'రైతుల సమస్యలను ఇప్పటికే అధ్యయనం చేశాం'
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిర వ్యవసాయ అభివృద్ధి సాధించేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ కమిషన్ పలుచోట్ల పర్యటించిందని వ్యవసాయ కమిటీ కన్వీనర్ వెంకటరెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో రైతుల నుంచి కమిటీ అభిప్రాయాలను సేకరించిందని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయానికి కలుగుతున్న అడ్డంకులను కమిటీ రైతులు వివరించారని చెప్పారు. జూన్ కల్లా ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక అందిస్తుందని, ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నారని వెంకట రెడ్డి తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే అధ్యయనం చేశామని అన్నారు.
జాతీయ మత్య్సకారుల సంఘం చైర్మన్ బంజి మాట్లాడుతూ.. విశాఖపట్నానికి సువిశాలమైన తీరం ఉందని, మత్స్యకారులను ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. బోట్లకు సబ్సిడీ సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బంజి ఆవేదన వ్యక్తం చేశారు. దళారి వ్యవస్థను నిర్మూలించి నేరుగా సంప్రదాయ మత్స్యకారులు వ్యాపారం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బంజి డిమాండ్ చేశారు.