PC: IPL.com
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో ఆఖరి ఓవర్‌లో అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా కేకేఆర్ రికార్డులకెక్కింది. ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌పై ఆఖరి ఓవర్‌లో 29 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసిన కేకేఆర్.. ఈ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది.
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలి సారి. అంతకుముందు 2016లో ఆఖరి ఓవర్‌లో 23 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్‌పై పుణేవారియర్స్ ఛేదించింది. ఇక తాజా మ్యాచ్‌తో పుణే వారియర్స్ రికార్డును కోల్‌కతా బ్రేక్ చేసింది. ఇక పుణే తర్వాతి స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఉంది. 2022 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై చివరి ఓవర్‌లో 22 పరుగుల టార్గెట్‌ను గుజరాత్ ఛేజ్ చేసింది.
రింకూ సింగ్ విధ్వంసం
ఇక గుజరాత్-కేకేఆర్ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో విజయ్ శంకర్(24 బంతుల్లో 63) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.
అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్(83), కెప్టెన్ నితీష్ రాణా(45) కేకేఆర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 100 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక కేకేఆర్ విజయం ఖాయం అనుకున్న సమయంలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 19 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసింది.
ఈ క్రమంలో చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్స్‌లు బాది తన జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు.
చదవండి: IPL 2023: అలా చేయడం సరికాదని తెలుసు.. కానీ తప్పలేదు.. ఫలితం దక్కింది.. ఇకపై: మార్కరమ్
Comments
Please login to add a commentAdd a comment