బారామతి రైతు భగ్గు
పింప్రి, న్యూస్‌లైన్: వడగండ్ల వానల వల్ల నష్టపోయిన తమను ఏ పార్టీ లేదా ప్రభుత్వమూ పట్టించుకోకపోవడంపై బారామతి రైతులు మండిపడుతున్నారు. ఇటువంటి నాయకులవల్ల ఒరిగేదేమీ లేదని భావించిన వీరంతా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని యోచిస్తున్నారు. కాగా దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన బారామతి పార్లమెంటు నియోజక వర్గంలో 1967వ సంవత్సరం నుంచి శరద్ పవార్‌కు పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టింది. బారామతి నియోజకవర్గం ఓటర్లు 1967 నుంచి లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో శరద్ పవార్, అజిత్ పవార్, సుప్రియా సూలేలకు పట్టం కడుతూ వస్తున్నారు.
నియోజక వర్గంలోని ఇతర తాలూకాలతో పోల్చితే బారామతి తాలూకా బాగా అభివృద్ధి చెందింది. ఈ తాలూకాలో టెక్స్టైల్, ఆటోమొబైల్ రంగాలతోపాటు సహకార సంస్థలు, చక్కెర కర్మాగారాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, బైపాస్ మార్గాలు... ఇలా అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ఈ నేపథ ్యంలో ఓటర్లు ఇక్కడినుంచి బరిలోకి దిగిన శరద్‌పవార్ లేదా ఇతర కుటుంబసభ్యులను ఆదరిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో పరిస్థితుల్లో కొంతమార్పు గోచరిస్తోంది. ఇటీవల వడగండ్ల వానలు పడడంతో రైతాంగం భారీగా నష్టపోయింది. అయినప్పటికీ వారికి ఇప్పటిదాకా పరిహారం అందనేలేదు. దీంతో ఈసారి ఈ నియోజవర్గం నుంచి బరిలోకి దిగిన సుప్రియాసూలే గెలుపు నల్లేరుపై నడక కాకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు తాగు నీటి సమస్య కూడా తీవ్రస్థాయిలో ఉంది. దీంతో ఇక్కడి ప్రజలు ఈ విషయమై రాజకీయ నాయకులను నిలదీస్తున్నారు.
తాలూకాలోని 22 గ్రామాలకు చెందిన ప్రజలు తాగునీటి కోసం నిరాహారదీక్షలు, ఆందోళనలు కూడా చేశారు. అయినప్పటికీ ఏ రాజకీయ పార్టీగానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వంగానీ ఈ సమస్యకు తగు పరిష్కార మార్గం చూపడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఈ ఎన్నికలపై అంత ఆసక్తి చూపడం లేదు. ఇదిలా వుండగా తాలూకాలో అనేక సహకార సంస్థలున్నాయి. అయితే చెరకు పండించే రైతుకు గిట్టుబాటు ధర కలగానే మిగిలిపోయింది. దీంతో గిట్టుబాటు ధరకోసం పలు రైతు సంఘాలు భారీ ఆందోళనలకు దిగాయి. అయినప్పటికీ ఎటువంటి ఫలితమూ దక్కలేదు. దీంతో స్థానిక చెరకు రైతులు... ఎన్నికలు, రాజకీయ నాయకులంటేనే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఓటెయ్యకూడదనే యోచనలో ఉన్నారు. ఇంకా పెరిగిన ధరలు, అవినీతి తదితరాలు కూడా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ నాయకులకు భారీగా స్వాగతం పలుకుతుండగా ఇప్పుడు పట్టించుకునేవారే కరువవుతున్నారు.