breaking news
bank looted
-
సిబ్బందిని కట్టేసి రూ. 21 కోట్లు లూటీ
విజయ్పురా (కర్ణాటక): ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు తుపాకులు, కత్తులతో సిబ్బందిని బెదిరించి ఓ బ్యాంకును లూటీ చేసి రూ.20 కోట్లకు పైగా దోచుకున్నారు. ఈ ఘటన కర్ణాటక విజయ్పురా జిల్లాలోని ఎస్బీఐకి చెందిన చాడ్చాన్ బ్రాంచ్లో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దుండగులు దోచుకున్న నగదు, బంగారు ఆభరణాల విలువ రూ. 21 కోట్లకుపైగా ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు కరెంటు ఖాతా తెరవాలంటూ బ్యాంకుకు వచ్చి మేనేజర్, క్యాషియర్, ఇతర సిబ్బందిని తుపాకులు, కత్తులతో బెదిరించారని పోలీసులు చెప్పారు. దుండగులు బ్యాంకు సిబ్బంది కాళ్లు, చేతులను కట్టేసి రూ.కోటికిపైగా నగదు, రూ.20 కోట్ల విలువైన 20 కేజీల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు నకిలీ నంబర్ ప్లేటు ఉన్న సుజుకీ ఎవా అనే కారులో వచ్చారని విజయ్పురా ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి చెప్పారు. చోరీ అనంతరం దుండగులు మహారాష్ట్రలోని పండర్పూర్ వైపు పారిపోయినట్లు తెలిపారు. -
జమ్ముకశ్మీర్లో భారీ బ్యాంకు దోపిడి
పెద్దనోట్ల రద్దుతో బ్యాంకులకి చేరుతున్న భారీ డిపాజిట్లతో పాటు కొత్త కరెన్సీ నోట్లపై దుండగులు కన్నేశారు. దొరికిందే అవకాశంగా బ్యాంకులను లూటీ చేస్తూ సొమ్మును కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం దక్షిణ కశ్మీర్ పుల్వామాలోని అరిహల్ ప్రాంతంలోని ప్రభుత్వరంగ బ్యాంకు జమ్ముకశ్మీర్ బ్యాంకు శాఖలో గుర్తుతెలియని దుండగులు గన్లతో దాడిచేసి, రూ.8 లక్షలకు పైగా నగదును అపహరించుకుపోయారు. నగదును పట్టుకుని వెళ్లేముందు కూడా బ్యాంకులోని వారిని బెదిరించడానికి పలుమార్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే వీరు దోచుకెళ్లిన నగదు కొత్త నోట్లా, పాత నోట్లా అనేది ఇంకా తెలియరాలేదు. ఏ కరెన్సీ వారు దోచుకెళ్లారో ప్రస్తుతం బ్యాంకు అధికారులు నిర్థారిస్తున్నారు. మరోవైపు దుండగులను పట్టుకునేందుకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అరిహల్ శాఖలో దొంగతనం జరిగిన రోజే ఇదే బ్యాంకుకు చెందిన పోష్కర్ ప్రాంతంలోని శాఖలోనూ చోరి జరిగింది. అయితే పాతనోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం జమ్ముకశ్మీర్ బ్యాంకుల్లో ఇలాంటి దోపిడి జరగడం ఇది రెండోసారి. గత నెల కూడా గుర్తుతెలియని దుండగులు కిషత్వార్ జిల్లాలోని జమ్ముకశ్మీర్ బ్యాంకులో రూ.35 లక్షల నగదును అపహరించుకుపోయారు. పెద్ద నోట్లను రద్దుచేయడంతో నల్లధనాన్ని నిర్మూలించడంతో పాటు, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడిచేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బ్యాంకులకు వస్తున్న భారీ కొత్త, పాత కరెన్సీ నోట్లపై దొంగలు కన్నేసి, వాటిని అపహరించుకుపోతున్నారు.