బంగారు తల్లికి బెంగ
వీరఘట్టం : బంగారుతల్లి పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆడపిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేరును మా ఇంటి మహాలక్ష్మిగా మార్చి అమలు చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం ప్రభుత్వం.. ఆ పని చేయకపోగా ఉన్న పథకానికే మంగళం పాడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి చెందిన ప్రభుత్వ వెబ్సైట్ ఈ నెల 9 నుంచి మూతపడింది. ఫలితంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. మరోవైపు గత ఏడాది మార్చి నుంచి ఈ పథకం లావాదేవీలను ప్రభుత్వం నిలిపివేసింది. అప్పటి నుంచి కొత్త దరఖాస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా అది కూడా నిలిచిపోవడంతో బంగారు తల్లులకు నిరాశే మిగులుతోంది.
బంగారంలాంటి పథకం: ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ఆర్థిక ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు ప్రభుత్వ చర్యలు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వం హయాంలో 2013 మే ఒకటో తేదీన ఈ పథకం అమలులోకి వచ్చింది. ఆస్పత్రిలో కాన్పు జరిగి ఆడబిడ్డ పుట్టిన వెంటనే అర్హతలుండి దరఖాస్తు చేసుకున్న వారి పేరిట తక్షణమే రూ.2500 ఖాతాలో జమ చేస్తారు. మొదటి ఏడాది వ్యాధి నిరోధక టీకాలన్నింటిని సక్రమంగా వేయిస్తే రెండో ఏడాది ప్రోత్సాహకంగా రూ.1000 జమ చేస్తారు. ఇలా ఆడపిల్లకు 21 ఏళ్లు వచ్చే వరకు ప్రోత్సాహకాలు జమచేసి పెళ్లి సమయానికి ఏకమొత్తంగా అందజేస్తారు.
ఈ పథకం లబ్ధిదారులుగా చేరిన వారికి 2014 పిబ్రవరి నిధులు జమ అయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మార్చి నుంచి జమలు నిలిచిపోయాయి. 2014 మే ఒకటో తేదీకి సంవత్సరం గడిచిపోయినా ఒక్క లబ్ధిదారుకు కూడా రెండో సంవత్సరం ప్రోత్సాహక నగదు జమ కాలేదు. ఇప్పుడు మూడో సంవత్సరం సమీపిస్తున్నా అదే పరిస్థితి. బంగారు తల్లి పథకం కింద జిల్లాలో 14734 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో 6637 మందికి రూ.2500 చొప్పున జమ అయింది. 695 మంది తల్లులు ఇంటి వద్ద ప్రసవించడంతో వీరికి ప్రోత్సాహకం అందలేదు. మిగిలిన 7402 మందికి ఈ మొత్తం జమ కావాల్సి ఉంది. కాగా దరఖాస్తు చేసుకున్న వారిలో 5688 మందికే సర్టిఫికెట్లు అందాయి. సర్టిఫికెట్ అందితేనే బంగారుతల్లి పథకం కింద నమోదైనట్లు నిర్థారిస్తారు. పలువురు సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నా అధికారులు పెద్దగా స్పందించడం లేదు.
తల్లిదండ్రుల అసంతృప్తి :గత ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిలిపివేయడంపై ఆడపిల్లలు తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ వరకు చదువులో రాణిస్తే వివాహ సమయానికి రూ.2.16 లక్షలు సంబంధిత కుటుంబానికి చేరుతుంది. బంగారుత ల్లి ఉద్దేశం మంచిదే అయినా ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తుండటంతో వేలాది మంది ఆశలు నీరుగారుతున్నాయి.