వరిగమలు! | sakshi food special | Sakshi
Sakshi News home page

వరిగమలు!

Published Fri, Oct 21 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

వరిగమలు!

వరిగమలు!

మ్యూజిక్ మంచి మెడిసిన్.
అలాగే వరిగలు.
మైండ్‌కు సరిగమలు ఎలాగో...
బాడీకి వరిగలు అలాగ!
మ్యూజిక్ లవర్స్ ఎప్పుడూ ఎంగ్‌గా ఉంటారు.
వరిగలు తిన్నా అంతే..
ఎవర్ గ్రీన్‌గా కనిపిస్తారు.
ఎంజాయ్ దీజ్ ‘వరిగ’మలు.

 

వరిగ మురుకులు
కావలసినవి: వరిగలు- ఒక గ్లాసు, శనగపప్పు- పావు గ్లాసు, మినప్పప్పు- పావు గ్లాసు, పెసర పప్పు- పావు గ్లాసు, వరిబియ్యం- పావు గ్లాసు, జీలకర్ర- రెండు చెంచాలు, వాము- ఒక చెంచా, కారం- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, నూనె- మురుకులు కాలడానికి సరిపడినంత

 
తయారు చేయాల్సిన పద్ధతి:  వరిగలు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, వరి బియ్యం అన్నింటినీ మందపాటి బాణలిలో (నూనె లేకుండా) సన్నమంట మీద దోరగా వేయించాలి. ఒక్కొక్క దానిని విడిగా వేయించుకోవచ్చు. కలిపి వేయించాలనుకుంటే ముందుగా శనగలు వేసి అవి ఒక మోస్తరుగా వేగిన తర్వాత మిగిలిన ధాన్యాలను వేయాలి. చల్లారిన తర్వాత మరపట్టించి జల్లించాలి.  పై పిండిలో జీలకర్ర, వాము, కారం, ఉప్పు, రెండు చెంచాల వేడినూనె వేసి బాగా కలపాలి. అందులో ఒక కప్పు వేడి నీరు పోసి కలపాలి. చివరగా తగినంత చన్నీళ్లతో పిండిని ముద్దగా చేయాలి. బాణలిలో నూనె వేడి చేసి కాగిన తర్వాత పిండిని మురుకుల (జంతికల) గొట్టంలో పెట్టి నూనెలోకి వత్తాలి. మీడియం మంట మీద మురుకులను దోరగా వేయించాలి. మురుకులు వేగిందీ లేనిదీ తెలియాలంటే చిల్లుల గరిటెతో మురుకుల మీద చిన్నగా తడితే తీగ లోపల మెత్తగా ఉందా గట్టి పడిందా అనే అంచనా వస్తుంది.

 
గమనిక: కలిపిన పిండి ఆరిపోకూడదు. తడివస్త్రంతో కప్పి ఉంచి గొట్టంలో పట్టేంత పిండిని విడిగా తీసుకుంటూ మురుకులు చేయాలి.

 

వరిగ  తీపి అప్పం
కావలసినవి: వరిగపిండి- ఒక కప్పు, కొబ్బరి కోరు- ఒక కప్పు, కొబ్బరి ముక్కలు- పిడికెడు, బెల్లంపొడి- ముప్పావు కప్పు, పటిక బెల్లం పొడి- ఒక చెంచా, ఈస్ట్- అర చెంచా, జీడిపప్పు, కిస్‌మిస్ - గుప్పెడు, నెయ్యి - ఒక చెంచా, యాలకుల పొడి- అర చెంచా

తయారు చేయాల్సిన పద్ధతి:  వరిగ పిండిని మందపాటి బాణలిలో వేసి (నూనె లేకుండా) సన్నమంట మీద దోరగా వేయించాలి. అర కప్పు వేడి నీటిలో ఈస్ట్, పటిక బెల్లం పొడి కలిపి పక్కన ఉంచాలి.   బెల్లం పొడిలో పావు కప్పు నీరు పోసి సన్న మంట మీద ఐదు నిమిషాల సేపు మరిగించి దించాలి. ఇందులో వేయించి చల్లార్చిన వరిగపిండి, ఈస్ట్- పటికబెల్లం నీటిని వేసి కలిపి రెండు గంటల సేపు పక్కన పెట్టాలి.  జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్‌మిస్‌ని నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.   రెండు గంటల తర్వాత ఈ మిశ్రమంలో యాలకులపొడి, కొబ్బరి కోరు వేసి అవసరమైతే మరికొంత నీటిని చేర్చి గరిటె జారుడుగా (ఇడ్లీ పిండిలా) కలుపుకోవాలి.

     
అంచులు ఎత్తుగా ఉన్న పళ్లేనికి నెయ్యిరాసి పై మిశ్రమాన్ని పోసి సమంగా సర్దాలి. పైన వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, కొబ్బరి ముక్కలు సర్దాలి. ఇడ్లీ పాత్రలో అడుగున నీరు పోసి పైన పళ్లేన్ని పెట్టి 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. చల్లారిన తర్వాత తీసి ముక్కలుగా కోసి వడ్డించవచ్చు.

 
గమనిక:  మిశ్రమంలో పళ్లెంలో సగానికి మించరాదు. ఉడికేటప్పుడు మిశ్రమం గుల్లగా పొంగి అప్పం పళ్లెం నిండుగా వస్తుంది.  ఈస్ట్ లేకపోతే ఒక స్పూను పులిసిన పెరుగు కలుపుకోవచ్చు.

 

వరిగ పుట్టు
కావలసినవి: వరిగ బియ్యం- ఒక గ్లాసు, కొబ్బరి కోరు- అరకప్పు, ఉప్పు- అర చెంచా
తయారు చేయాల్సిన పద్ధతి:  వరిగబియ్యాన్ని ఐదు గంటల సేపు నానబెట్టి నీరంతా పోయేవరకు వడపోయాలి. ఆ బియ్యాన్ని పొడి వస్త్రం మీద పోసి నీడన ఇరవై నిమిషాల సేపు ఆరబెట్టి మరపట్టించాలి.  ఆ పిండిని వెడల్పాటి పళ్లెంలో పోసి అందులో ఉప్పు వేసి కొద్దిగా నీటిని వేసి తడిపొడిగా కలుపుకోవాలి. మిశ్రమం ముద్దగా కాకూడదు. పిండి అంతటికీ నీరు అందాలి, చేత్తో నలిపితే పొడిగా రాలిపోతున్నట్లు ఉండాలి. ఇలా కలుపుకుని ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచాలి. కలిపేటప్పుడు నీటిని ఒకేసారి పోస్తే ఒక చోట ముద్దయి మిగిలిన పిండి అంతా పొడిగా ఉండిపోతుంది. కాబట్టి పిండిలో కొద్దికొద్దిగా నీటిని చిలకరించుకుంటూ కలుపుకోవాలి.  పుట్టు తయారు చేసే గొట్టంలో కొంచెం కొబ్బరి కోరు కూరాలి, ఆ పైన పుట్టు పిండిని కూరాలి. ఆ పైన కొబ్బరికోరు, తర్వాత పిండి... అలా పొరలు పారలుగా నింపాలి. దీనిని ఆవిరి మీద ఆరేడు నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇది చాలా బలవర్ధకమైన ఉపాహారం.

 

వరిగ దిబ్బరొట్టె
కావలసినవి: వరిగలు- ఒక గ్లాసు, కందిపప్పు- పావు గ్లాసు, శనగపప్పు- పావు గ్లాసు, మినప్పప్పు- పావు గ్లాసు, పెసరపప్పు- పావు గ్లాసు, పుల్లటి పెరుగు- పావు గ్లాసు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద- రెండు చెంచాలు, పసుపు- ఒక చెంచా, కారం- ఒక చెంచా, ఉప్పు - తగినంత, సొరకాయ తురుము- అరకప్పు, క్యాబేజ్ తురుము- అరకప్పు, మెంతికూర- అరకప్పు, కొత్తిమీర- పావు కప్పు, వంటసోడా- అరచెంచా; పోపుకోసం: ఆవాలు- రెండు చెంచాలు, కరివేపాకు- రెండు రెమ్మలు, నువ్వులు- మూడు చెంచాలు, నూనె- పావు కప్పు

 
తయారు చేయాల్సిన పద్ధతి:  వరిగలు, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పును నాలుగు గంటల సేపు నానబెట్టాలి. నానిన తర్వాత మెత్తగా రుబ్బాలి. అందులో పెరుగు, కారం, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి ముద్ద, పసుపు, సొరకాయ తురుము, క్యాబేజ్ తురుము, మెంతికూర, కొత్తిమీర వేసి రెండు గంటల సేపు పక్కన ఉంచాలి.  ఒక బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు పై మిశ్రమంలో వంటసోడా కలిపి పోపు బాణలిలో పోయాలి. బాణలి అంతటా సమంగా సర్ది మీడియం మంట మీద కాలనివ్వాలి. ఒక వైపు కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి. దీనిని పుదీన చట్నీ లేదా పెరుగు చట్నీతో తినవచ్చు.

 

వరిగ  పరమాన్నం
కావలసినవి: వరిగ బియ్యం- ఒక గ్లాసు, బెల్లం పొడి - ఒక గ్లాసు, పాలు- అరగ్లాసు, నెయ్యి- రెండు చెంచాలు, యాలకుల పొడి- అర చెంచా, శొంఠి- చిటికెడు

 
జీడిపప్పు, కిస్‌మిస్- గుప్పెడు, కర్జూరం ముక్కలు- రెండు చెంచాలు

 
తయారు చేయాల్సిన పద్ధతి:  వరిగ బియ్యాన్ని కడిగి రెండు గంటల సేపు నానబెట్టాలి. తర్వాత మూడు గ్లాసుల నీరు పోసి మెత్తగా ఉడికించాలి.  ఈ లోపు పాలను మరిగించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్‌మిస్ వేయించాలి. అన్నం ఉడికిన తర్వాత కర్జూరం ముక్కలు, బెల్లం పొడి కలిపి సన్నమంట మీద ఉడికించాలి. చివరగా యాలకుల పొడి వేసి మంట ఆపేయాలి. ఇప్పుడు పాలు పోసి, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, శొంఠి వేసి కలపాలి.

 
గమనిక: పరమాన్నం మందపాటి పాత్రలో వండితే అడుగున అంటుకోకుండా, మాడకుండా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement