టి లక్షా 9వేల రూపాయలు తీసుకున్నాం. వడ్డీ కట్టేసినా మళ్లీ నోటీసులు వచ్చాయి. బోర్లు వేసి నష్టపోయాం. పంటలు పండక చితికిపోయాం. చంద్రబాబును తీసిస్తే మేము బాగుపడతాం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి.
గోవిందమ్మ: మా పొలంలో చెట్లు అన్ని నరికేశారు. ఈ ఊర్లో ఒక్కరు కూడా మా తరపున మాట్లాడలేదు. మా ఐదెకరాల భూమిని నాశనం చేశారు. మాకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఒక్క ప్రభుత్వ పథకం కూడా అందలేదు. లక్ష రూపాయలు తీసుకున్నా. వడ్డీకి వడ్డీకి వేశారు. రుణమాఫీ కూడా కాలేదు.
వైఎస్ఆర్ సీపీకి పనిచేస్తున్నామని మా అవ్వకు పెన్షన్ ఇవ్వడం లేదు, ఎవరికి చెబుతారో చెప్పుకోండి. కేసు పెడతామని బెదిరించారని ఓ యువకుడు వైఎస్ జగన్ కు తెలిపాడు.