పడిలేచిన ‘ప్రగతి’!
అవయవాలన్నీ బాగున్నప్పటికీ కష్టపడకుండా ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవిస్తుంటారు కొందరు. రెండు చేతులు కోల్పోయిన ఓ అమ్మాయి మాత్రం ఎవరి మీదా ఆధారపడకుండా, తన పనులు తానే చేసుకుంటూ, ఖర్చులకోసం సొంతంగా సంపాదిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ప్రగతి దురదృష్ట వశాత్తు రెండు చేతులను కోల్పోయింది. 2010లో ప్రగతి అనుకోకుండా విద్యుత్ సరఫరా అవుతున్న వైర్‌ను పట్టుకోవడంతో..∙రెండు చేతులు కాలిపోయాయి.
చికిత్సలో భాగంగా చేతులను మోచేయి వరకు డాక్టర్లు తొలగించారు. దీంతో తన రోజువారి పనులు చేసుకోవడానికి కూడా ప్రగతి చాలా కష్టపడేది. అయినా ఎలాగైనా ఎవరిసాయం తీసుకోకుండా బతకాలనుకుంది. క్రమంగా తన ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని మొబైల్ ఫోన్, కంప్యూటర్లను ఆపరేట్ చేయడం నేర్చుకుంది. అంతేగాకుండా ఒకపక్క విద్యార్థులకు పాఠాలు చెబుతూ మరోపక్క బ్యాంక్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది.
‘‘ఎన్ని కష్టాలు ఎదురైనా అమ్మాయిలు తమ కలల్ని నిజం చేసుకోవడంలో వెనక్కి తగ్గకుండా కష్టపడి సాధించాలి’’ అని ప్రగతి చెప్పింది. మొదట్లో తన పనులు తాను చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. క్రమంగా పనులు చేసుకోవడం మొదలు పెట్టాను. అలా పనులు చేసుకోవడం వల్ల ఏదైనా చేయగలను అనిపించింది. ఈ క్రమంలోనే ఫోన్ ఆపరేట్ చేయగలిగాను. తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశ్యంతో టీచర్‌గా పనిచేస్తూ సంపాదిస్తున్నానని, భవిష్యత్తులో బ్యాంక్ ఉద్యోగం పొందడమే తన కలని ప్రగతి చెప్పింది.