మాకు కూడా ఆత్మహత్యలే గతి!
కర్నూలు : బంగారం వేలంపాటలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌పై బ్యాంక్ అధికారులు స్పందించారు. కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్బీఐ బ్యాంకు వద్ద సోమవారం రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. బ్యాంక్ అధికారులు బంగారు ఆభరణాల వేలాన్ని నిలిపివేయాలంటూ రైతులు బ్యాంక్‌ను ముట్టడించి నిరసనకు దిగటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ కూన రవి మాట్లాడుతూ రైతులు రుణాలు కట్టకపోవటంతో తమపైనా ఒతంతిళ్లు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని ఆయన అన్నారు. తప్పని పరిస్థితుల్లో బంగారాన్ని వేలం వేస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. రుణమాఫీ హామీ ఉంటుందన్న ఆశతో రైతులు ఎవరూ తాము తీసుకున్న రుణాలు తిరిగి కట్టకపోవటంతో తాము కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.