అన్నం సయించనప్పుడు ఇలా తీసుకుంటే మేలు..! | This Is Good Way To Eat When You Don't Feel Like Eating Rice | Sakshi
Sakshi News home page

అన్నం సయించనప్పుడు ఇలా తీసుకుంటే మేలు..!

Published Tue, Dec 3 2024 10:10 AM | Last Updated on Tue, Dec 3 2024 10:47 AM

This Is Good Way To Eat When You Don't Feel Like Eating Rice

చాలా మంది సరిగా భోజనం చేయరు. ఏమీ తినాలనిపించడం లేదనీ, తమకు అన్నం సయించడం లేదనీ చెబుతుంటారు. సాధారణంగా కాస్త పెద్దవయసు వచ్చాక ఇలాంటి మార్పు చాలామందిలో కనిపిస్తుంది. ఇలాంటివారు ఎలా తినాలో, ఎలా తినడం వల్ల తమకు అందాల్సిన పోషకాలు అందుతాయో తెలుసుకుందాం.

అన్న సయించనివారు ఏదో తినడం కోసమంటూ చాలా తక్కువగానే తింటున్నప్పటికీ ఆ భోజనం అన్ని పోకాలూ అందేలాంటి బ్యాలెన్స్‌డ్‌ డైట్‌తో కూడిన మీల్‌ గా ఉండాలి. అంటే అందులో దేహానికి అవసరమైన పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు  వంటివి పుష్కలంగా అందేలా కాయధాన్యాలూ, పప్పుధాన్యాలు, తినేవారైతే మాంసాహారంలోని వేటమాంసం, కోడిమాంసం, చేపలు, ఇక మిగతా అందరూ ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పాల ఉత్పాదనలు, తాజా పండ్లు ఇవన్నీ.

ఎంత ఆహారం అవసరమంటే... 
ఓ వ్యక్తికి ఇంత ఆహారం అవసరమని నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే... ఓ వ్యక్తికి ఎన్ని క్యాలరీల ఆహారం అవసరం అన్నది... వారి వయస్సు, వారు పురుషుడా/వుహిళా, వాళ్ల బరువు, వాళ్లు రోజువారీ చేపే పనులు, అవి శ్రమతో కూడినవా, లేక ఒకేచోట కూర్చుని చేసేవా... ఇలాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

అన్నం సయించని వారు తినే వాటిల్లోనే రుచిగా... 
అన్నం సయించడం లేదంటూ పెద్దగా ఆహారం తీసుకోనివారు... తాము తినే ఆ కొద్దిపాటి ఆహారంలోనే వీలైనన్ని రకరకాల పదార్థాలు రకరకాల పద్ధతుల్లో కాస్తంత నాలుకకు రుచిగా వండినవి, తినేందుకు ప్రయత్నించాలి. ఆహారంలోనూ అనేక రకాలు (వెరైటీస్‌) వండి తీసుకోవడం వల్ల ... అవి కొన్నీ, ఇవి కొన్నీ తీసుకుంటూ చాలా రకాలు ఉండటం వల్ల తీసుకోవాల్సిన పరిమాణం అంతో ఇంతో భర్తీ అయ్యే అవకాశం ఉంది. దాంతో వారు తీసుకోవాల్సిన రోజువారీ ఆహారపు పరిమాణం చాలావరకు అందే అవకాశముంది.

ఇదీ సాధారణ డైట్‌ ప్లాన్‌... 
అన్నం సయించనివారు ఈ కింది సాధారణ డైట్‌ ప్లాన్‌ అవలంబిస్తే మంచిది. ఇలాంటివాళ్లంతా రోజూ తమ రోజువారీ ఆహారంలో చపాతీ లేదా అన్నంతోపాటు పప్పులు (దాల్‌) లేదా శెనగలు, రాజ్మా వంటివి తీసుకోవడం మంచిది. వీటి కారణంగా వారికి అవసరమైన కార్బోహైడ్రేల్లు,ప్రోటీన్లు సమకూరుతాయి. భోజనం చివర్లో ఓ కప్పు పెరుగుతో పెరుగన్నం తినాలి. భోజనానికి ముందు క్యారట్, కీర, దోస వంటి కూరగాయలను సలాడ్స్‌గా తీసుకోవాలి. 

ప్రతిరోజూ పడుకోబోయే వుుందు ఓ కప్పు పాలు తాగితే కొద్దిమేర ఆరోగ్యకరమైన కొవ్వులు, క్యాల్షియమ్‌ సమకూరుతాయి. తినే పరివూణం తక్కువైనా, అందులోనే ఆ సీజన్‌లో దొరికేవైన తాజా పండ్లను  సాధ్యమైనన్ని  తీసుకోవాలి. చాలా తరచుగా అప్పుడప్పుడూ తృణధాన్యాలతో ఏవైనా వంటకాలను చిరుతిండ్లలా చేయించుకుని తినాలి. చిరుతిండి కాబట్టి ఈ శ్నాక్స్‌ రుచిగా ఉండి, బాగా తినాలని అనిపిస్తాయి.
ఇలా ఇన్ని వెరైటీలుగా రకరకాల ఆహారాల్ని తీసుకోవడం వల్ల ఒంటికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజలవణాలూ, మైక్రో, మ్యాక్రో న్యూట్రియెంట్లు... అన్నీ అందేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ తీసుకుంటే తక్కువగానే తింటున్నప్పటికీ అవసరమైన పోషకాలన్నీ చాలావరకు దొరుకుతాయి. 

(చదవండి: గుండెకు మేలు చేసే పండ్లు..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement