పుత్తడిపురం వెలవెల
♦ రెండు వారాలుగా బంగారం దుకాణాలు బంద్
♦ కేంద్ర ఎక్సైజ్ ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్
♦ ఆగిన కోట్ల రూపాయల వ్యాపారం
♦ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందిపై ప్రభావం
తక్కువలో తక్కువ అంటే ప్రొద్దుటూరులో రోజూ 10 కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది. మంచి బంగారం దొరుకుతుందని ఎక్కడెక్కడి నుంచో నగల కొనుగోలుకు కార్లు, బస్సులు, రైళ్లలో జనం వచ్చే వారు. దుకాణాలు మూత పడటంతో బయటి నుంచి వచ్చే వారు లేక హోటళ్లు సైతం వెలవెలబోతున్నాయి.
ఆగిన కోట్ల రూపాయల టర్నోవర్
ప్రొద్దుటూరు పట్టణంలో 500కుపైగా బంగార ం విక్రయించే దుకాణాలున్నాయి. 3 నుంచి 5 వేల మంది కార్మికులు బంగారం ఆభరణాలు తయారు చేయడానికి, మరమ్మతులు చేయడానికి ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరు తయారు చేసిన బంగారు, వెండి నగలను వ్యాపారులు ప్రజలకు విక్రయిస్తారు. రాయలసీమ జిల్లాలతోపాటు పక్క రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇక్కడి వ్యాపారులపై నమ్మకంతో వచ్చేవారు. కోట్ల రూపాయల టర్నోవర్ జరిగేది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో సాధారణంగా అటు వ్యాపారులకు, ఇటు కార్మికులకు లబ్ధి చేకూరేది. దుకాణాలు మూత పడటంతో వీటిలో పని చేసే గుమాస్తాలు, సేల్స్మెన్లు దాదాపు 10 వేల మంది నష్టపోతున్నారు. ఏప్రిల్ నెల దాటితే మరో రెండు నెలల వరకు శుభకార్యాలు నిర్వహించడానికి ముహూర్తాలు లేవు. ఇలాంటి కీలక సమయంలో దుకాణాలు మూత పడటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.
ప్రొద్దుటూరు : కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలపై విధించిన ఒక శాతం ఎక్సైజ్ ట్యాక్స్‌ను నిరసిస్తూ ఆ వ్యాపారం చేసే వర్తకులు సుమారు రెండు వారాలుగా దుకాణాలు మూసి వేయడంతో రెండవ ముంబయిగా పేరు గాంచిన ప్రొద్దుటూరు వెలవెలబోతోం ది. నాణ్యమైన బంగారం విక్రయిస్తారనే పేరుండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వచ్చే వారు. దుకాణాలు మూసి వేయడంతో బంగారు, వెండి వస్తువులు అమ్మే దుకాణాల యజమానులతో పాటు వాటిని తయారు చేసే కార్మికులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం గత నెల 29న కొత్తగా బంగారు వ్యాపారంపై ఒక శాతం సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను అమలు చేస్తూ బడ్జెట్లో ప్రకటించింది.
ఈ విధానాన్ని నిరసిస్తూ వ్యాపారులు ఇప్పటికే పలు రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ర్యాలీలు, వంటా వార్పు, అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు అన్ని ప్రాంతాల్లో ఈ బంద్ కొనసాగుతోంది. మన జిల్లాలోని ముఖ్య పట్టణాల్లోని బంగారం దుకాణాలను మూసివేశారు. అయితే పుత్తడి పురంగా ప్రసిద్ధి గాంచిన ప్రొద్దుటూరుపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. స్వర్ణకారులతోపాటు ఈ దుకాణాల్లో పని చేసే సిబ్బంది కూడా నష్టపోతున్నారు. పూర్వం నుంచి మెయిన్ బజార్లో బంగారం దుకాణాలు ఉండగా.. కాలక్రమంలో అనేక కాంప్లెక్స్‌లు వెలిశాయి. కాంప్లెక్స్‌లలో వ్యాపారులతోపాటు వాటిని తయారు చేసే వారు కూడా దుకాణాలను నిర్వహిస్తున్నారు. మోక్ష గుండం వీధిలో బంగారం దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీరిపై ఆధారపడి ఎన్నో టీ, కూల్‌డ్రింక్ షాపులు, టిఫిన్, భోజన హోటళ్లు వారు జీవనం సాగిస్తున్నారు.
ఆందోళనలో కార్మికులు
బంగారం దుకాణాల బంద్ కారణంగా చిన్న చిన్న వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దుకాణాల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక, మరో వైపు బాడుగులు చెల్లించే పరిస్థితి లేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే అసోసియేషన్ వారు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, టీడీపీ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డిలను కలిసి సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధానాన్ని రద్దు చేయాలని పార్లమెంటులో ఎంపీల ద్వారా చర్చించేలా చూడాలని కోరారు. ఈ నెల 17వ తేదీ వరకు దుకాణాల బంద్ కొనసాగనుంది. ఆ తర్వాత అసోసియేషన్ నిర్ణయం మేరకు భవ్యష్యత్ కార్యాచరణ ఉంటుంది.
అద్దెలు చెల్లించే పరిస్థితి లేదు
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కారణంగా దుకాణాలు బంద్ చేశాం. ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారాలు లేక అద్దెలు కూడా చెల్లించే పరిస్థితి లేదు. చిన్న స్థాయి స్వర్ణకారుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. - ఎం.ఫయాజ్, స్వర్ణ కార్మికుడు
ఎన్నడూ ఇలాంటి బంద్ జరగలేదు
ఇటీవలి కాలంలో ఎన్నడూ ఇన్ని రోజుల పాటు దుకాణాలను మూసివేసిన సందర్భం లేదు. సీజన్లో వ్యాపారాలు కోల్పోతున్నాం. ఇప్పటికే రెడిమేడ్ వస్తువుల కారణంగా వ్యాపారాలు తగ్గిపోయాయి. ఈ పరిణామం ఊహించలేదు.- బి.నాగేంద్రరావు, బీఎన్ఆర్ జ్యువెలర్స్
పన్ను పేరుతో ఇబ్బంది పెడతారు
సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ అమలైతే ఆ పేరుతో అధికారులు తమను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తారు. పూర్వం ఈ విధా నం అమలులో ఉన్నప్పుడు పోరాటం చేసి రద్దు చేయించుకున్నాం. అదే పరిస్థితి మళ్లీ వస్తుందంటే ఎలా అంగీకరించగలం? జిల్లా అంతటా దుకాణాలు మూతపడ్డాయి. - గూడూరు రామమనోహర్‌రావు, బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు