భార్యను చంపి.. తనువు చాలించి..
వారిద్దరూ నవదంపతులు. కలకాలం అన్యోన్యంగా జీవించాల్సిన వారు. కుటుంబ తగాదాలతో వారి వివాహం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలు వివాహం జరిగిన ఏడాదికే వారిని అనంతలోకాలకు తీసుకుపోయాయి. భార్యను నరికి హత్య చేసిన భర్త తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వేపాడ, న్యూస్‌లైన్: మండల కేంద్రమైన వేపాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితుల కుటుంబీకులు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలకేంద్రానికి చెందిన వాకాడ అప్పడు కుమారుడు దేముడు(23)కి వేపాడ శివారు బక్కునాయుడుపేట గ్రామానికి చెందిన కోన చిన్నమ్మతల్లి కుమారై బంగారమ్మ(20)కు గత ఏడాది మే 24న వివాహం జరిగింది. వివాహానంతరం కొద్దిరోజులు ఆ దంపతులు బాగానే ఉన్నారు.
అనంతరం ఏడాదిలో రెండు పర్యాయాలు కుటుంబ తగాదాలతో కన్నవారింటికి బంగారమ్మ వెళ్లిపోవడం, కులపెద్దలు నచ్చచెప్పి తీసుకురావడం జరిగింది. పెద్దమనుషులు కుదిర్చిన రాజీ వల్ల ఈ నెల రెండోతేదీన బంగారమ్మ అత్తవారింటికి వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భర్త దేముడు ఆమెను కత్తితో మెడపైన. తలపైన నరికివేయడంతో రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచింది.
దీంతో దేముడు భయాందోళనకు గురై చెరువులో స్నానం చేసి సమీపంలో ఉన్న రౌతు ఈశ్వర్రావు కళ్లంలో పశువులశాలలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శుక్రవారం ఉదయాన్నే కోడలు బంగారమ్మను పిలిస్తే పలకలేదని, తలుపుతీస్తే రాకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపు తీయించగా ఇంట్లో కోడలు రక్తపుమడుగులో ఉందని, కొడుకు కనిపించలేదని హతురాలి అత్త గెడ్డమ్మ తెలిపింది. కొంతసేపటి తర్వాత కొడుకు పశువుల శాల దగ్గర ఉరిపోసుకుని చనిపోయాడన్న సమాచారం తెలిసిందన్నారు.
వీఆర్‌ఓ, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వివరాలు సేకరించారు. ఈ సంఘటనకు సంబంధించి హతురాలు బంగారమ్మ తల్లి కోన అచ్చమ్మ, మృతుడు దేముడు తండ్రి వాకాడ అప్పడు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎస్.కోట ఇన్‌చార్జి సీఐ కుమారస్వామి, ఎస్సై ఎస్.కె.ఎస్.ఘని కేసులు నమోదుచేసి దర్యాపు ప్రారంభించారు. వేపాడ ఇన్‌చార్జి తహశీల్దారు వై.బెంజిమన్, సీఐ. వీఆర్‌ఓ. పంచాయతీ కార్యదర్శి, గ్రామపెద్దలు గుమ్మడి భారతి, నిరుజోగి ముత్యాలునాయుడు తదితరుల సమక్షంలో పంచనామా జరిపి మృతదేహాలను ఎస్.కోట ప్రభు త్వాస్పపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఆస్తి కోసమే..
వాకాడ అప్పడు రెండో భార్య అయిన గెడ్డమ్మ ఆమెకు జన్మించిన కొడుకు బంగారునాయుడుకు ఆస్తి దక్కాలన్న ఉద్దేశంతో తన కూతురు,అల్లుడు మధ్య గొడవలు సృష్టించి ఇటువంటి దారుణానికి కారణమైందంటూ హతురాలి తల్లి అచ్చమ్మ, కుటుంబీకులు ఆరోపించారు. తన కూతుర్ని అత్తింటివారే పొట్టనటెట్టుకున్నారని అచ్చెమ్మ భోరున విలపించింది.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్‌పీ
విజయనగరం ఇన్‌చార్జి డీఎస్‌పీ సయ్యద్‌ఇషాక్ మహమ్మద్ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు సంఘటనా స్థలా న్ని పరిశీలించారు. అనంత రం వల్లంపూడి పోలీసు స్టేషన్‌కు చేరుకున్న ఆయన హతురాలి కుటుంబీకులను, మృతుడు దేముడు తల్లిదండ్రులను విచారణ చేశారు.