మాఫీ మాయే!
బకాయిల వసూలుకు బ్యాంకర్ల సన్నాహాలు
బంగారు రుణాలపై వేలం నోటీసుల జారీ
పంట రుణాల వసూలుకు సొసైటీ బృందాలు
లబోదిబోమంటున్న అన్నదాతలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ : రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. బకాయిల వసూలుకు బ్యాంకర్లు సన్నాహాలు చేస్తుండటమే దీనికి నిదర్శనం. రైతు సాధికార సంస్థ ద్వారా ఐదేళ్లలో దశలవారీగా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, ఐదేళ్ల పాటు వడ్డీ, అసలు బకాయిలు పేరుకుపోయి నష్టపోతారంటూ బ్యాంకర్లు వసూళ్లకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో రైతులు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు రూ.9,137 కోట్లు ఉండగా, రెండు వేల కోట్లకు మాత్రమే రుణమాఫీ వర్తించే విధంగా కుదించినట్లు సమాచారం. మిగిలినవారికి రుణమాఫీ వర్తించదని అధికారులు రికార్డులు తయారు చేసినట్లు తెలిసింది.
బంగారం రుణాలపై వేలం నోటీసులు...
సహకార బ్యాంకు సిబ్బంది పంట రుణాలను జబర్దస్తీగా వసూలు చేసేందుకు బృందాలు ఏర్పాటు చేసుకుంటుండగా, వాణిజ్య బ్యాంకులు బంగారం రుణాలకు సంబంధించి వేలం నోటీసులు జారీ చేస్తున్నాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు డివిజన్లలో సహకార అధికారులు 425 సహకార సంఘాల వేతన కార్యదర్శులు, సిబ్బందితో రుణ వసూళ్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రుణ మాఫీ ఆలస్యం అవుతున్నందున బకాయిల వసూలుకు వెంటనే రైతుల వద్దకు వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.
ఈ పరిస్థితిలో రుణాలు కట్టమంటే రైతులు తిరగబడి కొడతారని పలువురు సహకార సంస్థలలో పని చేసే కార్యదర్శులు అధికారుల వద్ద మొర పెట్టుకోగా.. అయినా తప్పదని, రుణమాఫీ వల్ల రెండు రకాలుగా నష్టపోతారని రెతులకు వివరించాలని సహకార ఉన్నతాధికారులు కార్యదర్శులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఐదేళ్లలోపు దశలవారీగా రుణమాఫీ చేస్తే మొత్తం బాకీ తీరేవరకు బ్యాంకుల్లో ఉన్న బంగారం విడుదల కాదని వివరించాలని చెప్పినట్లు తెలిసింది.
పంట రుణాలకు సంబంధించి సహకార సంస్థల్లో 11 శాతం వడ్డీ పడుతుందని రైతులకు వివరించాలని, ఏదో విధంగా వారికి నచ్చచెప్పి ముందుగా బాకీలు వసూలు చేయాలని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తూ ఇచ్చే డబ్బు బ్యాంకులకు వచ్చింది వచ్చినట్లుగా రైతుల ఖాతాల్లో పడుతుందని చెప్పి.. బకాయిలు వసూలు చేసుకునేందుకు వాణిజ్య, సహకార బ్యాంకులు మందస్తు ప్రణాళిక సిద్ధం చేశాయి.
బంగారం వేలానికి ఆర్బీఐ సూచన!
15 నెలలు దాటిన బంగారు రుణాలకు సంబంధించి నగలను వెంటనే వేలం వేసి బకాయికి జమ చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్లకు సూచించినట్లు సమాచారం. ఒకవైపు బంగారం ధర రోజురోజుకు తగ్గటం బ్యాంకర్లను కలవరానికి గురిచేస్తోంది. తాము రుణం ఇచ్చేటప్పుడు గ్రాము రూ.4 వేలు వరకు ఉందని, అది ప్రస్తుతం రూ.2,600కు పడిపోయిందని ఓ బ్యాంకు అధికారి చెప్పారు. బంగారం ధర మరింత తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళనతో బ్యాంకర్లు జిల్లా వ్యాప్తంగా బంగారు రుణాలు తీసుకున్న రైతులందరికీ వేలం నోటీసులు ఇస్తున్నారు.
ఒక వేళ ప్రభుత్వం రుణమాఫీ డబ్బు ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో జమపడుతుందని, ముందు తమ బాకీ చెల్లించి బంగారం విడిపించుకు వెళ్లమని వాణిజ్య బ్యాంకుల మేనేజర్లు రైతులకు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం 15 నెలలు దాటిన బంగారం రుణం వసూలు చేయాల్సి ఉందని లేదా వేలం వేయాల్సిందేనని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణమాఫీ జరగాలంటే ఐదేళ్లు పడుతుందని, అప్పటివరకు బంగారం ఎలా బ్యాంకులో ఉంచుకుంటారని బ్యాంకర్లు ప్రశ్నిస్తున్నారు.
తడిసిమోపెడవుతున్న బకాయిలు
రైతు సాధికార సంస్థ ద్వారా రుణమాఫీ జరిగే సమయానికి రైతులపై వడ్డీ భారం పడనుంది. రుణమాఫీ ఆశ లేకుంటే జీరో శాతం వడ్డీపై రుణాలు చెల్లించేవారు. పంట రుణాలు వాయిదా మీరటంతో సహకార బ్యాంకులకు 11 శాతం వడ్డీ భరించాల్సి వస్తుందని బ్యాంకర్లు రైతులకు చెబుతున్నారు. ఐదేళ్ల వరకు బకాయి కట్టకపోతే సగానికి సగం వడ్డీ అప్పు పెరుగుతుందని రైతులకు వివరిస్తున్నారు.
రైతుల్లో ఆందోళన
వాణిజ్య బ్యాంకులు నోటీసులు జారీ చేయటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకపక్క చంద్రబాబు బకాయిలు, వడ్డీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటనలు చేస్తుంటే.. మరోపక్క బ్యాంకర్లు నోటీసులు ఇస్తుండటం వారిని దిక్కుతోచని స్థితిలోకి నెడుతోంది.