Banzarahills
-
నేను ‘గే’ అని అమ్మ అన్నం పెట్టడంలేదు
సాక్షి,హైదరాబాద్ : సమాజంలో తమను కూడా మనుషులుగా గుర్తించాలని తమ హక్కులను కూడా కాపాడాలని పలువురు స్వలింగ సంపర్కులు డిమాండ్ చేశారు. ప్రపంచంలో ప్రతి ఏడాది జూన్‌లో స్వలింగ సంపర్కుల హక్కుల పోరాట మాసాన్ని నిర్వహిస్తుంటారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో లెస్బియన్లు, ట్రాన్స్జెండర్లు, గే లు, బై సెక్సువల్(ఎల్జీబీటీ) సమావేశమయ్యారు. ప్రైడ్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర నలుమూలల నుంచి వచ్చిన 200 మంది ఎల్జీబీటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ హక్కులను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా తమ కుటుంబంలోనే తమను వెలివేస్తున్నారంటూ వీరు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల్లో తమను సూటిపోటి మాటలతో వేదిస్తున్నారని ఓ యువకుడు ఆరోపించాడు. తాను ‘గే’ నని తెలుసుకొని తన తల్లి వారం రోజులు అన్నం పెట్టకుండా మాడ్చారని, ఓ రూమ్‌లో వేసి బంధించారని ఇదెక్కడి అన్యాయమని ఇంకో యువకుడు ఆందోళన చెందాడు. తనలో వచ్చిన మార్పులను గమనించి తన తండ్రి తీవ్రంగా కొట్టి ఇంట్లో నుంచి తరిమేశాడని, ఏం పాపం చేశానని తాను ఇప్పుడు రోడ్డునపడాల్సి వచ్చిందని ఆరోపించారు. ఇలా ఒక్కొక్కరు తమ సమస్యలపై గొంతు విప్పారు. తమకు కూడా గుర్తింపు కావాలని వీరంతా డిమాండ్ చేశారు. -
బంజారాహిల్స్‌లో ఘోరం
► కదులుతున్న కారుపై పడ్డ మరో కారు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి ► మద్యం మత్తులో కారు నడిపిన బీటెక్ విద్యార్థులు హైదరాబాద్: మద్యంమత్తులో కారు నడిపిన యువకుల నిర్లక్ష్యం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణం బలితీసుకుంది. చిన్నారిసహా మరి కొందరిని ఆసుపత్రి పాలు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నం.3లోని హిందూ శ్మశానవాటిక వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘోరం జరి గింది. మాదాపూర్‌లో నివసించే సాఫ్ట్వేర్ ఇంజనీరు పమ్మి రాజేశ్(38) హైదర్‌గూడ సెయింట్‌పాల్స్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న తన అన్న కుమార్తె రమ్య(8)ను తీసుకుని శాంత్రో కారులో బయలుదేరారు. కారులో వీరితోపాటు రాజేశ్ మరో సోదరుడు రమేశ్, వదిన రాధిక, తండ్రి మధుసూదన్‌రావు కూడా ఉన్నారు. వీరంతా చిన్నారిని బోరబండలోని ఆమె ఇంట్లో విడిచిపెట్టేందుకు పంజగుట్ట ఫ్లైఓవర్ పైనుంచి బంజారాహిల్స్ వైపు వస్తున్నారు. అదే సమయంలో ముఫకంజా కాలేజీ వైపు నుంచి ఫూటుగా మద్యం సేవించి వేగంగా వస్తున్న ఆరుగురు విద్యార్థుల ఐ10 కారు శ్మశానవాటిక వద్ద అదుపు తప్పిం ది. పంజగుట్ట వైపు వెళుతున్న ఆ కారు డివైడర్‌ను ఢీకొట్టి, పల్టీలు కొట్టి ఫ్లైఓవర్ పైనుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల పత్రిక కార్యాల యం రోడ్డు వైపునకు వెళుతున్న రాజేష్ కారుపై పడింది. కారు నడుపుతున్న రాజేశ్ అక్కడికక్కడే మృతిచెందగా, అందులో ఉన్న రమ్య, అతని అన్న, వదిన, తండ్రి తీవ్ర గాయాలపాలయ్యారు. రెండు కార్లూ నుజ్జునుజ్జయ్యాయి. చిన్నారిని నిమ్స్‌కు, మిగిలినవారిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులో ఎన్.సూర్య, విష్ణు, షవెల్, అశ్విన్, సాయి రమేశ్, అలెన్ జోసెఫ్ ఉన్నారు. కారు నడుపుతున్న షవెల్తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరంతా నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. బంజారాహిల్స్ సినీమ్యాక్స్‌లో సినిమా చూసి, అనంతరం విందు ముగించుకుని ఒకే కారులో వెళుతున్నారు. అందరూ హిమాయత్‌నగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్నారని పోలీసులు వెల్లడిం చారు. కేసు నమోదు చేశామన్నారు. -
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ...
బంజారాహిల్స్ (హైదరాబాద్) : తన మనోభావాలు, ఇష్టాలను పట్టించుకోకుండా నచ్చని వ్యక్తితో తనకు పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తండ్రి, సోదరుడిపై ఓ యువతి బంజారాహిల్స్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.10లో నివసించే రెహ్మా రీమా(24) ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. తండ్రి, సోదరుడు కలసి ఇటీవలే ఆమెకు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. 35 సంవత్సరాల వయసున్న వ్యక్తితో పెళ్లి కుదర్చడమే కాకుండా, ఆ వ్యక్తిని కనీసం తనకు చూపించలేదని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. నిశ్చయించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ వాపోయింది. పెళ్లి తర్వాత తాను ఉద్యోగం చేయాలనుకుంటున్నానని, అందుకు తన తండ్రితో పాటు, వాళ్లు నిశ్చయించిన వ్యక్తి కూడా అంగీకరించడం లేదని ఆమె పేర్కొంది. తనను హౌస్ అరెస్ట్ చేశారని, స్నేహితులతో కూడా మాట్లాడనివ్వడం లేదని ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు బాధితురాలు తండ్రి, సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 341, 506ల కింద కేసు నమోదు చేశారు.