బ్యాంకింగ్‌: డిజిటల్‌ సేవల్లో సవాళ్లేంటి? | Banking digital services facing issues with servers, traffic | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌: డిజిటల్‌ సేవల్లో సవాళ్లేంటి?

Published Tue, Dec 8 2020 2:20 PM | Last Updated on Tue, Dec 8 2020 3:25 PM

Banking digital services facing issues with servers, traffic  - Sakshi

ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా దేశీ బ్యాంకింగ్‌ రంగంలో డిజిటల్‌ లావాదేవీలలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో పలువురు నిపుణులు ఈ అంశాలపై దృష్టి సారించారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ) డిజిటల్‌ లావాదేవీలకు ఇటీవల అంతరాయాలు ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో తాత్కాలిక ప్రాతిపదికన కొత్త క్రెడిట్‌ కార్డుల జారీని నిలిపివేయమంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది కూడా. గత రెండేళ్లలో మూడుసార్లు డిజిటల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలలో కస్టమర్లకు సమస్యలు ఎదురుకావడంతో ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. సాంకేతిక సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టమంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు సూచించింది. ఇక మరోపక్క ఇటీవల ఎస్‌బీఐ డిజిటల్‌ విభాగం యోనో యాప్‌లోనూ రెండు రోజులపాటు సమస్యలు ఎదురయ్యాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎదురయ్యే డిజిటల్‌ సమస్యలకు ప్రధానంగా నాలుగు అంశాలు కారణంకావచ్చునంటూ సాంకేతిక నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వివరాలు చూద్దాం..

కోవిడ్‌-19 ఎఫెక్ట్‌
కొద్ది నెలల క్రితం కరోనా వైరస్‌ తలెత్తిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డవున్‌లకు తెరలేచింది. దీంతో ఇటీవల వేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్‌ లావాదేవీలు మరింత జోరందుకున్నాయి. లాక్‌డవున్‌ ప్రభావంతో సీనియర్‌ సిటిజన్లు సైతం డిజిటల్‌ లావాదేవీలవైపు మొగ్గు చూపినట్లు బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా బ్యాంకుల ఆన్‌లైన్‌ లావాదేవీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉదాహరణకు రోజుకి 10 లక్షల లావాదేవీలు నమోదయ్యే కొన్ని బ్యాంకులలో గత నెలలో ఈ సంఖ్య 13 లక్షలకు చేరినట్లు ఇండస్‌వన్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌ శరత్‌ వర్ఘీస్‌ పేర్కొన్నారు. స్వల్ప కాలంలో పెరిగిన ఈ డిజిటల్‌ ట్రాఫిక్‌ను బ్యాంకులు అంచనా వేయలేకపోయి ఉండవచ్చునంటున్నారు పరీఖ్‌ కన్సల్టింగ్‌ నిపుణులు పరీఖ్‌ జైన్‌. 

అదనపు సర్వర్లు
కోవిడ్‌-19 కారనంగా ఉన్నట్టుండి పెరిగిన ఆన్‌లైన్‌ ట్రాఫిక్‌ను తట్టుకునేందుకు బ్యాంకులు అదనపు సర్వర్లను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. సుమారు రెండు గంటల సమయంలో ఇందుకు వీలున్నప్పటికీ ఇతర సమస్యలుంటాయి. అయితే సర్వర్ల ఏర్పాటు అవసరం, ఇందుకు అనుమతులు, ఆదేశాల వంటి ప్రాసెస్‌కు నెల రోజులవరకూ సమయం పట్టవచ్చునంటున్నారు శరత్‌. ఇలాంటి సమస్యలను బ్యాంకులు తప్పించుకోలేకపోవచ్చు.

సర్వర్ల నిర్వహణ
బ్యాంకులకు సంబంధించిన డేటాను నిల్వ(స్టోర్‌) చేసే సర్వర్లను థర్డ్‌ పార్టీ సంస్థలు నిర్వహిస్తుంటాయి. సర్వర్ల ఆధారంగానే రోజువారీ కార్యకలాపాలు జరుగుతుంటాయి. సాధారణంగా ఈ సర్వర్ల నిర్వహణ విషయంలో బ్యాంకులకు నియంత్రణలు ఉండవు. ఇటీవల బ్యాంకింగ్‌ రంగానికి ఎదురవుతున్న క్లిష్ట పరిస్ఙతుల నేపథ్యంలో వ్యయాల తగ్గింపుపై బ్యాంకులు దృష్టిపెట్టాయి. దీంతో సర్వర్ల సామర్థ్యం, నిర్వహణ వంటి అంశాల విషయంలో థర్డ్‌ పార్టీ సేవలు సైతం కొంతమేర సవాళ్లను ఎదుర్కొంటూ ఉండవచ్చు. సర్వర్లను పర్యవేక్షించే వారి సంఖ్య తగ్గడం, షిఫ్టుల వంటి సమస్యలు తలెత్తే అవకాశముందంటున్నారు శరత్‌. చదవండి: (5జీ టెక్నాలజీను వెంటనే అనుమతించండి)

అనలిటిక్స్‌ కీలకం
బ్యాంకులు బిజినెస్‌ను పెంచుకునేందుకు పలు కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఇదేవిధంగా పండుగల వంటి సీజన్లు వీటికి జత కలుస్తుంటాయి. అయితే పెరుగుతున్న కస్టమర్లు, డిజిటల్‌ లావాదేవీల వంటివి అంచనా వేసేందుకు బ్యాంకులు డేటా అనలిటిక్స్‌ వంటి టెక్నాలజీపై ఇన్వెస్ట్‌ చేయవలసి ఉంటుంది. తద్వారా ఏ సమయంలో ట్రాఫిక్‌ పెరుగుతున్నదీ లేదా తగ్గుతున్నదీ వంటి అంశాలపై అంచనాలకు అవకాశముంటుంది. దీంతో సిబ్బంది, ఇతర వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునే ప్రణాళికలకు వీలుంటుందని బ్యాంకులకు సాంకేతిక సేవలు అందించే టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలియజేశారు. అయితే కొన్ని సందర్భాలలో ఇంటెలిజెన్స్‌ సిస్టమ్స్‌ అంచనాలు తప్పే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. దీంతో బ్యాంకులకు సమస్యలు ఎదురుకావచ్చని పేర్కొన్నారు.

వేగంగా
కొన్ని నివేదికల ప్రకారం బ్యాంకింగ్‌ వ్యవస్థలో ప్రస్తుతం రోజువారీ 10 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటి విలువ రూ. 5 లక్షల కోట్లుగా అంచనా. డిజిటల్‌ లావాదేవీలలో ఇటీవల కనిపిస్తున్న స్పీడ్‌ ప్రకారం రానున్న ఐదేళ్లలో లావాదేవీలు 150 కోట్లకు చేరే అవకాశముంది. విలువలో రూ. 15 ట్రిలియన్లను తాకవచ్చని అంచనా. ఈ స్థాయిలో లావాదేవీలను నిర్వహించాలంటే.. బ్యాంకింగ్‌, ఐటీ మౌలిక సదుపాయాలను భారీగా పెంపొందించుకోవలసి ఉంటుంది. డేటా సెంటర్లు, క్లౌడ్‌ తదితర సేవలు, ఏఐ వంటి సౌకర్యాలను మెరుగుపరచుకోవలసి ఉంటుంది. తద్వారా లావాదేవీల నిర్వహణలో కస్టమర్లతోపాటు.. బ్యాంకులకూ భద్రత, ప్రమాణాలు, నిలకడ, అవసరానికి తగ్గ నిర్వహణకు వీలుంటుందని సాంకేతిక నిపుణులు వివరించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement