ప్రతి కుటుంబానికీ రెండు బ్యాంక్ అకౌంట్లు
- ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్రచారాన్ని ప్రారంభించనున్న ప్రధాని
- బ్యాంకర్లతో భేటీలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) కేంద్రం చేపట్టనున్న ప్రచారోద్యమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. బ్యాంకులు అందుబాటులో లేని ఏడున్నర కోట్ల కుటుంబాలు కనీసం రెండేసి చొప్పున అకౌంట్లు తెరిచేలా చూడడం ఈ కార్యక్రమం ఉద్దేశం. దీంతోపాటు, అన్ని రకాల ఫోన్లలోనూ మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందించడానికి ప్రయత్నిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.
గురువారం న్యూఢిల్లీలో ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్రచార తేదీలను ప్రధాని ప్రకటిస్తారని వివరించారు. అవకాశమున్న ప్రాంతాల్లో బ్యాంకు బ్రాంచీలను ప్రారంభిస్తామనీ, అవకాశంలేని చోట్ల ఒకరిద్దరు సిబ్బంది ఉండే చిన్న శాఖలను ఏర్పాటు చేస్తామనీ తెలిపారు. చిన్న బ్రాంచీల కిందిస్థాయిలో కియోస్క్‌లు, వాటి తర్వాత స్థాయిలో ఏటీఎంలు ఉంటాయన్నారు.
బిజినెస్ కరెస్పాండెంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 58-59 శాతం మందికి మాత్రమే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే లభిస్తున్న మొబైల్ బ్యాంకింగ్‌ను అన్ని రకాల ఫోన్లకు విస్తరించడంపై పీఎస్‌యూ బ్యాంకుల అధినేతల సమావేశంలో జైట్లీ చర్చించారు.
పీఎస్‌యూ బ్యాంకులు నవంబర్లో మార్కెట్లోకి..: ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకులు వచ్చే నవంబర్లో క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి జి.ఎస్.సంధు తెలిపారు. బాసెల్ 3 క్యాపిటల్ అడిక్వసీ ప్రమాణాల ప్రకారం వచ్చే ఐదేళ్లలో పీఎస్‌యూ బ్యాంకులు రూ.2.40 లక్షల కోట్లు సమీకరించుకోవాల్సి ఉందని చెప్పారు.