అప్పు తీర్చలేక అన్నదాత ఆత్మహత్య
ఎండిన పంటలు, చేసిన అప్పులు ఒక రైతు ఆత్మహత్యకు దారితీశాయి. ఒడిశాలోని నవరంగపూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఘటన గురించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్ జిల్లా చందాహండి సమితి కొలిమండ గ్రామానికి చెందిన ఒకిల బంజర్ అనే రైతు ఆదివారం ఉదయం నాగలి తీసుకుని పొలానికి వెళ్లాడు. కొంతసేపైన తర్వాత అతని భార్య బసంత బంజన్ అల్పాహారం, టీ తీసుకుని వెళ్లింది. పొలంలో ఒక చెట్టుకు ఉరివేసుకున్న ఒకిలను గమనించింది. ఆమె ఏడుస్తూ గట్టిగా ఇరుగుపొరుగువారిని పిలిచింది. వారు వచ్చి చూసేసరికే అతను మృతి చెందినట్లు గుర్తించి చందాహండి పోలీసులకు సమాచారమిచ్చారు. చందాహండి పోలీసు అధికారి మానస రంజన్ నాయక్ సిబ్బందితో వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పుల బాధలు తాళలేక ఒకిల బంజర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి చిన్నాన్న కమొలో బంజర్ తెలిపాడు.