హాకీ చాంప్ బెంగళూరు
అనంతపురం స్పోర్ట్స్, న్యూస్‌లైన్:
దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల హాకీ టోర్నమెంటు విజేతగా బెంగళూరు యూనివర్సిటీ జట్టు నిలిచింది. టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. నాలుగు పాయింట్లతో భారతీదాసన్ యూనివర్సిటీ జట్టు రన్నరప్ సాధించింది. ఎస్కే యూనివర్సిటీ మూడు పాయింట్లతో మూడో స్థానం, అన్నా యూనివర్సిటీ జట్టు ఒక పాయింట్‌తో నాల్గో స్థానంలో నిలిచాయి. శుక్రవారం అనంత క్రీడాగ్రామంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు, భారతీదాసన్ యూనివర్సిటీల జట్లు తలపడ్డాయి. బెంగళూరు 3-1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. కుష మూడు గోల్స్ చేశాడు. భారతీదాసన్ తరఫున రామచంద్రన్ ఒక గోల్ సాధించాడు. మూడోస్థానం కోసం అన్నా యూనివర్సిటీ, ఎస్కేయూ జట్లు పోటీపడ్డాయి. ఎస్కేయూ జట్టు 4-2 గోల్స్ తేడాతో జయకేతనం ఎగురవేసింది. అన్నా వర్సిటీ తరఫున చరణ్ కుమార్ 2 గోల్స్ చేశాడు. ఎస్కేయూ తరఫున కుళ్లాయప్ప, అమర్నాథ్ చెరో గోల్ సాధించారు. అన్నా జట్టు రెండు సెల్ఫ్ గోల్స్ చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది.
బహుమతుల ప్రదానం
టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్కేయూ జట్టు అఖిల భారత విశ్వవిద్యాలయాల హాకీ టోర్నీకి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. టోర్నీ పరిశీలకుడు చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ అఖిల భారత హాకీ టోర్నీకి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో డీఎస్డీఓ శ్రీనివాస్ కుమార్, హాకీ సంఘం జిల్లా కార్యదర్శి డాక్టర్ విజయబాబు, ఎస్కేయూ రిజిస్ట్రార్ గోవింద ప్ప, వీసీ సతీమణి సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
3