100 మీటర్ల లోపు ‘నిబంధన’ సడలించాలి
తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ లెసైన్స్ అసోసియేషన్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై 100 మీటర్ల లోపు బార్లు ఉండకూడదనే నిబంధనను సడలించాలని తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ లెసైన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.మనోహర్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ.. బార్ అండ్ రెస్టారెంట్ల కు ప్రభుత్వం 180 ఎంఎల్ 375 ఎంఎల్ మద్యం సీసాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నెలకు ఐదుసార్లు మాత్రమే బార్లకు మద్యాన్ని సరఫరా చేస్తోందని.. ఈ నిబంధనను ఎత్తివేసి అమ్మగలిగినంత మేర మద్యాన్ని సరఫరా చేయాలని కోరారు. అదేవిధంగా మద్యం బాటిళ్లపై స్పెషల్ మార్జిన్‌ను ఎత్తివేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
రాత్రి 12 గంటల వరకూ బార్ లను నిర్వహించుకునేందుకు సమయాన్ని పొడిగించడం పట్ల తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ లెసైన్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు జి.విజయ్ కుమార్ గౌడ్, వెంకంటేష్ గౌడ్, సాయిరాజ్ గౌడ్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. తిరుపతి రెడ్డి, నాయకులు కె. శంకర్, డి. శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉడుతల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.