Murukulu
-
Recipe: వెన్న మురుకులు, నువ్వుల ఉండలు.. ఇంట్లోనే ఇలా ఈజీగా!
Venna Murukulu And Nuvvula Undalu Recipes In Telugu: వెన్న మురుకులు, నువ్వుల ఉండలు ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి కావలసినవి: ►బియ్యప్పిండి – అర కేజీ ►శనగపిండి – పావు కేజీ ►వెన్న – పావు కేజీ ►ఉప్పు – 2 టీ స్పూన్లు లేదా రుచికి తగినంత ►జీలకర్ర పొడి – టీ స్పూన్ ►ఇంగువ – అర స్పూన్ ►వేడి నీరు – అర లీటరు ►నూనె – అర కేజీ. తయారీ: ►బియ్యప్పిండి, శనగపిండిని కలిపి జల్లించాలి. ►ఇందులో వెన్న వేసి సమంగా కలిసే వరకు వేళ్లతో మర్దన చేస్తూ కలపాలి. ►ఇప్పుడు ఉప్పు, జీలకర్ర పొడి, ఇంగువ వేసి మరోసారి కలపాలి. ►ఇందులో వేడినీటిని పోసి ముద్దగా కలుపుకోవాలి. ►మురుకుల గొట్టంలో వేసి ఒకసారి వత్తుకుని చూసుకోవాలి. ►తీగ సరిగ్గా పడకుండా మధ్యలో విరిగిపోతుంటే పిండి మీద కొద్దిగా నీటిని చిలకరించి కలుపుకోవాలి. ►బాణలిలో నూనె వేడి చేసి పిండిని మురుకుల గొట్టంలో వేసుకుని నూనెలోకి వత్తుకోవాలి. ►దోరగా కాలిన తరవాత చిల్లుల గరిటెతో తీసుకోవాలి. పిండినంతటినీ ఇలాగే చేసుకోవాలి. ►ఈ మురుకులు రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి. నువ్వుల ఉండలు కావలసినవి: ►నువ్వులు – పావు కేజి ►బెల్లం పొడి – 200 గ్రా; ►ఏలకుల పొడి – ఒక టీ స్పూను ►నెయ్యి – కొద్దిగా. తయారీ: ►నువ్వులను వేయించి పొడి చేయాలి. ►కొన్నింటిని పొడి చేయకుండా అలాగే ఉంచాలి. ►ఇందులో బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి రెండూ సమంగా కలిసే వరకు రోట్లో దంచాలి. ►చేతికి నెయ్యి రాసుకుని కావలసిన సైజులో ఉండలు చేయాలి. ►ఇవి రెండు–మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి. ►బెల్లం పాకం పట్టి నువ్వులు కలిపి ఉండలు చేసుకుంటే నెల వరకు తాజాగా ఉంటాయి. గమనిక: తెల్ల నువ్వులు కాని నల్ల నువ్వులు కాని వాడవచ్చు. నల్ల నువ్వులైతే వేయించిన తర్వాత కాస్త నలిపి పొట్టు వదిలించాలి. ఇవి కూడా ట్రై చేయండి: Best Sweet Recipe: ఎప్పుడూ సేమ్యా పాయసమేనా? ఈసారి... శనగపప్పు పాయసం ఇలా.. Capsicum Bajji Recipe: రుచికరమైన క్యాప్సికమ్ బజ్జీ -
హాట్ హాట్ చిప్స్
జగిత్యాల టౌన్: కాలానికి అనుగుణంగా రుచులు కూడా మారుతున్నాయి. ఆహార ప్రియులు కొత్తకొత్త రుచులను కోరుతున్నారు. ఏదిఏమైనా సాయంత్రం స్నాక్స్ పక్కా ఉండాల్సిందేనని ఆరాటపడుతున్నారు. పట్టణాల్లో అయితే ఇది తప్పనిసరిగా మారింది. రుచితో పాటు వేడివేడిగా హాట్ చిప్స్ అందించే కేంద్రాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో యువకులు హాట్ చిప్స్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. హాట్ చిప్స్‌పై ఈఆదివారం ప్రత్యేక కథనం మీకోసం ..... అందరికీ అందుబాటులో చిన్నారులు, పెద్దలు సాయంత్రం స్నాక్స్ కోసం చిప్స్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. చిప్స్ కేంద్రాల్లో వివిధ పిండి పదార్థాలతో ఘటి, బొంది, రింగులు, కారపూస, మిక్చర్, శబ్దాన, దల్మోట్, మురుకులు వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు చిప్స్‌లో ఆలు, కాకరకాయ, అల్లం ఆలు చిప్స్, బనాన చిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంతో రుచి తాజాగా ఎప్పటకప్పుడు పిండి పదర్ధాలు తయారు చేయడంతో ఎంతో రుచిగా ఉంటాయి. ప్రతి రోజు స్నాక్స్ కొనుగోలు చేస్తుంటాం. రుచి, శుచితో ఉండటంతో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. – గోపినాథ్, జగిత్యాల ఆదరణ లభిస్తోంది మొదట్లో ఇబ్బంది ఎదురైంది. రుచి శుభ్రత విషయంలో రాజీ పడలేదు. రోజు రోజుకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎక్కువగా చిప్స్ అమ్మకాలు ఉంటాయి. – నరేశ్, నిర్వాహుకుడు, జగిత్యాల -
బంగారమ్మ మురుకులకు ‘ఫిదా’ అవ్వాల్సిందే..
స్ఫూర్తి చిత్తూరు జిల్లాలో ‘మొగిలి’ తెలియని వారుండరు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా మొగిలీశ్వరస్వామికి ఎంత పేరుందో, మొగిలిలోని బంగారమ్మ మురుకులకూ అంత పేరుంది. ఆమె తయారు చేసే మురుకుల రుచే వాటికి రాష్ట్రవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చింది. మొగిలి ఊళ్లో నుంచే చెన్నై– బెంగళూరు హైవే వెళ్తుంది. రోడ్డును ఆనుకొనే బంగారమ్మ మురుకుల అంగడి ఉంటుంది. అటునుంచి వెళ్లే ప్రతి కారు, ఇతర వాహనం ఏదైనా ఆగి బంగారమ్మ మురుకులు కొనుక్కొని వెళ్లాల్సిందే. దిన కూలీ అయినా లక్షల జీతం తీసుకునే ఉద్యోగి అయినా వేరుశనగ, బియ్యం పిండి మిశ్రమంతో బంగారమ్మ తయారు చేసే ఆ నోరూరించే మురుకులకు ‘ఫిదా’ అవ్వాల్సిందే. బయటి నుంచి చూస్తే బంగారమ్మ దుకాణం చిన్నదిలా కనిపించొచ్చు.. కొంచెం లోపలికి తొంగి చూస్తే కష్టాన్ని ఎదిరించిన స్ఫూర్తి గాథ కనిపిస్తుంది. పదిమందికి ఉపాధి కల్పించాలన్న తపన తాండవిస్తుంది. కుంగిపోయిన జీవితాన్ని కూడా ఉత్తేజపరిచే స్ఫూర్తిమంతమైన బంగారమ్మ మురుకుల నేపథ్యం సాక్షి పాఠకుల కోసం.. కష్టాల సుడి.. కన్నీటి తడి.. బంగారమ్మకు 16 సంవత్సరాలకే మేనమామ ఆదెన్నతో పెళ్లిజరిగింది. కొద్దికాలం బాగానే ఉన్నా, భర్తకున్న రెండెకరాల పొలంలో వానల్లేక పంటలు పండలేదు. తినడానికి తిండిలేని పరిస్థితిలో కట్టెలు అమ్మింది. వచ్చే ఆదాయం దేనికీ సరిపోకపోవడంతో భర్తతో టీ అంగడి పెట్టించింది. కాలక్రమేణా సంసారం పెద్దదైంది. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు కుటుంబంలో చేరారు. టీ అంగడిలో వచ్చేది తినేందుకే సరిపోలేదు. దీంతో ఎలాగో కష్టపడి మరికొంత అప్పు చేసి, మురుకుల వ్యాపారం ప్రారంభించింది. ఆమె తయారు చేసిన మురుకులు రుచిగా ఉండటంతో త్వరలోనే వ్యాపారం పుంజుకుంది. చూస్తుండగానే చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసేంతగా ఎదిగింది. వీటిలో వచ్చిన ఆదాయంతోనే ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లూ చేసింది. అంతా బాగుందనుకున్న సమయంలో కూతుళ్లిద్దరూ వైధవ్యంతో తల్లిపంచన చేరారు. ఈ కష్టం నుంచి కోలుకునేలోగానే ఒక కొడుకు రోడ్డు ప్రమాదంలో చని పోయాడు. వృద్ధాప్యంతో మంచాన పడ్డ భర్త, ఇద్దరు కూతుళ్ల బాధ్యత, మతిస్థిమితం లేని కుమారుడు, చనిపోయిన కుమారుడి కుటుంబ బరువు అన్నీ బంగారమ్మ మీదే పడ్డాయి. అయితే కష్టాలకు ఆమె కుంగిపోలేదు. ఎదురు నిలిచింది. కన్నీళ్లను మరచిపోడానికి కుటుంబం మొత్తాన్నీ పనిలో నిమగ్నమయేలా చేసింది. నాణ్యతే ఆమె ట్రేడ్‌మార్క్ ఈ కాలంలో కొంచెం లాభం కనిపించేసరికి ఆశ మొదలవుతుంది. దీంతో కల్తీ చేయడం, నాణ్యత తగ్గించడం లాంటివి చేస్తుంటారు. కానీ బంగారమ్మ నాణ్యతలో ఏ మాత్రం రాజీ పడదు. ముడిసరుకులు స్వయంగా సిద్ధం చేసుకుంటుంది. అందుకే ఇళ్లలో శుభకార్యాలకు, ఇతర ఫంక్షన్లకు అడ్వాన్స్‌లు ఇచ్చి మరీ మురుకులు ఆమె చేత తయారు చేయించుకుంటారు. ఎక్కడెక్కడినుంచో వస్తారు..! తాను తయారు చేసే ఈ మురుకుల రుచి చూడటానికి ఎక్కడెక్కడినుంచో వస్తారని బంగారమ్మ మురిపెంగా చెబుతోంది. ప్రస్తుతం రోజూ రూ.10 వేలకు పైగా వ్యాపారం జరుగుతోంది. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారెవరినీ ఆమె మరచిపోలేదు.కష్టం ఎంతటి వారినైనా కుంగదీస్తుంది. అయితే దాన్ని ఎదిరించి కొత్త తోవ వెతుక్కోవాలనుకుంటే మాత్రం బంగారమ్మ మురుకులు రుచి చూడాల్సిందే – గాండ్లపర్తి భరత్‌రెడ్డి, సాక్షి, చిత్తూరు -
వరిగమలు!
మ్యూజిక్ మంచి మెడిసిన్. అలాగే వరిగలు. మైండ్‌కు సరిగమలు ఎలాగో... బాడీకి వరిగలు అలాగ! మ్యూజిక్ లవర్స్ ఎప్పుడూ ఎంగ్గా ఉంటారు. వరిగలు తిన్నా అంతే.. ఎవర్ గ్రీన్‌గా కనిపిస్తారు. ఎంజాయ్ దీజ్ ‘వరిగ’మలు. వరిగ మురుకులు కావలసినవి: వరిగలు- ఒక గ్లాసు, శనగపప్పు- పావు గ్లాసు, మినప్పప్పు- పావు గ్లాసు, పెసర పప్పు- పావు గ్లాసు, వరిబియ్యం- పావు గ్లాసు, జీలకర్ర- రెండు చెంచాలు, వాము- ఒక చెంచా, కారం- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, నూనె- మురుకులు కాలడానికి సరిపడినంత తయారు చేయాల్సిన పద్ధతి: వరిగలు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, వరి బియ్యం అన్నింటినీ మందపాటి బాణలిలో (నూనె లేకుండా) సన్నమంట మీద దోరగా వేయించాలి. ఒక్కొక్క దానిని విడిగా వేయించుకోవచ్చు. కలిపి వేయించాలనుకుంటే ముందుగా శనగలు వేసి అవి ఒక మోస్తరుగా వేగిన తర్వాత మిగిలిన ధాన్యాలను వేయాలి. చల్లారిన తర్వాత మరపట్టించి జల్లించాలి. పై పిండిలో జీలకర్ర, వాము, కారం, ఉప్పు, రెండు చెంచాల వేడినూనె వేసి బాగా కలపాలి. అందులో ఒక కప్పు వేడి నీరు పోసి కలపాలి. చివరగా తగినంత చన్నీళ్లతో పిండిని ముద్దగా చేయాలి. బాణలిలో నూనె వేడి చేసి కాగిన తర్వాత పిండిని మురుకుల (జంతికల) గొట్టంలో పెట్టి నూనెలోకి వత్తాలి. మీడియం మంట మీద మురుకులను దోరగా వేయించాలి. మురుకులు వేగిందీ లేనిదీ తెలియాలంటే చిల్లుల గరిటెతో మురుకుల మీద చిన్నగా తడితే తీగ లోపల మెత్తగా ఉందా గట్టి పడిందా అనే అంచనా వస్తుంది. గమనిక: కలిపిన పిండి ఆరిపోకూడదు. తడివస్త్రంతో కప్పి ఉంచి గొట్టంలో పట్టేంత పిండిని విడిగా తీసుకుంటూ మురుకులు చేయాలి. వరిగ తీపి అప్పం కావలసినవి: వరిగపిండి- ఒక కప్పు, కొబ్బరి కోరు- ఒక కప్పు, కొబ్బరి ముక్కలు- పిడికెడు, బెల్లంపొడి- ముప్పావు కప్పు, పటిక బెల్లం పొడి- ఒక చెంచా, ఈస్ట్- అర చెంచా, జీడిపప్పు, కిస్మిస్ - గుప్పెడు, నెయ్యి - ఒక చెంచా, యాలకుల పొడి- అర చెంచా తయారు చేయాల్సిన పద్ధతి: వరిగ పిండిని మందపాటి బాణలిలో వేసి (నూనె లేకుండా) సన్నమంట మీద దోరగా వేయించాలి. అర కప్పు వేడి నీటిలో ఈస్ట్, పటిక బెల్లం పొడి కలిపి పక్కన ఉంచాలి. బెల్లం పొడిలో పావు కప్పు నీరు పోసి సన్న మంట మీద ఐదు నిమిషాల సేపు మరిగించి దించాలి. ఇందులో వేయించి చల్లార్చిన వరిగపిండి, ఈస్ట్- పటికబెల్లం నీటిని వేసి కలిపి రెండు గంటల సేపు పక్కన పెట్టాలి. జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ని నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. రెండు గంటల తర్వాత ఈ మిశ్రమంలో యాలకులపొడి, కొబ్బరి కోరు వేసి అవసరమైతే మరికొంత నీటిని చేర్చి గరిటె జారుడుగా (ఇడ్లీ పిండిలా) కలుపుకోవాలి. అంచులు ఎత్తుగా ఉన్న పళ్లేనికి నెయ్యిరాసి పై మిశ్రమాన్ని పోసి సమంగా సర్దాలి. పైన వేయించిన జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు సర్దాలి. ఇడ్లీ పాత్రలో అడుగున నీరు పోసి పైన పళ్లేన్ని పెట్టి 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. చల్లారిన తర్వాత తీసి ముక్కలుగా కోసి వడ్డించవచ్చు. గమనిక: మిశ్రమంలో పళ్లెంలో సగానికి మించరాదు. ఉడికేటప్పుడు మిశ్రమం గుల్లగా పొంగి అప్పం పళ్లెం నిండుగా వస్తుంది. ఈస్ట్ లేకపోతే ఒక స్పూను పులిసిన పెరుగు కలుపుకోవచ్చు. వరిగ పుట్టు కావలసినవి: వరిగ బియ్యం- ఒక గ్లాసు, కొబ్బరి కోరు- అరకప్పు, ఉప్పు- అర చెంచా తయారు చేయాల్సిన పద్ధతి: వరిగబియ్యాన్ని ఐదు గంటల సేపు నానబెట్టి నీరంతా పోయేవరకు వడపోయాలి. ఆ బియ్యాన్ని పొడి వస్త్రం మీద పోసి నీడన ఇరవై నిమిషాల సేపు ఆరబెట్టి మరపట్టించాలి. ఆ పిండిని వెడల్పాటి పళ్లెంలో పోసి అందులో ఉప్పు వేసి కొద్దిగా నీటిని వేసి తడిపొడిగా కలుపుకోవాలి. మిశ్రమం ముద్దగా కాకూడదు. పిండి అంతటికీ నీరు అందాలి, చేత్తో నలిపితే పొడిగా రాలిపోతున్నట్లు ఉండాలి. ఇలా కలుపుకుని ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచాలి. కలిపేటప్పుడు నీటిని ఒకేసారి పోస్తే ఒక చోట ముద్దయి మిగిలిన పిండి అంతా పొడిగా ఉండిపోతుంది. కాబట్టి పిండిలో కొద్దికొద్దిగా నీటిని చిలకరించుకుంటూ కలుపుకోవాలి. పుట్టు తయారు చేసే గొట్టంలో కొంచెం కొబ్బరి కోరు కూరాలి, ఆ పైన పుట్టు పిండిని కూరాలి. ఆ పైన కొబ్బరికోరు, తర్వాత పిండి... అలా పొరలు పారలుగా నింపాలి. దీనిని ఆవిరి మీద ఆరేడు నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇది చాలా బలవర్ధకమైన ఉపాహారం. వరిగ దిబ్బరొట్టె కావలసినవి: వరిగలు- ఒక గ్లాసు, కందిపప్పు- పావు గ్లాసు, శనగపప్పు- పావు గ్లాసు, మినప్పప్పు- పావు గ్లాసు, పెసరపప్పు- పావు గ్లాసు, పుల్లటి పెరుగు- పావు గ్లాసు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద- రెండు చెంచాలు, పసుపు- ఒక చెంచా, కారం- ఒక చెంచా, ఉప్పు - తగినంత, సొరకాయ తురుము- అరకప్పు, క్యాబేజ్ తురుము- అరకప్పు, మెంతికూర- అరకప్పు, కొత్తిమీర- పావు కప్పు, వంటసోడా- అరచెంచా; పోపుకోసం: ఆవాలు- రెండు చెంచాలు, కరివేపాకు- రెండు రెమ్మలు, నువ్వులు- మూడు చెంచాలు, నూనె- పావు కప్పు తయారు చేయాల్సిన పద్ధతి: వరిగలు, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పును నాలుగు గంటల సేపు నానబెట్టాలి. నానిన తర్వాత మెత్తగా రుబ్బాలి. అందులో పెరుగు, కారం, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి ముద్ద, పసుపు, సొరకాయ తురుము, క్యాబేజ్ తురుము, మెంతికూర, కొత్తిమీర వేసి రెండు గంటల సేపు పక్కన ఉంచాలి. ఒక బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు పై మిశ్రమంలో వంటసోడా కలిపి పోపు బాణలిలో పోయాలి. బాణలి అంతటా సమంగా సర్ది మీడియం మంట మీద కాలనివ్వాలి. ఒక వైపు కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి. దీనిని పుదీన చట్నీ లేదా పెరుగు చట్నీతో తినవచ్చు. వరిగ పరమాన్నం కావలసినవి: వరిగ బియ్యం- ఒక గ్లాసు, బెల్లం పొడి - ఒక గ్లాసు, పాలు- అరగ్లాసు, నెయ్యి- రెండు చెంచాలు, యాలకుల పొడి- అర చెంచా, శొంఠి- చిటికెడు జీడిపప్పు, కిస్మిస్- గుప్పెడు, కర్జూరం ముక్కలు- రెండు చెంచాలు తయారు చేయాల్సిన పద్ధతి: వరిగ బియ్యాన్ని కడిగి రెండు గంటల సేపు నానబెట్టాలి. తర్వాత మూడు గ్లాసుల నీరు పోసి మెత్తగా ఉడికించాలి. ఈ లోపు పాలను మరిగించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించాలి. అన్నం ఉడికిన తర్వాత కర్జూరం ముక్కలు, బెల్లం పొడి కలిపి సన్నమంట మీద ఉడికించాలి. చివరగా యాలకుల పొడి వేసి మంట ఆపేయాలి. ఇప్పుడు పాలు పోసి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్, శొంఠి వేసి కలపాలి. గమనిక: పరమాన్నం మందపాటి పాత్రలో వండితే అడుగున అంటుకోకుండా, మాడకుండా ఉంటుంది.