పంటలకు ముగిసిన గడువు
వరికి మాత్రమే వెసులుబాటు ఇచ్చిన కంపెనీలు
ఇప్పటివరకు 9.75 లక్షల ఎకరాలకే బీమా
7.46 లక్షల మందికి మాత్రమే బీమా కవరేజ్
మండిపడుతున్న రైతు సంఘాలు
గతేడాది 43.82 లక్షల మందికి బీమా
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటల బీమా పథకం నత్తనడకన సాగుతోంది. స్వచ్ఛందంగా రైతులే నమోదు చేసుకోవాల్సి ఉన్న బీమా పథకంపై వారికి అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభు త్వం ఘోరంగా విఫలమైంది. మరోవైపు బీమా ప్రీమియం కూడా అధికంగా ఉండటంతో రైతులు ఈ పథకంలో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. వాస్తవానికి వరితో సహా అన్ని పంటలకు ప్రీమియం గడువు డిసెంబర్ 31నే ముగిసింది. అయితే వరికి మాత్రమే ప్రీమియం గడువును పెంచేందుకు బీమా కంపెనీలు ముందుకొచ్చాయి. జనవరి 15 వరకు ప్రీమియం చెల్లింపునకు అవకాశం కల్పించాయి. నోటిఫై చేసిన జీడి పంటకు గతేడాది నవంబర్ 22తో, ఇటీవల కొత్తగా నోటిఫై చేసిన మామిడితో సహా అన్ని పంటలకు డిసెంబర్ 31తో బీమా ప్రీమియం చెల్లించడానికి గడువు ముగిసింది.
ఈసారి 7.46 లక్షల మందే..
నోటిఫై చేసిన పంటల సాగు లక్ష్యం 60.55 లక్షల ఎ కరాలు కాగా ఇప్పటి వరకు అతికష్టమ్మీద 9.75 లక్షల ఎకరాల్లో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. గతేడాది 43.82 లక్షలమంది రైతులకు బీమా రక్షణ లభించగా, ఈ ఏడాది రబీలో పంటలు సాగు చేసిన రైతుల్లో కేవలం 7.46 లక్షల మంది రైతులు మాత్రమే బీమా కవరేజ్ పొందగలిగారు.
నమోదు చేసుకోవడం ఓ ప్రహసనం..
పంటల బీమాలో స్వచ్ఛంద నమోదు రైతులకు తలనొప్పిగా మారింది. బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులు ముందుగా తాము సాగు చేసే పంటల వివరాలను జాతీయ పంటల బీమా పోర్టల్ (ఎన్‌సీఐసీ)లో నమోదు చేయాలి. రుణం తీసుకునేటప్పుడు బ్యాంకు వాళ్లే ప్రీమియం వసూలు చేసి సదరు బీమా కంపెనీకి చెల్లిస్తారు. ఒకవేళ బీమా వద్దనుకుంటే రాతపూర్వకంగా బ్యాంకుకు వెల్లడిస్తే సరిపోతుంది. బ్యాంకుల నుంచి రుణం పొందని రైతులు తమ వాటా ప్రీమియంను ఆన్‌లైన్‌లో చెల్లించి, ధ్రువీకరణ పత్రాలతో సచివాలయాలు/ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు/పోస్టాఫీస్‌లు/కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఎన్‌సీఐసీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
కౌలు రైతులకైతే సీసీఆర్సీ కార్డులు తప్పనిసరి. రైతులు సాగు చేసిన పంటలను ధ్రువీకరిస్తూ రైతు సేవా కేంద్రాల సిబ్బంది జారీ చేసే ఏరియా షోన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఆధార్ సీడింగ్ బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లింపు, ఎన్‌సీఐసీ పోర్టల్‌లో గడువులోగా అప్‌లోడ్ చేయడం రైతులకు కత్తి మీదసాములా మారింది. బీమా లేకపోయినా పర్వాలేదు.. పనులు మానుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగలేకపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment