కల్లూరులో రోడ్డుప్రమాదం: ముగ్గురి మృతి
–కంటైనర్ లారీని ఢీకొట్టిన అంబులెన్స్
– ముగ్గురు మృతి..మరో ముగ్గురికి గాయాలు
– మృతులు అనంతపురం జిల్లా వాసులు
– కొంగనపాడులో ఘటన
– ఘటన స్థలాన్ని పరిశలించిన ఎస్పీ
– అతివేగమే ప్రమాదానికి కారణం
బుధవారం తెల్లవారు జామున 3గంటలు..అందరూ నిద్రలో ఉన్నవేళ..కుయ్‌కుయ్‌మంటూ రయ్యిన దూసుకుపోతున్న అంబులెన్స్.. అందులో ఒక వృద్ధురాలికి హృదయ సమస్య..హైదరాబాద్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంది. అంబులెన్స్‌లో ఉన్న ఆమె కుమారుడు, కుమార్తె, చెల్లెలులో ఉత్కంఠ..లయతప్పుతున్న గుండె మళ్లీ కొట్టుకుంటుందో లేదోననే ప్రశ్నలు..వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌తోపాటు వారి ఆలోచనలూ శరవేగంగా ప్రయాణిస్తున్నాయి.. ఆపరేషన్ సమయానికి చేరుకుంటామనే ధీమాలో ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఓ కుదుపు..కన్ను తెరిచి చూసేలోగా అంబులెన్స్..కంటైనర్ లారీ కిందకు దూరిపోయింది. కటిక చీకటిలో వారి ఆపరేషన్ ‘కల’ కన్నీరై కరిగింది.. అతివేగానికి మూడు గుండెలు ఆగిపోయాయి!
కల్లూరు (రూరల్): ఆగి ఉన్న కంటైనర్ లారీని అంబులెన్స్ ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం 44వ జాతీయ రహదారిలోని కొంగనపాడు ఫై ్ల ఓవర్ సమీపంలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన దివంగత రిటైర్డ్ ఏఆర్ ఎస్ఐ ఫకృద్దీన్ భార్య ప్యారీబీ (64) గుండెపోటుతో అనంతపురంలోని సవీరా ఆసుపత్రిలో వారం రోజుల క్రితం చేరింది. అక్కడి వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని వెంటనే హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో సవీరా ప్రై వేటు ఆసుపత్రికి చెందిన ఏపీ 02 టీసీ 3734 అంబులెన్స్‌లో మంగళవారం రాత్రి 11.30గంటలకు హిందూపురానికి ప్యారీబీ చెల్లెలు నసీమాబేగం(48), అలాగే గుంతకల్లుకు చెందిన ప్యారీబీ కుమార్తె సాహినా బేగం (31), కుమారుడు ఖలందర్ (34) బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో అంబులెన్స్ డ్రై వర్ గోవర్ధన్‌రెడ్డి అతివేగంతో ముందు వెళ్తూ కొంగనపాడు సమీపంలో ఆగి ఉన్న శ్రీ వెంకటేశ్వర గూడ్స్ క్యారీయర్ కంటైనర్ కేఏ 53సీ 1007 లారీని ఢీకొట్టాడు. దీంతో ప్యారీబీ, నసీమాబేగం, షాహినాబేగం అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్‌లో ఉన్న కలందర్ స్పృహ తప్పి పడిపోయాడు. డ్రై వర్కు కాళ్లు విరిగగా, అతని సహాయకుడిగా ఉన్న చిన్నలింగమయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న ఉలిందకొండ ఎస్ఐ వెంకటేశ్వరరావు, వెల్తుర్ది ఎస్ఐ తులసీ నాగప్రసాద్, ఓర్వకల్లు ఎస్ఐ చంద్రబాబునాయుడు.. ఘటన స్థలానికి చేరుకుని లారీ కింద ఇరుక్కున్న ముగ్గురు క్షతగాత్రులను బయటకు తీసి హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, డీఎస్పీ రమణమూర్తి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందని, ఎంతమంది అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ప్యారాబీ బంధువులు కర్నూలు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ప్యారీబీకి హసీన, షాహినాబాను, ఖలందర్, షర్మాస్ వలి నలుగురు సంతానం. ప్రమాదంలో తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. వేగంగా అంబులెన్స్‌ను నడపడం వల్లే ముగ్గురి ప్రాణాలు బలయ్యాయని ఉలిందకొండ ఎస్ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.