‘నల్లధనం కాదని హామీ పత్రాలివ్వండి’
న్యూఢిల్లీ: ఓ పక్క ప్రభుత్వ ఒత్తిడి, మరోపక్క చెడ్డపేరు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఉన్న స్విట్జర్లాండ్ బ్యాంకులు దానికి తగ్గ చర్యలు చేపట్టాయి. తమ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము.. పన్ను ఎగవేతకు సంబంధించినది కాదంటూ తాజాగా హామీ పత్రాలు ఇవ్వాలని భారత ఖాతాదారులను కోరాయి. ఆడిటర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని వ్యక్తిగత, కార్పొరేట్ ఖాతాదారులను కోరుతున్నాయి.
విదేశాల్లోని నల్లధనాన్ని తెప్పించే చర్యలను భారత్ వేగవంతం చేయడం, దానికి స్విస్ ప్రభుత్వం సహకరిస్తామని చెప్పిన నేపథ్యంలో బ్యాంకులు ఈ చర్యకు ఉపక్రమించాయి. కాగా, నల్లధన ఖాతాలను ఎందుకు వెల్లడించడంలేదో చెప్పాలంటూ హెచ్ఎస్బీసీకి భారత అధికారులు షోకాజ్ నోటీస్ కూడా పంపినట్లు సమాచారం.