Bangalore team
-
రాప్టర్స్ రాకింగ్
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–4) నాలుగో సీజన్లో బెంగళూరు రాప్టర్స్ రాకింగ్ ప్రదర్శనతో టైటిల్ పట్టేసింది. ఆదివారం జరిగిన రసవత్తర టైటిల్ పోరాటంలో బెంగళూరు 4–3తో ముంబై రాకెట్స్‌ను కంగుతినిపించింది. మొదట జరిగిన మిక్స్డ్ డబుల్స్‌ను ‘ట్రంప్’గా ఎంచుకున్న ముంబై రాకెట్స్ ఇందులో గెలిచి శుభారంభం చేసింది. కిమ్ జీ జాంగ్–బెర్నడెత్ (ముంబై) జంట 15–8, 15–14తో మార్కస్ ఎలిస్–లారెన్ స్మిత్ (బెంగళూరు) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ (బెంగళూరు) 15–7, 15–10తో అంటోన్సెన్ (ముంబై)పై నెగ్గి 1–2తో రాకెట్స్ ఆధిక్యాన్ని తగ్గించాడు. బెంగళూరుకు ‘ట్రంప్’ అయిన మహిళల సింగిల్స్‌లో తి ట్రంగ్ వు 15–8, 15–9తో శ్రియాన్షి పరదేశి (ముంబై)ని ఓడించింది. దీంతో 3–2తో బెంగళూరు పైచేయి సాధించింది. అయితే రెండో పురుషుల సింగిల్స్‌లో తెలుగు షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ (బెంగళూరు) 15–7, 12–15, 3–15తో సమీర్ వర్మ (ముంబై) చేతిలో కంగుతిన్నాడు. దీంతో ఇరు జట్లు 3–3తో సమవుజ్జీగా నిలిచాయి. నిర్ణాయక పురుషుల డబుల్స్‌లో మొహమ్మద్ అహ్సాన్–హెండ్ర సెతియవాన్ (బెంగళూరు) ద్వయం 15–13, 15–10తో కిమ్ జీ జాంగ్–లీ యంగ్ డే (ముంబై) జంటపై గెలువడంతో రాప్టర్ నాలుగో సీజన్ విజేతగా అవతరించింది. విజేతగా నిలిచిన బెంగళూరు రాప్టర్స్‌కు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. -
కోల్పోయిన అవకాశం మళ్లీ దక్కింది!
బెంగళూరు: ఫిబ్రవరి 20న ఐపీఎల్ వేలం జరిగిన రోజు ఒక యువ క్రికెటర్ తప్పతాగి రైల్వే ప్లాట్‌ఫాంపైకి కారును తీసుకెళ్లిన ఘటన జరిగింది. ఈ ఘటనకు కారకుడు ముంబైకి చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్మీత్ సింగ్ కాగా... మీడియా మాత్రం మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ హర్‌ప్రీత్ సింగ్ ఫోటోను చూపిస్తూ రోజంతా వార్తను నడిపింది. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో 211 పరుగులతో సెంట్రల్ జోన్ టాపర్‌గా నిలిచి ఐపీఎల్ అవకాశం కోసం ఎదురు చూస్తున్న హర్‌ప్రీత్‌పై దీని ప్రభావం పడింది. మంచి ఆల్‌రౌండ్ నైపుణ్యంతో గతంలో రెండు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన రికార్డు ఉన్నా, పోలీసు కేసు అతని ఎంపికపై తీవ్ర ప్రభావం చూపించింది. అప్పటికే యాక్సిడెంట్ గురించి విన్న ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు హర్‌ప్రీత్‌ను పట్టించుకోలేదు. మీడియా అత్యుత్సాహం తన అవకాశాలు దెబ్బ తీసిందంటూ అతను తీవ్ర ఆవేదన చెందాడు. అయితే ఇప్పుడు అతనికి అదృష్టం కలిసొచ్చింది. గాయపడిన సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో బెంగళూరు జట్టు హర్‌ప్రీత్‌ను తీసుకోవడంతో అతనికి మరో అవకాశం దక్కింది. -
వారెవ్వా... నైట్ రైడర్స్
మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్‌కు కోల్‌కతా రాణించిన ఉతప్ప, షకీబ్, నరైన్ 30 పరుగులతో బెంగళూరుపై గెలుపు ఓటమితో కోహ్లి సేన ఆశలు ఆవిరి ఈ సీజన్ ఐపీఎల్లో తొలి ఏడు మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలిచింది కేవలం రెండే. ఆ దశలో ఈ జట్టు ప్లే ఆఫ్ మాట అటుంచి... పాయింట్ల పట్టికలో కింద నుంచి ఎన్నో స్థానంలో నిలుస్తుందనే అంశంపై చర్చ జరిగింది. కానీ గంభీర్ సేన అద్భుతం చేసింది. ఆ తర్వాత వరుసగా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి... మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. ఉతప్ప, నరైన్, షకీబ్‌ల అద్భుత ప్రదర్శనతో బెంగళూరును ఇంటిదారి పట్టించింది. కోల్‌కతా: కావలసినంత డబ్బు... పార్టీలు... ఆటగాళ్లను బాగా చూసుకునే యాజమాన్యం... సీజన్లు, ఆటగాళ్లు మారినా బెంగళూరు జట్టు మాత్రం తన స్థాయిని అలా కొనసాగిస్తూనే వచ్చింది. ఈ సీజన్లోనూ వేలంలో డబ్బుకు వెరవకుండా స్టార్ ఆటగాళ్లతో జట్టును నింపింది. కానీ రాత మాత్రం మారలేదు. విజయ్‌మాల్యాకు మరోసారి రాయల్ చాలెంజర్స్ నిరాశనే మిగిల్చింది. కోహ్లి సారథ్యంలోని బెంగళూరు జట్టుకు మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్ ఆశలు ఆవిరయ్యాయి. రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లిసేన 30 పరుగుల తేడాతో కోల్‌కతా చేతిలో ఓడిపోయింది. గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉతప్ప (51 బంతుల్లో 83 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), షకీబ్ (38 బంతుల్లో 60; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ స్కోరు అందించారు. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. టకవాలె (36 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (31 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా.. నరైన్ (4/20) స్పిన్ మ్యాజిక్‌తో బెంగళూరుకు ముకుతాడు వేశాడు. ఉతప్ప, షకీబ్ హిట్ కోల్‌కతా తొలి ఓవర్లోనే గంభీర్ (4) వికెట్‌ను చేజార్చుకుంది. మూడు ఫోర్లు కొట్టి జోరుమీదున్నట్లు కనిపించిన పాండే (13) దిండా బౌలింగ్‌లో అవుట్‌కాగా.. ఉన్నంతసేపు దడదడలాడించిన యూసుఫ్ పఠాన్ (22) రనౌటయ్యాడు. 56 పరుగులకే మూడు కీలక వికెట్లు చేజార్చుకున్న దశలో ఉతప్పకు షకీబ్ జత కలిశాడు. భారీ స్కోరును అందించే బాధ్యతను ఇద్దరూ భుజాన వేసుకున్నారు. ఫోర్లతో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఉతప్ప 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్లో ఉతప్పకిది ఐదో అర్ధసెంచరీ కాగా... అత్యధిక పరుగుల రేసులో మ్యాక్స్‌వెల్‌ను వెనక్కినెట్టి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు ఇన్నింగ్స్ 15వ ఓవర్లో చహల్ బౌలింగ్‌లో షకీబ్ రెచ్చిపోయాడు. ఒక ఫోర్, మూడు సిక్సర్లు కొట్టాడు. అదే ఊపులో ఫోర్ కొట్టి 32 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే స్కోరు పెంచే ప్రయత్నంలో అవుటైన షకీబ్ నాలుగో వికెట్‌కు ఉతప్పతో కలిసి 70 బంతుల్లో 121 పరుగులు జోడించాడు. చివర్లో ఉతప్ప, డస్కాటే చెలరేగడంతో కోల్‌కతా భారీస్కోరు చేసింది. నరైన్ స్పిన్ మ్యాజిక్ లక్ష్యఛేదనలో చాలెంజర్స్ రెండో ఓవర్లోనే గేల్ (6) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ టకవాలె, కెప్టెన్ కోహ్లి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో స్కోరులో వేగం పుంజుకుంది. రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారిన ఈ జోడికి నరైన్ బ్రేకులు వేశాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో తొలుత కోహ్లిని, ఆ తర్వాత టకవాలెను అవుట్ చేశాడు. 14వ ఓవర్లో బెంగళూరు స్కోరు వంద దాటింది. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో యువరాజ్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. మొత్తానికి ఆ ఓవర్లో బెంగళూరుకు 22 పరుగులు వచ్చాయి. అయితే చేయాల్సిన పరుగులు, బంతుల మధ్య కొండంత వ్యత్యాసం ఉండటంతో బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనయ్యారు. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న నరైన్ స్పిన్ మ్యాజిక్‌తో ఒకే ఓవర్లో యువరాజ్ (22), డివిలియర్స్ (13)లను డగౌట్‌కు పంపాడు. చివర్లో రాణా, స్టార్క్ ధాటిగా ఆడినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప నాటౌట్ 83; గంభీర్ (సి) టకవాలె (బి) స్టార్క్ 4; మనీష్ పాండే (సి) స్టార్క్ (బి) దిండా 13; యూసుఫ్ రనౌట్ 22; షకీబ్ (బి) అహ్మద్ 60; డస్కాటే నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) : 195. వికెట్ల పతనం: 1-5; 2-23; 3-56; 4-177. బౌలింగ్: స్టార్క్ 4-0-32-1; దిండా 4-0-38-1; అహ్మద్ 4-0-33-1; మురళీధరన్ 2-0-19-0; యువరాజ్ 2-0-21-0; చహల్ 4-0-50-0. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: గేల్ ఎల్బీడబ్ల్యూ (బి) ఉమేశ్ 6; టకవాలె (బి) నరైన్ 45; కోహ్లి (సి) మోర్నీ మోర్కెల్ (బి) నరైన్ 38; యువరాజ్ (సి) వినయ్ (బి) నరైన్ 22; డివిలియర్స్ (బి) నరైన్ 13; రాణా నాటౌట్ 19; స్టార్క్ నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) : 165. వికెట్ల పతనం: 1-7; 2-92; 3-93; 4-129; 5-133. బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-21-0; ఉమేశ్ 4-0-45-1; నరైన్ 4-0-20-4; వినయ్ 4-0-44-0; షకీబ్ 4-0-27-0. -
బెంగళూరు జోరు
ముంబైపై ఏడు వికెట్లతో ఘనవిజయం పార్థివ్ అర్ధసెంచరీ రాణించిన డివిలియర్స్ కోహ్లి, గేల్ రాణిస్తేనే బెంగళూరు గెలుస్తుందన్న అభిప్రాయమేదైనా ఉంటే ఇక మార్చుకోవాలేమో! ఎందుకంటే గేల్ డగౌట్ కే పరిమితమైనా, కోహ్లి, యువరాజ్ సింగ్ విఫలమైనా రాయల్ చాలెంజర్స్ జోరు ఏమాత్రం తగ్గలేదు. తొలుత బౌలర్లు.. అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ముకుతాడు వేస్తే, ఆపై పార్థివ్ పటేల్, డివిలియర్స్‌లు సమయోచిత బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని ఛేదించారు. ఫలితంగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు అలవోకగా గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు ముంబై వరుసగా రెండో పరాజయాన్ని మూట గట్టుకుంది. దుబాయ్: ఐపీఎల్-7 టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన బెంగళూరు జట్టు అందుకు తగ్గట్టుగానే జోరు కనబరుస్తోంది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీపై గెలిచిన ఊపును కొనసాగిస్తూ.. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన తమ రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లి సేన.. బౌలర్లు సమష్టిగా రాణించడంతో ముంబైని నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులకే కట్టడి చేసింది. యజ్వేంద్ర చహల్, వరుణ్ ఆరోన్, మిచెల్ స్టార్క్‌లు రెండేసి వికెట్లు పడగొట్టి ముంబై బ్యాట్స్‌మెన్‌కు ముకుతాడు వేశారు. అంబటి రాయుడు (37 బంతుల్లో 35; 1 ఫోర్) మినహా మిగిలిన వారెవరూ క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు ఆరంభంలోనే కోహ్లితో సహా మూడు వికెట్లు కోల్పోయినా పార్థివ్ (45 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు), డివిలియర్స్ (48 బంతుల్లో 45 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్)ల అజేయ ఇన్నింగ్స్‌తో కోలుకుంది. 17.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 116 పరుగులు చేసి మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. అర్ధసెంచరీతో బెంగళూరు గెలుపులో కీలకపాత్ర పోషించిన పార్థివ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆరంభం నుంచే ముంబై బ్యాట్స్‌మెన్‌ను బెంగళూరు బౌలర్లు ఆరంభం నుంచే ఒత్తిడికి గురిచేశారు. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో చహల్ క్యాచ్ జారవిడవడంతో మైక్ హస్సీ, ఆ తరువాతి ఓవర్లో మోర్కెల్ బౌలింగ్‌లో మ్యాడిన్సన్ వదిలేయడంతో ఆదిత్య తారేలకు జీవనదానం లభించింది. కానీ దాన్ని వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. నాలుగో ఓవర్లో చహల్‌కే క్యాచ్ ఇచ్చి హస్సీ (16) ఔటయ్యాడు. ఆపై తారే (17) వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్ ప్లేలో ముంబై 49/1తో పర్వాలేదనిపించినా ఆ వెంటనే అతణ్ని ఆరోన్ వెనక్కి పంపించి ముంబైని మరో దెబ్బతీశాడు. అనంతరం యజ్వేంద్ర చహల్ తన వరుస ఓవర్లలో కెప్టెన్ రోహిత్ (2), పొలార్డ్ (3)లను ఔట్ చేయడంతో ముంబై పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో అండర్సన్‌తో కలిసి రాయుడు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఐదో వికెట్‌కు వీరిద్దరు 31 పరుగులు జోడించాక రాయుడు ఔటవడంతో ముంబై కథ మళ్లీ మొదటికొచ్చింది. ఒకే స్కోరు (101) వద్ద వరుసగా రాయుడు, అండర్సన్, జహీర్‌ల రూపంలో మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత టెయిలెండర్లు క్రీజులో నిలవడమే గగనమైపోయింది. దీంతో ఆఖరి ఓవర్లో 4 పరుగులు మాత్రమే సాధించిన ముంబై... చివరి ఐదు ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే రాబట్టుకోగలిగంది. జహీర్ విజృంభణ లక్ష్యఛేదనలో బెంగళూరు ఇన్నింగ్స్ కూడా ఆరంభంలో తడబాటుకు గురైంది. గేల్ వెన్నునొప్ని నుంచి ఇంకా కోలుకోకపోవడంతో మరోసారి ఇన్నింగ్స్ ఆరంభించిన మ్యాడిన్సన్ (12) రెండు ఫోర్లతో మురిపించినా... మలింగ యార్కర్‌కు బలయ్యాడు. అనంతరం జహీర్ ఖాన్ మళ్లీ పాతరోజుల్ని గుర్తుకు తెస్తూ విజృంభించాడు. ఒకే ఓవర్లో కెప్టెన్ కోహ్లి (0), యువరాజ్ (0)లను ఖాతా తెరవకుండానే డగౌట్‌కు పంపి ముంబై శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఇటీవలి కాలంలో వైఫల్యమన్నదే ఎరుగని విధంగా అసాధారణ ఫామ్‌లో ఉన్న కోహ్లి డకౌట్‌గా వెనుదిరగడం, యువరాజ్ జోరు ఒక్క మ్యాచ్‌కే పరిమితం కావడంతో ఏకపక్షమే అనుకున్న మ్యాచ్ కాస్తా ఉత్కంఠగా మారింది. తొలి ఆరు ఓవర్లలో బెంగళూరు 3 వికెట్ల కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో జత కలిసిన పార్థివ్, డివిలియర్స్‌లు సమయోచితంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. బుమ్రాహ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో డివిలియర్స్ మ్యాచ్‌లోనే ఏకైక సిక్స్ బాది ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకురాగా, మలింగ వేసిన మరుసటి ఓవర్లో పార్థివ్ రెండు ఫోర్లు బాదాడు. లక్ష్యం మరింత చేరువవుతున్న దశలో ఓజా వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మరో రెండు ఫోర్లు, సింగిల్‌తో పార్థివ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఊపులో మలింగ బౌలింగ్‌లో మరో బౌండరీ, ఆపై విన్నింగ్ రన్ సాధించాడు. పార్థివ్-డివిలియర్స్ జోడి నాలుగో వికెట్‌కు అజేయంగా 99 పరుగులు జోడించడం విశేషం. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: మైక్ హస్సీ (సి) చహల్ (బి) ఆల్బీ మోర్కెల్ 16, ఆదిత్య తారే (సి) మ్యాడిన్సన్ (బి) ఆరోన్ 17, రాయుడు (సి) డివిలియర్స్ (బి) స్టార్క్ 35, రోహిత్ (సి) డివిలియర్స్ (బి) చహల్ 2, పొలార్డ్ (సి) రాణా (బి) చహల్ 3, అండర్సన్ (సి) కోహ్లి (బి) స్టార్క్ 18, హర్భజన్ (బి) ఆరోన్ 8, జహీర్ (సి) రాణా (బి) దిండా 0, మలింగ రనౌట్ 2, ఓజా నాటౌట్ 1, బుమ్రాహ్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు 12, మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 115 వికెట్ల పతనం: 1-20, 2-52, 3-60, 4-70, 5-101, 6-101, 7-101, 8-110, 9-113. బౌలింగ్: స్టార్క్ 4-0-21-2, ఆల్బీ మోర్కెల్ 3-0-23-1, ఆరోన్ 4-0-30-2, చహల్ 4-0-17-2, దిండా 4-0-14-1, యువరాజ్ 1-0-6-0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: మ్యాడిన్సన్ (బి) మలింగ 12, పార్థివ్ నాటౌట్ 57, కోహ్లి (సి) హర్భజన్ (బి) జహీర్ 0, యువరాజ్ ఎల్బీడబ్ల్యూ (బి) జహీర్ 0, డివిలియర్స్ నాటౌట్ 45, ఎక్స్‌ట్రాలు 2, మొత్తం: (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 116 వికెట్ల పతనం: 1-16, 2-17, 3-17. బౌలింగ్: జహీర్ 4-0-21-2, హర్భజన్ 4-0-14-0, మలింగ 3.3-0-29-1, బుమ్రాహ్ 2-0-14-0, ఓజా 4-0-37-0.