అత్తను భవనంపై నుంచి తోసేసిన అల్లుడు
అబిడ్స్: భార్యను తనతో పంపాలంటూ అత్తతో గొడవకు దిగిన ఓ అల్లుడు అత్తను భవనంపై నుంచి కోపంతో నెట్టివేశాడు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్ పరిధిలోని కార్వాన్ జోషివాడిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ బండారి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... బోరబండ ప్రాంతంలో నివాసముండే గోపాల్, రాణి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే గోపాల్ ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. భార్యను కొడుతూ రోజూ తగవు పెట్టుకుంటున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన రాణి రెండు రోజుల క్రితం కార్వాన్ జోషివాడిలో నివాసముండే తల్లి యశోదా బాయి(60) వద్దకు వచ్చింది.
గోపాల్ గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నేరుగా రాణి ఉంటున్న ఇంటికి వచ్చి అత్త యశోదాబాయితో వాగ్వాదానికి దిగాడు. అయితే, తన కుమార్తెకు నిత్యం నరకం చూపిస్తున్నందున పంపేది లేదని గోపాల్‌తో తెగేసి చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన గోపాల్ ఆమెను రెండో అంతస్తులోని బాల్కనీ నుంచి కిందికి నెట్టివేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో టప్పాచబుత్ర పోలీసులు వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు గోపాల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును టప్పాచబుత్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.