మొగిలి, శివసాయి (ఫైల్)
సాక్షి, కరీంనగర్: ఆ కుటుంబంలో పాప జన్మించింది.. అందరూ ఆనందంగా ఉన్నారు.. వైద్యులు డిశ్చార్జి చేయడంతో ఇంటి పెద్ద తల్లీబిడ్డను ఇంటికి పంపించాడు.. తర్వాత తన కుమారుడితో కలిసి ఆటోలో వెళ్తుండగా ఇసుక లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరినీ కబళించింది. వివరాల్లోకి వెళ్తే.. వీణవంక మండలంలోని మామిడాలపల్లికి చెందిన దరిపెల్లి జ్యోతి డెలివరీ కోసం కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చేరింది. ఈ నెల 14న పండంటి పాపకు జన్మనిచ్చింది.
అయితే, జ్యోతికి ఇన్‌ఫెక్షన్ కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, వైద్యం చేయించారు. రెండు రోజుల క్రితమే అక్కడి నుంచి కరీంనగర్ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు సోమవారం డిశ్చార్జి చేశారు. దీంతో జ్యోతి భర్త మొగిలి(45) తన భార్యాబిడ్డను ఆటోలో ఇంటికి పంపించాడు. కుమారుడు శివసాయి(12)తో కలిసి కూరగాయలు, పండ్లు, ఇంటి సామగ్రి తీసుకొని, తన సొంత ఆటోలో మామిడాలపల్లికి బయలుదేరాడు.
మానకొండూర్ మండలంలోని రంగపేట వద్ద ఇసుక లారీ వేగంగా వచ్చి, ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మొగిలి, శివసాయి అక్కడికక్కడే మృతిచెందారు. లారీ పైనుంచి వెళ్లడంతో శివసాయి మృతదేహం నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాలను చూసి, కన్నీరుమున్నీరుగా విలపించారు.
న్యాయం చేయాలని ఆందోళన..
అనంతరం బంధువులు కరీంనగర్–జమ్మికుంట రహదారిపై ఆందోళన చేపట్టారు. మానకొండూర్, తిమ్మాపూర్ సీఐలు రాజ్‌కుమార్, ఇంద్రసేనారెడ్డిలు విరమించాలని కోరగా తమకు న్యాయం జరిగేవరకు మృతదేహాలను తీసేది లేదని తేల్చిచెప్పారు. ఈ సంఘటనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి పోయి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఓవైపు పాప జన్మించడం, మరోవైపు ఇద్దరి ప్రాణాలు పోవడంతో ఆ కుటుంబ పరిస్థితిని చూసి, స్థానికులు కంటతడి పెట్టారు. అతివేగంగా వెళ్తున్న ఇసుక లారీలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేతల పరామర్శ..
ప్రమాద విషయం తెలుసుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మానకొండూర్ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఘటనాస్థలికి చేరుకొని, బాధితులను పరామర్శించి, ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment