bangaramma
-
బంగారమ్మ మురుకులకు ‘ఫిదా’ అవ్వాల్సిందే..
స్ఫూర్తి చిత్తూరు జిల్లాలో ‘మొగిలి’ తెలియని వారుండరు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా మొగిలీశ్వరస్వామికి ఎంత పేరుందో, మొగిలిలోని బంగారమ్మ మురుకులకూ అంత పేరుంది. ఆమె తయారు చేసే మురుకుల రుచే వాటికి రాష్ట్రవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చింది. మొగిలి ఊళ్లో నుంచే చెన్నై– బెంగళూరు హైవే వెళ్తుంది. రోడ్డును ఆనుకొనే బంగారమ్మ మురుకుల అంగడి ఉంటుంది. అటునుంచి వెళ్లే ప్రతి కారు, ఇతర వాహనం ఏదైనా ఆగి బంగారమ్మ మురుకులు కొనుక్కొని వెళ్లాల్సిందే. దిన కూలీ అయినా లక్షల జీతం తీసుకునే ఉద్యోగి అయినా వేరుశనగ, బియ్యం పిండి మిశ్రమంతో బంగారమ్మ తయారు చేసే ఆ నోరూరించే మురుకులకు ‘ఫిదా’ అవ్వాల్సిందే. బయటి నుంచి చూస్తే బంగారమ్మ దుకాణం చిన్నదిలా కనిపించొచ్చు.. కొంచెం లోపలికి తొంగి చూస్తే కష్టాన్ని ఎదిరించిన స్ఫూర్తి గాథ కనిపిస్తుంది. పదిమందికి ఉపాధి కల్పించాలన్న తపన తాండవిస్తుంది. కుంగిపోయిన జీవితాన్ని కూడా ఉత్తేజపరిచే స్ఫూర్తిమంతమైన బంగారమ్మ మురుకుల నేపథ్యం సాక్షి పాఠకుల కోసం.. కష్టాల సుడి.. కన్నీటి తడి.. బంగారమ్మకు 16 సంవత్సరాలకే మేనమామ ఆదెన్నతో పెళ్లిజరిగింది. కొద్దికాలం బాగానే ఉన్నా, భర్తకున్న రెండెకరాల పొలంలో వానల్లేక పంటలు పండలేదు. తినడానికి తిండిలేని పరిస్థితిలో కట్టెలు అమ్మింది. వచ్చే ఆదాయం దేనికీ సరిపోకపోవడంతో భర్తతో టీ అంగడి పెట్టించింది. కాలక్రమేణా సంసారం పెద్దదైంది. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు కుటుంబంలో చేరారు. టీ అంగడిలో వచ్చేది తినేందుకే సరిపోలేదు. దీంతో ఎలాగో కష్టపడి మరికొంత అప్పు చేసి, మురుకుల వ్యాపారం ప్రారంభించింది. ఆమె తయారు చేసిన మురుకులు రుచిగా ఉండటంతో త్వరలోనే వ్యాపారం పుంజుకుంది. చూస్తుండగానే చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసేంతగా ఎదిగింది. వీటిలో వచ్చిన ఆదాయంతోనే ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లూ చేసింది. అంతా బాగుందనుకున్న సమయంలో కూతుళ్లిద్దరూ వైధవ్యంతో తల్లిపంచన చేరారు. ఈ కష్టం నుంచి కోలుకునేలోగానే ఒక కొడుకు రోడ్డు ప్రమాదంలో చని పోయాడు. వృద్ధాప్యంతో మంచాన పడ్డ భర్త, ఇద్దరు కూతుళ్ల బాధ్యత, మతిస్థిమితం లేని కుమారుడు, చనిపోయిన కుమారుడి కుటుంబ బరువు అన్నీ బంగారమ్మ మీదే పడ్డాయి. అయితే కష్టాలకు ఆమె కుంగిపోలేదు. ఎదురు నిలిచింది. కన్నీళ్లను మరచిపోడానికి కుటుంబం మొత్తాన్నీ పనిలో నిమగ్నమయేలా చేసింది. నాణ్యతే ఆమె ట్రేడ్‌మార్క్ ఈ కాలంలో కొంచెం లాభం కనిపించేసరికి ఆశ మొదలవుతుంది. దీంతో కల్తీ చేయడం, నాణ్యత తగ్గించడం లాంటివి చేస్తుంటారు. కానీ బంగారమ్మ నాణ్యతలో ఏ మాత్రం రాజీ పడదు. ముడిసరుకులు స్వయంగా సిద్ధం చేసుకుంటుంది. అందుకే ఇళ్లలో శుభకార్యాలకు, ఇతర ఫంక్షన్లకు అడ్వాన్స్‌లు ఇచ్చి మరీ మురుకులు ఆమె చేత తయారు చేయించుకుంటారు. ఎక్కడెక్కడినుంచో వస్తారు..! తాను తయారు చేసే ఈ మురుకుల రుచి చూడటానికి ఎక్కడెక్కడినుంచో వస్తారని బంగారమ్మ మురిపెంగా చెబుతోంది. ప్రస్తుతం రోజూ రూ.10 వేలకు పైగా వ్యాపారం జరుగుతోంది. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారెవరినీ ఆమె మరచిపోలేదు.కష్టం ఎంతటి వారినైనా కుంగదీస్తుంది. అయితే దాన్ని ఎదిరించి కొత్త తోవ వెతుక్కోవాలనుకుంటే మాత్రం బంగారమ్మ మురుకులు రుచి చూడాల్సిందే – గాండ్లపర్తి భరత్‌రెడ్డి, సాక్షి, చిత్తూరు -
భార్యను చంపి.. తనువు చాలించి..
వారిద్దరూ నవదంపతులు. కలకాలం అన్యోన్యంగా జీవించాల్సిన వారు. కుటుంబ తగాదాలతో వారి వివాహం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలు వివాహం జరిగిన ఏడాదికే వారిని అనంతలోకాలకు తీసుకుపోయాయి. భార్యను నరికి హత్య చేసిన భర్త తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేపాడ, న్యూస్‌లైన్: మండల కేంద్రమైన వేపాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితుల కుటుంబీకులు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలకేంద్రానికి చెందిన వాకాడ అప్పడు కుమారుడు దేముడు(23)కి వేపాడ శివారు బక్కునాయుడుపేట గ్రామానికి చెందిన కోన చిన్నమ్మతల్లి కుమారై బంగారమ్మ(20)కు గత ఏడాది మే 24న వివాహం జరిగింది. వివాహానంతరం కొద్దిరోజులు ఆ దంపతులు బాగానే ఉన్నారు. అనంతరం ఏడాదిలో రెండు పర్యాయాలు కుటుంబ తగాదాలతో కన్నవారింటికి బంగారమ్మ వెళ్లిపోవడం, కులపెద్దలు నచ్చచెప్పి తీసుకురావడం జరిగింది. పెద్దమనుషులు కుదిర్చిన రాజీ వల్ల ఈ నెల రెండోతేదీన బంగారమ్మ అత్తవారింటికి వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భర్త దేముడు ఆమెను కత్తితో మెడపైన. తలపైన నరికివేయడంతో రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచింది. దీంతో దేముడు భయాందోళనకు గురై చెరువులో స్నానం చేసి సమీపంలో ఉన్న రౌతు ఈశ్వర్రావు కళ్లంలో పశువులశాలలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శుక్రవారం ఉదయాన్నే కోడలు బంగారమ్మను పిలిస్తే పలకలేదని, తలుపుతీస్తే రాకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపు తీయించగా ఇంట్లో కోడలు రక్తపుమడుగులో ఉందని, కొడుకు కనిపించలేదని హతురాలి అత్త గెడ్డమ్మ తెలిపింది. కొంతసేపటి తర్వాత కొడుకు పశువుల శాల దగ్గర ఉరిపోసుకుని చనిపోయాడన్న సమాచారం తెలిసిందన్నారు. వీఆర్ఓ, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వివరాలు సేకరించారు. ఈ సంఘటనకు సంబంధించి హతురాలు బంగారమ్మ తల్లి కోన అచ్చమ్మ, మృతుడు దేముడు తండ్రి వాకాడ అప్పడు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎస్.కోట ఇన్చార్జి సీఐ కుమారస్వామి, ఎస్సై ఎస్.కె.ఎస్.ఘని కేసులు నమోదుచేసి దర్యాపు ప్రారంభించారు. వేపాడ ఇన్చార్జి తహశీల్దారు వై.బెంజిమన్, సీఐ. వీఆర్ఓ. పంచాయతీ కార్యదర్శి, గ్రామపెద్దలు గుమ్మడి భారతి, నిరుజోగి ముత్యాలునాయుడు తదితరుల సమక్షంలో పంచనామా జరిపి మృతదేహాలను ఎస్.కోట ప్రభు త్వాస్పపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆస్తి కోసమే.. వాకాడ అప్పడు రెండో భార్య అయిన గెడ్డమ్మ ఆమెకు జన్మించిన కొడుకు బంగారునాయుడుకు ఆస్తి దక్కాలన్న ఉద్దేశంతో తన కూతురు,అల్లుడు మధ్య గొడవలు సృష్టించి ఇటువంటి దారుణానికి కారణమైందంటూ హతురాలి తల్లి అచ్చమ్మ, కుటుంబీకులు ఆరోపించారు. తన కూతుర్ని అత్తింటివారే పొట్టనటెట్టుకున్నారని అచ్చెమ్మ భోరున విలపించింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ సయ్యద్ఇషాక్ మహమ్మద్ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు సంఘటనా స్థలా న్ని పరిశీలించారు. అనంత రం వల్లంపూడి పోలీసు స్టేషన్‌కు చేరుకున్న ఆయన హతురాలి కుటుంబీకులను, మృతుడు దేముడు తల్లిదండ్రులను విచారణ చేశారు. -
ఇద్దరు గల్లంతు
మాడుగుల, న్యూస్‌లైన్: వర్షాలకు జిల్లాలో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు ధ్రువీకరించారు. తాచేరు నదిలో పడి గురువారం సాయంత్రం మహిళ కనిపిం చకుండాపోయింది. ఎం.కోడూరు గ్రామానికి చెందిన జాజిమొగ్గల ఆదిలక్ష్మి (35) నది ఒడ్డుకు బహిర్భూమికి వెళ్లింది. నీటి ఉధృతికి గల్లంతయింది. ఆమె కోసం స్థానికులు గాలిస్తున్నారు. సంఘటన స్థలాన్నితహశీల్దార్ పి.రామునాయుడు పరిశీలించారు. కాగా విశాఖ ఎంవీపీ కాలనీ సెక్టర్-2లోని చాకలిగెడ్డలో బంగారమ్మ(70) కొట్టుకుపోయింది. మరుపాకలో నీట మునిగి ఒకరు... రావికమతం : మరుపాకలో నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. గురువారం సాయంత్రం పొలం నుంచి తిరిగి వస్తున్న దాలిబోయిన సన్నిబాబు(58) గెడ్డదాటబోయి అందులో మునిగిపోయాడు. అతికష్టం మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ఆయాసంతో ఇంటికి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయి మృతిచెందాడు.