వారెవ్వా... నైట్ రైడర్స్
మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్‌కు కోల్‌కతా
రాణించిన ఉతప్ప, షకీబ్, నరైన్
30 పరుగులతో బెంగళూరుపై గెలుపు
ఓటమితో కోహ్లి సేన ఆశలు ఆవిరి
ఈ సీజన్ ఐపీఎల్‌లో తొలి ఏడు మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలిచింది కేవలం రెండే. ఆ దశలో ఈ జట్టు ప్లే ఆఫ్ మాట అటుంచి... పాయింట్ల పట్టికలో కింద నుంచి ఎన్నో స్థానంలో నిలుస్తుందనే అంశంపై చర్చ జరిగింది. కానీ గంభీర్ సేన అద్భుతం చేసింది. ఆ తర్వాత వరుసగా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి... మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. ఉతప్ప, నరైన్, షకీబ్‌ల అద్భుత ప్రదర్శనతో బెంగళూరును ఇంటిదారి పట్టించింది.
కోల్‌కతా: కావలసినంత డబ్బు... పార్టీలు... ఆటగాళ్లను బాగా చూసుకునే యాజమాన్యం... సీజన్లు, ఆటగాళ్లు మారినా బెంగళూరు జట్టు మాత్రం తన స్థాయిని అలా కొనసాగిస్తూనే వచ్చింది. ఈ సీజన్‌లోనూ వేలంలో డబ్బుకు వెరవకుండా స్టార్ ఆటగాళ్లతో జట్టును నింపింది. కానీ రాత మాత్రం మారలేదు. విజయ్‌మాల్యాకు మరోసారి రాయల్ చాలెంజర్స్ నిరాశనే మిగిల్చింది. కోహ్లి సారథ్యంలోని బెంగళూరు జట్టుకు మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్ ఆశలు ఆవిరయ్యాయి. రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లిసేన 30 పరుగుల తేడాతో కోల్‌కతా చేతిలో ఓడిపోయింది.
గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉతప్ప (51 బంతుల్లో 83 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), షకీబ్ (38 బంతుల్లో 60; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ స్కోరు అందించారు.
ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. టకవాలె (36 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (31 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా.. నరైన్ (4/20) స్పిన్ మ్యాజిక్‌తో బెంగళూరుకు ముకుతాడు వేశాడు.
ఉతప్ప, షకీబ్ హిట్
కోల్‌కతా తొలి ఓవర్‌లోనే గంభీర్ (4) వికెట్‌ను చేజార్చుకుంది. మూడు ఫోర్లు కొట్టి జోరుమీదున్నట్లు కనిపించిన పాండే (13) దిండా బౌలింగ్‌లో అవుట్‌కాగా.. ఉన్నంతసేపు దడదడలాడించిన యూసుఫ్ పఠాన్ (22) రనౌటయ్యాడు. 56 పరుగులకే మూడు కీలక వికెట్లు చేజార్చుకున్న దశలో ఉతప్పకు షకీబ్ జత కలిశాడు. భారీ స్కోరును అందించే బాధ్యతను ఇద్దరూ భుజాన వేసుకున్నారు. ఫోర్లతో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు.
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఉతప్ప 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో ఉతప్పకిది ఐదో అర్ధసెంచరీ కాగా... అత్యధిక పరుగుల రేసులో మ్యాక్స్‌వెల్‌ను వెనక్కినెట్టి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో చహల్ బౌలింగ్‌లో షకీబ్ రెచ్చిపోయాడు. ఒక ఫోర్, మూడు సిక్సర్లు కొట్టాడు. అదే ఊపులో ఫోర్ కొట్టి 32 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే స్కోరు పెంచే ప్రయత్నంలో అవుటైన షకీబ్ నాలుగో వికెట్‌కు ఉతప్పతో కలిసి 70 బంతుల్లో 121 పరుగులు జోడించాడు. చివర్లో ఉతప్ప, డస్కాటే చెలరేగడంతో కోల్‌కతా భారీస్కోరు చేసింది.
నరైన్ స్పిన్ మ్యాజిక్
లక్ష్యఛేదనలో చాలెంజర్స్ రెండో ఓవర్‌లోనే గేల్ (6) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ టకవాలె, కెప్టెన్ కోహ్లి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో స్కోరులో వేగం పుంజుకుంది. రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారిన ఈ జోడికి నరైన్ బ్రేకులు వేశాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో తొలుత కోహ్లిని, ఆ తర్వాత టకవాలెను అవుట్ చేశాడు.
14వ ఓవర్‌లో బెంగళూరు స్కోరు వంద దాటింది. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో యువరాజ్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. మొత్తానికి ఆ ఓవర్‌లో బెంగళూరుకు 22 పరుగులు వచ్చాయి. అయితే చేయాల్సిన పరుగులు, బంతుల మధ్య కొండంత వ్యత్యాసం ఉండటంతో బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనయ్యారు. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న నరైన్ స్పిన్ మ్యాజిక్‌తో ఒకే ఓవర్‌లో యువరాజ్ (22), డివిలియర్స్ (13)లను డగౌట్‌కు పంపాడు. చివర్లో రాణా, స్టార్క్ ధాటిగా ఆడినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప నాటౌట్ 83; గంభీర్ (సి) టకవాలె (బి) స్టార్క్ 4; మనీష్ పాండే (సి) స్టార్క్ (బి) దిండా 13; యూసుఫ్ రనౌట్ 22; షకీబ్ (బి) అహ్మద్ 60; డస్కాటే నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) : 195.
వికెట్ల పతనం: 1-5; 2-23; 3-56; 4-177.
బౌలింగ్: స్టార్క్ 4-0-32-1; దిండా 4-0-38-1; అహ్మద్ 4-0-33-1; మురళీధరన్ 2-0-19-0; యువరాజ్ 2-0-21-0; చహల్ 4-0-50-0.
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: గేల్ ఎల్బీడబ్ల్యూ (బి) ఉమేశ్ 6; టకవాలె (బి) నరైన్ 45; కోహ్లి (సి) మోర్నీ మోర్కెల్ (బి) నరైన్ 38; యువరాజ్ (సి) వినయ్ (బి) నరైన్ 22; డివిలియర్స్ (బి) నరైన్ 13; రాణా నాటౌట్ 19; స్టార్క్ నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) : 165.
వికెట్ల పతనం: 1-7; 2-92; 3-93; 4-129; 5-133.
బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-21-0; ఉమేశ్ 4-0-45-1; నరైన్ 4-0-20-4; వినయ్ 4-0-44-0; షకీబ్ 4-0-27-0.