'మేక్ ఇన్ ఇండియా'లో రక్షణ రంగం కీలకం
బెంగళూరు : 'ఏరో ఇండియా-2015' వైమానిక ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ ఏరో ఇండియా ప్రదర్శన రక్షణ రంగ తయారీ విధానానికి వేదికగా పేర్కొన్నారు. రక్షణ రంగంలో 7 బిలియన్ డాలర్ల మేర ఉత్పత్తికి అవకాశం ఉందని మోదీ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌లో రక్షణ రంగం కీలకమని ఆయన అభివర్ణించారు. భద్రతా బలగాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని, రక్షణ రంగంలో కొనుగోళ్ల విధానంలో సంస్కరణలు అవసరమన్నారు. అంతర్గత భద్రతా సవాళ్లను అధిగమించాలని మోదీ పేర్కొన్నారు.
కాగా 'మేక్ ఇన్ ఇండియా' నినాదంతో బెంగళూరులోని యహలంక ప్రాంతంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో నేటి నుంచి అయిదు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన రక్షణ శాఖల మంత్రులు, వైమానిక దళాల అధికారులు హాజరయ్యారు. ఈ ప్రదర్శనలో 29 దేశాలకు చెందిన 570 ఏవియేషన్ రంగ సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో 296 దేశీయ సంస్థలు కాగా, 274 అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి.