‘కాలేయ మార్పిడి’లో తెలంగాణ ఆదర్శం
- ఉస్మానియా ఆస్పత్రిలో తక్కువ ఖర్చుకు చేయడంపై దేశవ్యాప్త చర్చ
- ఈ నెల 24-26 తేదీల్లో జరిగే బెంగళూరు జాతీయ సదస్సులో ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో ఉస్మానియా ఆస్పత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయడం ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయ కాలేయ సదస్సులో ఈ అంశం ప్రముఖంగా చర్చకు రానుంది. చెన్నైకి చెందిన ప్రముఖ స్టాన్లీ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యులు తెలంగాణలో తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయడాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అదెలా సాధ్యమైందో అధ్యయనం చేశారు. దీనిపై ప్రత్యేకంగా ఒక డాక్యుమెంట్ను రూపొందించారు.
స్టాన్లీ మెడికల్ కాలేజీ వైద్యులు బెంగళూరులో జరిగే కాలేయ సంబంధిత సదస్సులో ‘ఉస్మానియా ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి’ అనే అంశంపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్ చేయనున్నారు. ఉస్మానియాలో ఇప్పటివరకు నాలుగు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. ఒక్కోదానికి రూ. 10.50 లక్షలు మాత్రమే ఖర్చు అయింది. సహజంగా కాలేయ మార్పిడి చికిత్స చేయాలంటే రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షలు కానుంది. నాలుగో వంతు ఖర్చుకే దీన్ని చేయడం ఎలా సాధ్యపడిందన్నది ఇప్పుడు చర్చగా మారింది. ‘ఇది దేశంలోనే ఆదర్శం. ఇంత తక్కువ ఖర్చుకు కాలేయ మార్పిడి చేయడం అమోఘం’ అని స్టాన్లీ వైద్యులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తితో ఉస్మానియా వైద్యులు కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తిచేసిన సంగతి విదితమే.