చెత్తే కదా అని వదిలేస్తే ఊరుకోం!
బెంగళూరు, న్యూస్‌లైన్ : చెత్తను తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని బెంగళూరు ఇన్చార్జి మంత్రి రామలింగారెడ్డి హెచ్చరించారు. అంతటితో ఆగకుండా చెత్త తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సంగమిత్రను తాను ఉన్న ప్రదేశం నుంచే సస్పెండ్‌కు గురిచేశారు. అలాగే పాలికె సీనియర్ ఇంజనీర్ నరసింహరాజు, అసిస్టెంట్ ఇంజనీర్ లింగన్న, ఇంజనీర్ మోహన్ కుమార్‌ను వారివారి మాతృసంస్థలకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... మంగళవారం ఉదయం మంత్రి రామలింగారెడ్డి నగరంలోని మెయోహాల్ వద్ద బీబీఎంపీ అధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు.
అనంతరం నేరుగా ఆస్టిన్‌టౌన్ చేరుకుని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ ప్రభుత్వ పాఠశాల పక్కనే కుప్పలుతెప్పలుగా పడి ఉన్న చెత్తను చూసి అధికారులపై మండిపడ్డారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న స్థానికులు మాట్లాడుతూ... ఆ ప్రాంతంలో పోగవుతున్న చెత్త వల్ల అనారోగ్యాల పాలవుతున్నట్లు వాపోయారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడికక్కడే ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సంగమిత్రను సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు ఇంజనీర్లను వారి మాతృసంస్థలకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తర్వాత ప్రధాన డ్రెయినేజీ వద్దకు చేరుకోగానే అక్కడ వెలువడుతున్న దుర్గంధాన్ని భరించలేక మంత్రితో సహ అధికారులూ ముక్కులు మూసుకున్నారు. ‘ఒక్క నిమిషానికే ఇలా ముక్కులు మూసుకుంటున్నారే... మరీ స్థానికులు ఎలా ఉండగలుగుతున్నారు? మీరే కనుక ఇక్కడ నివాసముండగలరా?’ అంటూ అదికారులను నిలదీశారు. తక్షణమే అక్కడ దుర్గంధం రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెత్త తొలగింపులో నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట బీబీఎంపీ మేయర్ కట్టె సత్యనారాయణ, ఎమ్మెల్యే హ్యరీష్, పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ, కార్పొరేటర్లు, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది ఉన్నారు.