పునరుద్ధరుణం దిశగా..
జంగారెడ్డిగూడెం : పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో 15 రోజులపాటు పరిమితులకు లోబడి నగదు మార్పిడి, పాతనోట్ల డిపాజిట్లకు మాత్రమే పరిమితమైన బ్యాంకులు.. ఇకపై సాధారణ సేవలపైనా దృష్టి సారించబోతున్నాయి. రోజువారీ నిర్వహించే అన్నిరకాల లావాదేవీలను పునరుద్ధరించాలని బ్యాంకు లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో గురువారం నుంచి సాధారణ సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పాత నోట్లను నేరుగా బ్యాంకుల్లో ఇచ్చి చిల్లర నోట్లు తీసుకునే కార్యక్రమానికి శుక్రవారం నుంచి ఫుల్స్టాప్ పడుతోంది. ఎవరి వద్దనైనా పాతనోట్లు ఉంటే.. శుక్రవారం నుంచి వారి అకౌంట్లలో జమ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల నోట్లకోసం వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దృష్ట్యా గురువారం నుంచి పంట రుణాలు, బంగారాన్ని కుదువపెట్టుకుని ఇచ్చే రుణాలతోపాటు ఇతర కార్యాకలాపాలను యథావిధిగా చేపట్టనున్నారు. రుణాల వసూళ్లు, మొండి బకాయిల రికవరీ వంటి కార్యకలాపాలు సైతం మొదలు పెట్టాలని బ్యాంకులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.
రుణాల మంజూరుకు ప్రత్యేక ఏర్పాట్లు
బ్యాంకుల్లో 15 రోజులపాటు నిలిచిపోయిన రోజువారీ విధుల పునరుద్ధరణతో రుణాల మంజూరు, బకాయిల వసూళ్లపై బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. రబీ సీజన్ కు సంబంధించి రైతులకు పంట రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రుణం పొందిన రైతులు వారానికి రూ.50 వేల వరకు ఖాతా నుంచి విత్ డ్రా చేసుకోవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వ్యక్తుల ఖాతాలో ఉన్న నగదును డ్రా చేసుకునేందుకు వారానికి రూ.24వేలు పరిమితి అలానే ఉంది.
ప్రజల చెంతకు మొబైల్ ఏటీఎంలు
చిల్లర నోట్ల కొరతను తీర్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొబైల్ ఏటీఎంలను రంగంలోకి దింపింది. జిల్లాలో పలుచోట్ల మొబైల్ ఏటీఎంలు ప్రజల ముంగిటకు వెళ్లాయి. బ్యాంక్ సిబ్బంది వాహనాల్లో నగదు తీసుకెళ్లి క్యాష్ యాక్ట్ పోస్ మెషిన్ల ద్వారా ఖాతాదారులకు సొమ్ము పంపిణీ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు కలిగిన వారంతా రూ.2000 తీసుకునే అవకాశాన్ని కల్పించారు. వీటిద్వారా పూర్తిగా రూ.100 నోట్లు ఇస్తున్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా సేవలందిస్తాం
రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలందించేందుకు ఏర్పాట్లు చేశాం. బంగారంపై రుణాలతోపాటు రబీకి సంబంధించి పంట రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లు తెరిచాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోజువారీ సాధారణ సేవలను పునరుద్ధరించాం. బ్యాంకుల్లో చాలావరకు రద్దీ తగ్గింది. అన్ని ఏటీఎంలను పునరుద్ధరించాం. ఇకపై మా బ్యాంకులో అన్ని రకాల సేవలు పొందవచ్చు.
– కె.త్రినాథరావు, చీఫ్ మేనేజర్, ఆంధ్రాబ్యాంక్, జంగారెడ్డిగూడెం