దగా... దగా..
కేసీఆర్‌పై విపక్షాల కన్నెర్ర
రైతాంగ రుణ మాఫీ హామీపై కేసీఆర్ మాట తప్పారంటూ విపక్షాలు, రైతు సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ‘ఎన్నికలకు ముందేమో.. రైతాంగ రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. తీరా గద్దెనెక్కాక.. కేవలం 2013-14 సంవత్సరానికి మాత్రమే రుణాలను రద్దు చేస్తామంటున్నారు. ఇది పచ్చి దగా. రైతులను ప్రభుత్వం మోసగిస్తోంది’ అని, విపక్షాలు.. రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
హామీ నెరవేర్చాలి
వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్
కారేపల్లి, న్యూస్‌లైన్: రైతులకు బ్యాంకుల్లో లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చాలని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 2013-14 సంవత్సరంలో రైతులు తీసుకున్న లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామనడం సరికాదని, ఇది కేవలం కంటి తుడుపు మాత్రమేనని అన్నారు. సీఎం ప్రకటనతో రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని అన్నారు.
‘‘వైఎస్సార్ మరణాంతరం అధికారంలోకి వచ్చిన పాలకులు రైతు వ్యతిరేక విధానాలు అవలవంబించారు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఈ తరుణంలో.. కేసీఆర్ ప్రకటించిన రుణ మాఫీ పథకంతో కొంతైనా ఉపశమనం కలుగుతుందని రైతులు భావించారు. కానీ, తాజాగా కేసీఆర్ చేసిన అర్థరహిత ప్రకటనలతో రైతుల్లో అయోమయం, ఆందోళన నెలకొంది. రైతులు ఈ ఏడాది పంట రుణాల కోసం బ్యాంకు మెట్లు ఎక్కే పరిస్థితి కనబడటం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ లోవిత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు.
బేషరతుగా అమలుచేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్
కూసుమంచి, న్యూస్‌లైన్: రైతుల లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామంటూ ఎన్నికలకు ఇచ్చిన హామీని కేసీఆర్ బేషరతుగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. కూసుమంచిలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో కష్ట, నష్టాలతో వ్యవసాయం చేస్తున్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నూతన ప్రభుత్వంపై ఉందన్నారు. తుపానులు, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, వారు కోలుకునేలా పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘‘తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామంటూ టీఆర్ఎస్ ఇచ్చిన హామీని రైతాంగం నమ్మింది. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక.. కొద్దిమంది రైతుల రుణాలను మాత్రమే మాఫీ చేస్తామంటోంది. ఇది సహేతుకంగా లేదు’’ అన్నారు. ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడాలని, రైతుల లక్ష లోపు రుణాలను బేషరతుగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నందున బ్యాంక్ రుణాలు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఖరీఫ్ ప్రశ్నార్థకం తెలంగాణ రైతు సంఘం రాష్ర్ట నాయకుడు జమ్ముల జితేందర్ రెడ్డి
ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్: రైతాంగ రుణ మాఫీపై షరతులు విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ పునఃసమీక్షించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు జమ్ముల జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారం ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సంఘం సమావేశంలో మాట్లాడుతూ.. వ్యవసాయంపై దశాబ్ద కాలంగా పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో రైతాంగం అప్పుల్లో కూరుకుపోయిందని, వాటిని చెల్లించలేని దయనీయ స్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఒకవైపు బ్యాంకు రుణాలు, మరోవైపు ప్రైవేట్ అప్పులు దొరకని గడ్డు పరిస్థితుల్లో అనేకమంది రైతులు బంగారాన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వమేమో.. బంగారంపై రుణాలు, పాత అప్పులు, 2013 సంవత్సరానికి ముందున్న రుణాల మాఫీ ఉండదని చెప్పడం దారుణం’’ అని అన్నారు. లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా రద్దు చేయాలని, విత్తనాలను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తమ సంఘం ఆందోళన చేపడుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆంక్షలు సరికాదు
నాగులవంచ (చింతకాని), న్యూస్‌లైన్: రైతుల లక్ష రూపాయల లోపు బ్యాంక్ రుణాలను మాఫీ చేస్తామంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని బేషరతుగా అమలు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండ బాల కోటేశ్వరరావు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన నాగులవంచ గ్రామంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బ్యాంకుల్లో రెతులకున్న లక్ష రూపాయల లోపు రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ఆంక్షలు విధించటం సరికాదని అన్నారు.
విశ్వాసాన్ని కోల్పోతారు
ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్: రైతాంగ రుణ మాఫీపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని కేసీఆర్ విస్మరిస్తే.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రుణ మాఫీ హామీని బేషరతుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ రుణాల మాఫీపై ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారంగా జిల్లాలో కేవలం ఐదు శాతం రుణాలు మాత్రమే రద్దవుతాయని, మిగిలిని వారి పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రుణ మాఫీ హామీని అమలుచేయాలని డిమాండ్ చేశారు.
మాట తప్పుతోంది
కోయచెలక (ఖమ్మం అర్బన్), న్యూస్‌లైన్: రైతుల రుణ మాఫీపై కేసీఆర్ ప్రభుత్వం మాట తప్పుతోందని తె లుగు రైతు జిల్లా అధ్యక్షుడు మందడపు సుధాకర్ విమర్శించారు. ఆయన గురువారం కోయచెలకలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘రైతులు అప్పులు చెల్లించొద్దు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తుందని ప్రచారం చేసి గద్దెనెక్కిన కేసీఆర్.. ఇపుడు మాట తప్పుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్‌ను నమ్మిన రైతులు ఇన్నాళ్లూ అప్పులు చెల్లించలేదు. ఈ కారణంగా వడ్డీ పెరిగింది. వారి పరిస్థితేమిటి...?’’ అని ప్రశ్నించారు.
అన్యాయం చేయొద్దు
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: రైతు రుణ మాఫీని 2013 జూన్ నుంచి 2014 మధ్య కాలానికి మాత్రమే వర్తింపచేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడాన్ని జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జీలు అయితం సత్యం, శ్రీనివాస్‌రెడ్డి, శీలంశెట్టి వీరభద్రం ఒక ప్రకటనలో తప్పుబట్టారు. రైతులకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులకు ఇచ్చిన హామీపై మాట మార్చడం తగదని పేర్కొన్నారు. కాలపరిమితి, షరతులు లేకుండా రైతు రుణ మాఫీ హామీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దారుణంగా మోసగించింది
ఖమ్మం వైరా రోడ్, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చీరావడంతోనే రుణ మాఫీపై ఎన్నికల హామీని తుంగలో తొక్కి రైతులను దారుణంగా మోసగించిందని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా చైర్మన్ మొక్క శేఖర్ గౌడ్ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు రైతుల అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని, రైతులెవ్వరూ బ్యాంక్ అప్పులు చెల్లించొద్దని చెప్పిన కేసీఆర్.. తీరా ఇప్పుడు అనేక రకాల షరతులతో మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. రైతుల రుణ మాఫీ హామీని బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాలపరిమితి వద్దు
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: రైతాంగ రుణ మాఫీపై కాలపరిమితి విధించవద్దని తెలుగు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి పుల్లయ్య డిమాండ్ చేశారు. ఆయన గురువారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘రైతుల రుణ మాఫీపై టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో ఎక్కడా కాలపరిమితి లేదు. ఇప్పుడు మాత్రం కాలపరిమితి, షరతులు విధిస్తోంది. ఇది సరికాదు’’ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వస్తుందని, రుణాలు రద్దవుతాయని రైతులంతా ఇన్నాళ్లూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిపై కేసీఆర్ ఒక్కసారిగా నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రుణాలను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.