సఫారీలకు బంగ్లా షాక్
రెండో వన్డేలో విజయం
ఢాకా : ఇటీవల నిలకడగా ఆడుతున్న బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికాకు కూడా షాక్ ఇచ్చింది. బౌలర్ల సమష్టి కృషికి తోడు ఓపెనర్ సౌమ్య సర్కార్ (79 బంతుల్లో 88 నాటౌట్; 13 ఫోర్లు; 1 సిక్స్) సూపర్ బ్యాటింగ్ కారణంగా దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో బంగ్లా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ 46 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బంగ్లా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు డు ప్లెసిస్ (64 బంతుల్లో 41; 3 ఫోర్లు), బెహర్డీన్ (44 బంతుల్లో 36; 2 ఫోర్లు; 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ముస్తఫిజుర్, నాసిర్ హొస్సేన్‌లకు మూడేసి వికెట్లు, రూబెల్కు రెండు వికెట్లు పడ్డాయి.
బంగ్లాదేశ్ 27.4 ఓవర్లలోనే మూడు వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. తన తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీసిన రబడా బంగ్లా శిబిరంలో ఆందోళన రేపినా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సౌమ్య, మహ్ముదుల్లా (64 బంతుల్లో 50; 6 ఫోర్లు) జోడి దీటుగా నిలబడింది. క్రీజులో ఆత్మవిశ్వాసంతో ఆడిన వీరు మూడో వికెట్‌కు 135 పరుగులు జోడించి విజయాన్ని అందించారు. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్ చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది.