ఆ పోరాటం వల్లే రైతులకు రుణమాఫీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు కనీసం రూ. 10 వేల కోట్ల రుణమాఫీ అయినా జరిగిందంటే.. అది కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పోరాటం వల్లేనని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో జరిగిన పార్టీ బహిరంగ సభలో ధర్మానతో పాటు వై. విశ్వేశ్వరరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితర నేతలు పాల్గొని ప్రసంగించారు.
టీడీపీ అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రంలో ప్రతి కుటుంబం వైఎస్ పాలన కావాలని కోరుకుంటున్నారని ధర్మాన అన్నారు. ఈ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేయడానికి బదులు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేస్తే.. ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలు నెరవర్చలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాపట్ల తహసిల్దారుకు వైఎస్ఆర్సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు.