గ్రామీణ ప్రాంతాలకూ గుర్రపందాలు!
బెట్టింగ్ కేంద్రాలను స్థాపించే యోజనలో ‘బీటీసీ’
ఇప్పటి వరకూ బెంగళూరుకు మాత్రమే పరిమితమైన గుర్రపందేలు ఇకపై గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించనున్నాయి! ఈ మేరకు బెంగళూరు టర్ఫ్ క్లబ్ (బీటీసీ) రూపొందించిన నివేదికకు ప్రభుత్వం నుంచి అమనుమతి లభించనుంది. బెంగళూరు నడి బొడ్డున ఉన్న బీటీసీలో జరిగే గుర్రపు పందేలకు ప్రభుత్వ అనుమతి ఉంది. ఇక్కడకు చాలా మంది వచ్చి పందెం కాస్తుంటారు. కోట్లాది రుపాయలు చేతులు మారడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో రాబడి కూడా భారీగానే ఉంటోంది. అయితే ఈ బీటీసీ తమ కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించే ఆలోచనలో ఉంది. - సాక్షి, బెంగళూరు
తొలుత ఆఫ్లైన్లో బెట్టింగ్
గుర్రపు పందేలను తొలుత బళ్లారి, దావణగెరె, బెళగావిలో ప్రా రంభించనున్నట్లు సమాచారం. వీటిలో బెంగళూరులో గుర్రపు పందేలు జరిగే సమయంలో వాటిని టీవీ, ఇంటర్నెట్ తదితర మాద్యమాల ద్వారా ఈ కేంద్రాల్లో ప్రసారం చేస్తారు. ఈ కేం ద్రాల్లో బెట్టింగ్ జరపడానికి అవకాశం ఉంటుంది. అంటే నూతనంగా ప్రారంభించబోయే కేంద్రాల్లో ఆఫ్లైన్ ద్వారా మాత్రం బెట్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొదట మూడు కేంద్రాల్లో ప్రయోగాత్మంగా ఈ విధానాన్ని ప్రారంభించి అటుపై రాష్ట్రమంతటా విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీటీసీ రూపొందించిన నివేదిక ఆర్థికశాఖకు చేరింది.
అనుమతిపై అనుమానాలు
బెంగళూరు టర్ఫ్ క్లబ్లో మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్లు ప్రభావంతమైన పోస్టుల్లో ఉండటం వల్ల ఁబీటీసీ* ప్రతిపాదికకు అనుమతి లభిస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా గుర్రపుపందేల సంస్కృతి గ్రామీణ ప్రాంతాలు విస్తరించడం వల్ల అక్కడి ప్రజల ఆర్థిక విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. జూదాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందంటూ దానిని అరికట్టాలని గవర్నర్ను కోరుతూ పోస్టుకార్డు ఉద్యమాన్ని కూడా లేవదీసింది. ఈ నేపథ్యంలోనే క్లబ్ సభ్యుడు ఒకరు ఁసాక్షి*తో మాట్లాడుతూ... ‘బెళగావి, దావణగెరె, బళ్లారిలలో కేంద్రాల స్థాపనకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపిన విషయం వాస్తవమే. త్వరలోనే అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నాం.’ అని పేర్కొన్నారు.