Banking facilities
-
బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరించాలి
ముంబై: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు చాలాకాలంగా ప్రత్యేక కృషి జరుగుతున్నా ఇప్పటికీ బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేని జిల్లాలు దేశంలో చాలా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. భారీ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు జరిగే కొన్ని ప్రాంతాల్లో సైతం బ్యాంకింగ్ సరీ్వసులు లభించకపోతుండటం ఆశ్చర్యకరమని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సర్వీసులను మరింతగా విస్తరించేందుకు అన్ని బ్యాంకులు నడుం బిగించాలని మంత్రి సూచించారు. ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయి శాఖలనో లేదా కనీస సరీ్వసులైనా అందించే అవుట్పోస్ట్లనో ఏర్పాటు చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) 74వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) ఆమె పేర్కొన్నారు. ‘‘నేటికీ పలు జిల్లాల్లో పెద్ద పంచాయతీల్లో కూడా బ్యాంకు శాఖ అనేది ఉండటం లేదు. ఇకనైనా ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉంటున్న ప్రాంతాలను గుర్తించడంపై దృష్టి పెట్టాలి. గ్రామీణ ప్రాంతమే కావచ్చు ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లో ఎంతో కొంతైనా బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండాలి కదా’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. బ్యాడ్ బ్యాంక్ అని పిలవొద్దు.. మొండిబాకీల పరిష్కారానికి ఉద్దేశించిన నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్)ను ‘బ్యాడ్ బ్యాంక్’గా పిలవొద్దని నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రస్తుతం బ్యాంకుల ఖాతాలు మరిం త మెరుగ్గా ఉన్నాయని, దీనితో వాటికి అదనంగా మూలధనం సమకూర్చాల్సిన అవసరం తగ్గుతుం దని, తద్వారా ప్రభుత్వంపైనా ఆ మేరకు భారం తగ్గుతుందని ఆమె తెలిపారు. అన్ని రకాల వ్యాపార సంస్థల అవసరాలను బ్యాంకులు గుర్తెరిగి, తగు రీతిలో సహాయాన్ని అందిస్తేనే 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతుల భారీ లక్ష్యాన్ని దేశం సాధించగలదని మంత్రి పేర్కొన్నారు. ఎస్బీఐ సైజు బ్యాంకులు నాలుగైదు ఉండాలి పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమ అవసరాలను తీర్చడానికి దేశీయంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ‘‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్థాయి’’ బ్యాంకులు 4–5 ఉండాలని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలికంగా డిజిటల్ ప్రక్రియలపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆమె తెలిపారు. కాబట్టి, స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా భారతీయ బ్యాంకింగ్ ఎలా ఉండాలన్నది పరిశ్రమ వర్గాలు నిర్దేశించుకుని, తగు రూపం ఇవ్వాలని మంత్రి సూచించారు. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ సజావుగా సాగేలా బ్యాంకర్లు కృషి చేశారని ప్రశంసించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలోనూ విధులు నిర్వర్తిస్తూ, మహమ్మారికి బలైన బ్యాంకింగ్ సిబ్బందికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రికి జ్ఞాపికను బహూకరిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ రాజ్‌కిరణ్ -
బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా దేశీ బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ లావాదేవీలలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో పలువురు నిపుణులు ఈ అంశాలపై దృష్టి సారించారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) డిజిటల్ లావాదేవీలకు ఇటీవల అంతరాయాలు ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో తాత్కాలిక ప్రాతిపదికన కొత్త క్రెడిట్ కార్డుల జారీని నిలిపివేయమంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది కూడా. గత రెండేళ్లలో మూడుసార్లు డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలలో కస్టమర్లకు సమస్యలు ఎదురుకావడంతో ఆర్బీఐ ఆంక్షలు విధించింది. సాంకేతిక సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టమంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సూచించింది. ఇక మరోపక్క ఇటీవల ఎస్బీఐ డిజిటల్ విభాగం యోనో యాప్‌లోనూ రెండు రోజులపాటు సమస్యలు ఎదురయ్యాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎదురయ్యే డిజిటల్ సమస్యలకు ప్రధానంగా నాలుగు అంశాలు కారణంకావచ్చునంటూ సాంకేతిక నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. కోవిడ్-19 ఎఫెక్ట్ కొద్ది నెలల క్రితం కరోనా వైరస్ తలెత్తిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డవున్‌లకు తెరలేచింది. దీంతో ఇటీవల వేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ లావాదేవీలు మరింత జోరందుకున్నాయి. లాక్‌డవున్ ప్రభావంతో సీనియర్ సిటిజన్లు సైతం డిజిటల్ లావాదేవీలవైపు మొగ్గు చూపినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా బ్యాంకుల ఆన్లైన్ లావాదేవీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉదాహరణకు రోజుకి 10 లక్షల లావాదేవీలు నమోదయ్యే కొన్ని బ్యాంకులలో గత నెలలో ఈ సంఖ్య 13 లక్షలకు చేరినట్లు ఇండస్వన్ బిజినెస్ సొల్యూషన్స్ డైరెక్టర్ శరత్ వర్ఘీస్ పేర్కొన్నారు. స్వల్ప కాలంలో పెరిగిన ఈ డిజిటల్ ట్రాఫిక్‌ను బ్యాంకులు అంచనా వేయలేకపోయి ఉండవచ్చునంటున్నారు పరీఖ్ కన్సల్టింగ్ నిపుణులు పరీఖ్ జైన్. అదనపు సర్వర్లు కోవిడ్-19 కారనంగా ఉన్నట్టుండి పెరిగిన ఆన్లైన్ ట్రాఫిక్‌ను తట్టుకునేందుకు బ్యాంకులు అదనపు సర్వర్లను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. సుమారు రెండు గంటల సమయంలో ఇందుకు వీలున్నప్పటికీ ఇతర సమస్యలుంటాయి. అయితే సర్వర్ల ఏర్పాటు అవసరం, ఇందుకు అనుమతులు, ఆదేశాల వంటి ప్రాసెస్‌కు నెల రోజులవరకూ సమయం పట్టవచ్చునంటున్నారు శరత్. ఇలాంటి సమస్యలను బ్యాంకులు తప్పించుకోలేకపోవచ్చు. సర్వర్ల నిర్వహణ బ్యాంకులకు సంబంధించిన డేటాను నిల్వ(స్టోర్) చేసే సర్వర్లను థర్డ్ పార్టీ సంస్థలు నిర్వహిస్తుంటాయి. సర్వర్ల ఆధారంగానే రోజువారీ కార్యకలాపాలు జరుగుతుంటాయి. సాధారణంగా ఈ సర్వర్ల నిర్వహణ విషయంలో బ్యాంకులకు నియంత్రణలు ఉండవు. ఇటీవల బ్యాంకింగ్ రంగానికి ఎదురవుతున్న క్లిష్ట పరిస్ఙతుల నేపథ్యంలో వ్యయాల తగ్గింపుపై బ్యాంకులు దృష్టిపెట్టాయి. దీంతో సర్వర్ల సామర్థ్యం, నిర్వహణ వంటి అంశాల విషయంలో థర్డ్ పార్టీ సేవలు సైతం కొంతమేర సవాళ్లను ఎదుర్కొంటూ ఉండవచ్చు. సర్వర్లను పర్యవేక్షించే వారి సంఖ్య తగ్గడం, షిఫ్టుల వంటి సమస్యలు తలెత్తే అవకాశముందంటున్నారు శరత్. చదవండి: (5జీ టెక్నాలజీను వెంటనే అనుమతించండి) అనలిటిక్స్ కీలకం బ్యాంకులు బిజినెస్‌ను పెంచుకునేందుకు పలు కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఇదేవిధంగా పండుగల వంటి సీజన్లు వీటికి జత కలుస్తుంటాయి. అయితే పెరుగుతున్న కస్టమర్లు, డిజిటల్ లావాదేవీల వంటివి అంచనా వేసేందుకు బ్యాంకులు డేటా అనలిటిక్స్ వంటి టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. తద్వారా ఏ సమయంలో ట్రాఫిక్ పెరుగుతున్నదీ లేదా తగ్గుతున్నదీ వంటి అంశాలపై అంచనాలకు అవకాశముంటుంది. దీంతో సిబ్బంది, ఇతర వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునే ప్రణాళికలకు వీలుంటుందని బ్యాంకులకు సాంకేతిక సేవలు అందించే టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలియజేశారు. అయితే కొన్ని సందర్భాలలో ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అంచనాలు తప్పే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. దీంతో బ్యాంకులకు సమస్యలు ఎదురుకావచ్చని పేర్కొన్నారు. వేగంగా కొన్ని నివేదికల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రస్తుతం రోజువారీ 10 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటి విలువ రూ. 5 లక్షల కోట్లుగా అంచనా. డిజిటల్ లావాదేవీలలో ఇటీవల కనిపిస్తున్న స్పీడ్ ప్రకారం రానున్న ఐదేళ్లలో లావాదేవీలు 150 కోట్లకు చేరే అవకాశముంది. విలువలో రూ. 15 ట్రిలియన్లను తాకవచ్చని అంచనా. ఈ స్థాయిలో లావాదేవీలను నిర్వహించాలంటే.. బ్యాంకింగ్, ఐటీ మౌలిక సదుపాయాలను భారీగా పెంపొందించుకోవలసి ఉంటుంది. డేటా సెంటర్లు, క్లౌడ్ తదితర సేవలు, ఏఐ వంటి సౌకర్యాలను మెరుగుపరచుకోవలసి ఉంటుంది. తద్వారా లావాదేవీల నిర్వహణలో కస్టమర్లతోపాటు.. బ్యాంకులకూ భద్రత, ప్రమాణాలు, నిలకడ, అవసరానికి తగ్గ నిర్వహణకు వీలుంటుందని సాంకేతిక నిపుణులు వివరించారు. -
ప్రతి కుటుంబానికీ రెండు బ్యాంక్ అకౌంట్లు
- ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్రచారాన్ని ప్రారంభించనున్న ప్రధాని - బ్యాంకర్లతో భేటీలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) కేంద్రం చేపట్టనున్న ప్రచారోద్యమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. బ్యాంకులు అందుబాటులో లేని ఏడున్నర కోట్ల కుటుంబాలు కనీసం రెండేసి చొప్పున అకౌంట్లు తెరిచేలా చూడడం ఈ కార్యక్రమం ఉద్దేశం. దీంతోపాటు, అన్ని రకాల ఫోన్లలోనూ మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందించడానికి ప్రయత్నిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్రచార తేదీలను ప్రధాని ప్రకటిస్తారని వివరించారు. అవకాశమున్న ప్రాంతాల్లో బ్యాంకు బ్రాంచీలను ప్రారంభిస్తామనీ, అవకాశంలేని చోట్ల ఒకరిద్దరు సిబ్బంది ఉండే చిన్న శాఖలను ఏర్పాటు చేస్తామనీ తెలిపారు. చిన్న బ్రాంచీల కిందిస్థాయిలో కియోస్క్‌లు, వాటి తర్వాత స్థాయిలో ఏటీఎంలు ఉంటాయన్నారు. బిజినెస్ కరెస్పాండెంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 58-59 శాతం మందికి మాత్రమే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో మాత్రమే లభిస్తున్న మొబైల్ బ్యాంకింగ్‌ను అన్ని రకాల ఫోన్లకు విస్తరించడంపై పీఎస్‌యూ బ్యాంకుల అధినేతల సమావేశంలో జైట్లీ చర్చించారు. పీఎస్‌యూ బ్యాంకులు నవంబర్‌లో మార్కెట్లోకి..: ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకులు వచ్చే నవంబర్‌లో క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి జి.ఎస్.సంధు తెలిపారు. బాసెల్ 3 క్యాపిటల్ అడిక్వసీ ప్రమాణాల ప్రకారం వచ్చే ఐదేళ్లలో పీఎస్‌యూ బ్యాంకులు రూ.2.40 లక్షల కోట్లు సమీకరించుకోవాల్సి ఉందని చెప్పారు.