పట్టుబడ్డ 44 మంది లష్కరే ముష్కరులేనా?
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా పట్టణంలో ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మొదటిసారి పెద్ద ఎత్తున కార్డెన్ సెర్చ్ నిర్వహించింది. గంటలపాటు సాగిన ఈ దాడుల్లో పలు ఇండ్ల నుంచి పెద్ద ఎత్తున పెట్రోల్ బాంబులు, పాకిస్థాన్, చైనా జాతీయ జెండాలు లభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు 44 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. కాగా, ప్రస్తుతం ఆ యువకులను విచారిస్తోన్న బారాముల్లా పోలీసులకు పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా హెచ్చరికలు జారీచేసింది. ప్రతీకారం తప్పదని ఉగ్రవాదులు బెదిరించే ప్రయత్నం చేసినట్లు బారాముల్లా పోలీసులు మీడియాకు తెలిపారు.
బారాముల్లా చరిత్రలోనే మొదటిసారిగా సోమవారం రాత్రి భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఖ్వాజీ హమన, గనాయి హమన్, తవీద్ గంజ్, జామియా సహా 10 కీలకమైన ప్రాంతాల్లో ప్రతి ఇంటినీ జల్లెడపట్టాయి. దాదాపు 700 ఇళ్లల్లో సోదాలు చేశామని, పెట్రోల్ బాంబులు, పాక్, చైనా జెండాలు స్వాధీనం చేసుకున్నామని, 44 మందిని అదుపులోకి తీసుకున్నామని రక్షణ శాఖ అధికార ప్రతినిధి మనీశ్ కుమార్ చెప్పారు. పెల్లెట్ దెబ్బలు తిన్న ఆందోళనకారులను కూడా పరామర్శించినట్లు చెప్పారు. లష్కరే హెచ్చరికల నేపథ్యంలో 44 మంది యువకులను విచారిస్తున్న ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ యువకులు నిజంగా ఉగ్రవాదులేనా? లేక సాధారణ పౌరులా అన్నది తెలియాల్సిఉంది.