బంగారమ్మ మురుకులకు ‘ఫిదా’ అవ్వాల్సిందే..
స్ఫూర్తి
చిత్తూరు జిల్లాలో ‘మొగిలి’ తెలియని వారుండరు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా మొగిలీశ్వరస్వామికి ఎంత పేరుందో, మొగిలిలోని బంగారమ్మ మురుకులకూ అంత పేరుంది. ఆమె తయారు చేసే మురుకుల రుచే వాటికి రాష్ట్రవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చింది. మొగిలి ఊళ్లో నుంచే చెన్నై– బెంగళూరు హైవే వెళ్తుంది. రోడ్డును ఆనుకొనే బంగారమ్మ మురుకుల అంగడి ఉంటుంది. అటునుంచి వెళ్లే ప్రతి కారు, ఇతర వాహనం ఏదైనా ఆగి బంగారమ్మ మురుకులు కొనుక్కొని వెళ్లాల్సిందే. దిన కూలీ అయినా లక్షల జీతం తీసుకునే ఉద్యోగి అయినా వేరుశనగ, బియ్యం పిండి మిశ్రమంతో బంగారమ్మ తయారు చేసే ఆ నోరూరించే మురుకులకు ‘ఫిదా’ అవ్వాల్సిందే. బయటి నుంచి చూస్తే బంగారమ్మ దుకాణం చిన్నదిలా కనిపించొచ్చు.. కొంచెం లోపలికి తొంగి చూస్తే కష్టాన్ని ఎదిరించిన స్ఫూర్తి గాథ కనిపిస్తుంది. పదిమందికి ఉపాధి కల్పించాలన్న తపన తాండవిస్తుంది. కుంగిపోయిన జీవితాన్ని కూడా ఉత్తేజపరిచే స్ఫూర్తిమంతమైన బంగారమ్మ మురుకుల నేపథ్యం సాక్షి పాఠకుల కోసం..
కష్టాల సుడి.. కన్నీటి తడి..
బంగారమ్మకు 16 సంవత్సరాలకే మేనమామ ఆదెన్నతో పెళ్లిజరిగింది. కొద్దికాలం బాగానే ఉన్నా, భర్తకున్న రెండెకరాల పొలంలో వానల్లేక పంటలు పండలేదు. తినడానికి తిండిలేని పరిస్థితిలో కట్టెలు అమ్మింది. వచ్చే ఆదాయం దేనికీ సరిపోకపోవడంతో భర్తతో టీ అంగడి పెట్టించింది. కాలక్రమేణా సంసారం పెద్దదైంది. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు కుటుంబంలో చేరారు. టీ అంగడిలో వచ్చేది తినేందుకే సరిపోలేదు. దీంతో ఎలాగో కష్టపడి మరికొంత అప్పు చేసి, మురుకుల వ్యాపారం ప్రారంభించింది. ఆమె తయారు చేసిన మురుకులు రుచిగా ఉండటంతో త్వరలోనే వ్యాపారం పుంజుకుంది. చూస్తుండగానే చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసేంతగా ఎదిగింది. వీటిలో వచ్చిన ఆదాయంతోనే ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లూ చేసింది.
అంతా బాగుందనుకున్న సమయంలో కూతుళ్లిద్దరూ వైధవ్యంతో తల్లిపంచన చేరారు. ఈ కష్టం నుంచి కోలుకునేలోగానే ఒక కొడుకు రోడ్డు ప్రమాదంలో చని పోయాడు. వృద్ధాప్యంతో మంచాన పడ్డ భర్త, ఇద్దరు కూతుళ్ల బాధ్యత, మతిస్థిమితం లేని కుమారుడు, చనిపోయిన కుమారుడి కుటుంబ బరువు అన్నీ బంగారమ్మ మీదే పడ్డాయి. అయితే కష్టాలకు ఆమె కుంగిపోలేదు. ఎదురు నిలిచింది. కన్నీళ్లను మరచిపోడానికి కుటుంబం మొత్తాన్నీ పనిలో నిమగ్నమయేలా చేసింది.
నాణ్యతే ఆమె ట్రేడ్‌మార్క్
ఈ కాలంలో కొంచెం లాభం కనిపించేసరికి ఆశ మొదలవుతుంది. దీంతో కల్తీ చేయడం, నాణ్యత తగ్గించడం లాంటివి చేస్తుంటారు. కానీ బంగారమ్మ నాణ్యతలో ఏ మాత్రం రాజీ పడదు. ముడిసరుకులు స్వయంగా సిద్ధం చేసుకుంటుంది. అందుకే ఇళ్లలో శుభకార్యాలకు, ఇతర ఫంక్షన్లకు అడ్వాన్స్‌లు ఇచ్చి మరీ మురుకులు ఆమె చేత తయారు చేయించుకుంటారు.
ఎక్కడెక్కడినుంచో వస్తారు..!
తాను తయారు చేసే ఈ మురుకుల రుచి చూడటానికి ఎక్కడెక్కడినుంచో వస్తారని బంగారమ్మ మురిపెంగా చెబుతోంది. ప్రస్తుతం రోజూ రూ.10 వేలకు పైగా వ్యాపారం జరుగుతోంది. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారెవరినీ ఆమె మరచిపోలేదు.కష్టం ఎంతటి వారినైనా కుంగదీస్తుంది. అయితే దాన్ని ఎదిరించి కొత్త తోవ వెతుక్కోవాలనుకుంటే మాత్రం బంగారమ్మ మురుకులు రుచి చూడాల్సిందే
– గాండ్లపర్తి భరత్‌రెడ్డి, సాక్షి, చిత్తూరు