బెంగళూరు జోరు | Bangalore won match against mumbai indians | Sakshi
Sakshi News home page

బెంగళూరు జోరు

Published Sun, Apr 20 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM

బెంగళూరు జోరు

బెంగళూరు జోరు

ముంబైపై ఏడు వికెట్లతో ఘనవిజయం
 పార్థివ్ అర్ధసెంచరీ  
 రాణించిన డివిలియర్స్
 
 కోహ్లి, గేల్ రాణిస్తేనే బెంగళూరు గెలుస్తుందన్న అభిప్రాయమేదైనా ఉంటే ఇక మార్చుకోవాలేమో! ఎందుకంటే గేల్ డగౌట్ కే పరిమితమైనా, కోహ్లి, యువరాజ్ సింగ్ విఫలమైనా రాయల్ చాలెంజర్స్ జోరు ఏమాత్రం తగ్గలేదు. తొలుత బౌలర్లు.. అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ముకుతాడు వేస్తే, ఆపై పార్థివ్ పటేల్, డివిలియర్స్‌లు సమయోచిత బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని ఛేదించారు.
 
  ఫలితంగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు అలవోకగా గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు ముంబై వరుసగా రెండో పరాజయాన్ని మూట గట్టుకుంది.
 
 దుబాయ్: ఐపీఎల్-7 టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన బెంగళూరు జట్టు అందుకు తగ్గట్టుగానే జోరు కనబరుస్తోంది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీపై గెలిచిన ఊపును కొనసాగిస్తూ.. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన తమ రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
 
 
 టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లి సేన.. బౌలర్లు సమష్టిగా రాణించడంతో ముంబైని నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులకే కట్టడి చేసింది. యజ్వేంద్ర చహల్, వరుణ్ ఆరోన్, మిచెల్ స్టార్క్‌లు రెండేసి వికెట్లు పడగొట్టి ముంబై బ్యాట్స్‌మెన్‌కు ముకుతాడు వేశారు. అంబటి రాయుడు (37 బంతుల్లో 35; 1 ఫోర్) మినహా మిగిలిన వారెవరూ క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు.
 
 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు ఆరంభంలోనే కోహ్లితో సహా మూడు వికెట్లు కోల్పోయినా పార్థివ్ (45 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు), డివిలియర్స్ (48 బంతుల్లో 45 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్)ల అజేయ ఇన్నింగ్స్‌తో కోలుకుంది. 17.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 116 పరుగులు చేసి మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. అర్ధసెంచరీతో బెంగళూరు గెలుపులో కీలకపాత్ర పోషించిన పార్థివ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
 ఆరంభం నుంచే
 ముంబై బ్యాట్స్‌మెన్‌ను బెంగళూరు బౌలర్లు ఆరంభం నుంచే ఒత్తిడికి గురిచేశారు. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో చహల్ క్యాచ్ జారవిడవడంతో మైక్ హస్సీ, ఆ తరువాతి ఓవర్లో మోర్కెల్ బౌలింగ్‌లో మ్యాడిన్సన్ వదిలేయడంతో ఆదిత్య తారేలకు జీవనదానం లభించింది. కానీ  దాన్ని వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు.
 
 నాలుగో ఓవర్లో చహల్‌కే క్యాచ్ ఇచ్చి హస్సీ (16) ఔటయ్యాడు. ఆపై తారే (17) వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్ ప్లేలో ముంబై 49/1తో పర్వాలేదనిపించినా ఆ వెంటనే అతణ్ని ఆరోన్ వెనక్కి పంపించి ముంబైని మరో దెబ్బతీశాడు.
 
 అనంతరం యజ్వేంద్ర చహల్ తన వరుస ఓవర్లలో కెప్టెన్ రోహిత్ (2), పొలార్డ్ (3)లను ఔట్ చేయడంతో ముంబై పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
 
 ఈ దశలో అండర్సన్‌తో కలిసి రాయుడు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఐదో వికెట్‌కు వీరిద్దరు 31 పరుగులు జోడించాక రాయుడు ఔటవడంతో ముంబై కథ మళ్లీ మొదటికొచ్చింది. ఒకే స్కోరు (101) వద్ద వరుసగా రాయుడు, అండర్సన్, జహీర్‌ల రూపంలో మూడు వికెట్లు కోల్పోయింది.
 
 ఆ తరువాత టెయిలెండర్లు క్రీజులో నిలవడమే గగనమైపోయింది. దీంతో ఆఖరి ఓవర్లో 4 పరుగులు మాత్రమే సాధించిన ముంబై... చివరి ఐదు ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే రాబట్టుకోగలిగంది.
 
  జహీర్ విజృంభణ
 లక్ష్యఛేదనలో బెంగళూరు ఇన్నింగ్స్ కూడా ఆరంభంలో తడబాటుకు గురైంది. గేల్ వెన్నునొప్ని నుంచి ఇంకా కోలుకోకపోవడంతో మరోసారి ఇన్నింగ్స్ ఆరంభించిన మ్యాడిన్సన్ (12) రెండు ఫోర్లతో మురిపించినా... మలింగ యార్కర్‌కు బలయ్యాడు.
 
 అనంతరం జహీర్ ఖాన్ మళ్లీ పాతరోజుల్ని గుర్తుకు తెస్తూ విజృంభించాడు. ఒకే ఓవర్లో కెప్టెన్ కోహ్లి (0), యువరాజ్ (0)లను ఖాతా తెరవకుండానే డగౌట్‌కు పంపి ముంబై శిబిరంలో ఉత్సాహం నింపాడు.
 
 ఇటీవలి కాలంలో వైఫల్యమన్నదే ఎరుగని విధంగా అసాధారణ ఫామ్‌లో ఉన్న కోహ్లి డకౌట్‌గా వెనుదిరగడం, యువరాజ్ జోరు ఒక్క మ్యాచ్‌కే పరిమితం కావడంతో ఏకపక్షమే అనుకున్న మ్యాచ్ కాస్తా ఉత్కంఠగా మారింది. తొలి ఆరు ఓవర్లలో బెంగళూరు 3 వికెట్ల కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేయగలిగింది.
  ఈ దశలో జత కలిసిన పార్థివ్, డివిలియర్స్‌లు సమయోచితంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. బుమ్రాహ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో డివిలియర్స్ మ్యాచ్‌లోనే ఏకైక సిక్స్ బాది ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకురాగా, మలింగ వేసిన మరుసటి ఓవర్లో పార్థివ్ రెండు ఫోర్లు బాదాడు.
 
 లక్ష్యం మరింత చేరువవుతున్న దశలో ఓజా వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మరో రెండు ఫోర్లు, సింగిల్‌తో పార్థివ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఊపులో మలింగ బౌలింగ్‌లో మరో బౌండరీ, ఆపై విన్నింగ్ రన్ సాధించాడు. పార్థివ్-డివిలియర్స్ జోడి నాలుగో వికెట్‌కు అజేయంగా 99 పరుగులు జోడించడం విశేషం.
 
 స్కోరు వివరాలు
 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: మైక్ హస్సీ (సి) చహల్ (బి) ఆల్బీ మోర్కెల్ 16, ఆదిత్య తారే (సి) మ్యాడిన్సన్ (బి) ఆరోన్ 17, రాయుడు (సి) డివిలియర్స్ (బి) స్టార్క్ 35, రోహిత్ (సి) డివిలియర్స్ (బి) చహల్ 2, పొలార్డ్ (సి) రాణా (బి) చహల్ 3, అండర్సన్ (సి) కోహ్లి (బి) స్టార్క్ 18, హర్భజన్ (బి) ఆరోన్ 8, జహీర్ (సి) రాణా (బి) దిండా 0, మలింగ రనౌట్ 2, ఓజా నాటౌట్ 1, బుమ్రాహ్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు 12, మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 115
 వికెట్ల పతనం: 1-20, 2-52, 3-60, 4-70, 5-101, 6-101, 7-101, 8-110, 9-113.
 బౌలింగ్: స్టార్క్ 4-0-21-2, ఆల్బీ మోర్కెల్ 3-0-23-1, ఆరోన్ 4-0-30-2, చహల్ 4-0-17-2, దిండా 4-0-14-1, యువరాజ్ 1-0-6-0.
 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: మ్యాడిన్సన్ (బి) మలింగ 12, పార్థివ్ నాటౌట్ 57, కోహ్లి (సి) హర్భజన్ (బి) జహీర్ 0, యువరాజ్ ఎల్బీడబ్ల్యూ (బి) జహీర్ 0, డివిలియర్స్ నాటౌట్ 45, ఎక్స్‌ట్రాలు 2, మొత్తం: (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 116
 వికెట్ల పతనం: 1-16, 2-17, 3-17.
 
 బౌలింగ్: జహీర్ 4-0-21-2, హర్భజన్ 4-0-14-0, మలింగ 3.3-0-29-1, బుమ్రాహ్ 2-0-14-0, ఓజా 4-0-37-0.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement