బంజారాహిల్స్‌లో ఘోరం
► కదులుతున్న కారుపై పడ్డ మరో కారు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
► మద్యం మత్తులో కారు నడిపిన బీటెక్ విద్యార్థులు
హైదరాబాద్: మద్యంమత్తులో కారు నడిపిన యువకుల నిర్లక్ష్యం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణం బలితీసుకుంది. చిన్నారిసహా మరి కొందరిని ఆసుపత్రి పాలు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నం.3లోని హిందూ శ్మశానవాటిక వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘోరం జరి గింది. మాదాపూర్‌లో నివసించే సాఫ్ట్‌వేర్ ఇంజనీరు పమ్మి రాజేశ్(38) హైదర్‌గూడ సెయింట్‌పాల్స్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న తన అన్న కుమార్తె రమ్య(8)ను తీసుకుని శాంత్రో కారులో బయలుదేరారు. కారులో వీరితోపాటు రాజేశ్ మరో సోదరుడు రమేశ్, వదిన రాధిక, తండ్రి మధుసూదన్‌రావు కూడా ఉన్నారు. వీరంతా చిన్నారిని బోరబండలోని ఆమె ఇంట్లో విడిచిపెట్టేందుకు పంజగుట్ట ఫ్లైఓవర్ పైనుంచి బంజారాహిల్స్ వైపు వస్తున్నారు.
అదే సమయంలో ముఫకంజా కాలేజీ వైపు నుంచి ఫూటుగా మద్యం సేవించి వేగంగా వస్తున్న ఆరుగురు విద్యార్థుల ఐ10 కారు శ్మశానవాటిక వద్ద అదుపు తప్పిం ది. పంజగుట్ట వైపు వెళుతున్న ఆ కారు డివైడర్‌ను ఢీకొట్టి, పల్టీలు కొట్టి ఫ్లైఓవర్ పైనుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల పత్రిక కార్యాల యం రోడ్డు వైపునకు వెళుతున్న రాజేష్ కారుపై పడింది. కారు నడుపుతున్న రాజేశ్ అక్కడికక్కడే మృతిచెందగా, అందులో ఉన్న రమ్య, అతని అన్న, వదిన, తండ్రి తీవ్ర గాయాలపాలయ్యారు. రెండు కార్లూ నుజ్జునుజ్జయ్యాయి. చిన్నారిని నిమ్స్‌కు, మిగిలినవారిని అపోలో ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన కారులో ఎన్.సూర్య, విష్ణు, షవెల్, అశ్విన్, సాయి రమేశ్, అలెన్ జోసెఫ్ ఉన్నారు. కారు నడుపుతున్న షవెల్‌తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరంతా నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. బంజారాహిల్స్ సినీమ్యాక్స్‌లో సినిమా చూసి, అనంతరం విందు ముగించుకుని ఒకే కారులో వెళుతున్నారు. అందరూ హిమాయత్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్నారని పోలీసులు వెల్లడిం చారు. కేసు నమోదు చేశామన్నారు.