స్త్రీ నిధి డబ్బులు గోల్మాల్
రూ. 10 లక్షలు పక్కదారి పట్టించిన వెలుగు సిబ్బంది
జిల్లా కలెక్టర్కు సభ్యుల ఫిర్యాదు
కురబలకోట : మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఏర్పాటైన డ్వాక్రా (వెలుగు) గ్రూపు రుణాలు పక్కదారి పడుతున్నాయి. కురబలకోట మండలంలోని బండపల్లె, ఎర్రజానివారిపల్లె, నందిరెడ్డిగారిపల్లె, చేనేతనగర్, గౌనివారిపల్లె తదితర గ్రామాల్లోని గ్రూపుల్లో వెలుగు (డ్వాక్రా) సిబ్బంది రూ.10లక్షల వరకు చేతి వాటం చూపారు. బుధవారం వెలుగు సిబ్బంది నిర్వాకంపై డ్వాక్రా గ్రూపు సభ్యులు నిరసన తెలిపారు. సభ్యుల కథనం మేరకు.. అంగళ్లు గ్రామం బండపల్లె పరిసర గ్రామాల్లో వెంకటేశ్వర, లక్ష్మి, శ్రీవినాయక, విఘ్నేష్ గ్రూపులు ఉన్నాయి. వీటిలో రూ.10 లక్షల వరకు స్త్రీనిధి, బ్యాంకు రుణాల నిధులు స్వాహా అయ్యాయి.
రెండు రోజుల కిందట గ్రూపు సభ్యులు లెక్కలు చూశారు. అవకతవకలు, అక్రమాలు బయటపడ్డాయి. ఓ గ్రూపు అకౌంట్ నుంచి ఏకంగా రూ.7 లక్షలను మరొకరి ఖాతాకు సంఘమిత్ర ట్రాన్స్ఫర్ చేసి డ్రా చేసినట్లు స్పష్టమైంది. వెలుగులో పనిచేస్తున్న సంఘమిత్ర ఈ నిధులను స్వాహా చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, డీఆర్డీఏ పీడీకి గ్రూపు సభ్యులు ఫిర్యాదు పత్రం పంపారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.