హిల్లరీకి ఊహించని వ్యక్తి మద్దతు
న్యూయార్క్: డెమోక్రటిక్ పార్టీలో పుట్టి, పెరిగి, భర్తను అధ్యక్షుడిగా గెలిపించుకుని, తర్వాతి కాలంలో కీలక పదవులు చేపట్టి.. ప్రస్తుతం అదే పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతోన్న హిల్లరీ క్లింటన్‌కు.. ఎంతో ఘనమైన రాజకీయ చరిత్ర గల కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మద్దతు పలకడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ వ్యక్తి మరెవరోకాదు.. ఫొటోలో మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ పక్కన కూర్చుందే.. ఆయన కూతురు బార్బరా పియర్స్ బుష్!
ముత్తాతల కాలం నుంచి గ్రాండ్ ఓల్డ్ పార్టీ(జీఓపీ లేదా రిపబ్లికన్)లో కొనసాగుతూ, అదే పార్టీ నుంచి రెండు సార్లు దేశాధ్యక్ష పదవిని సైతం నిర్వహించిన కుటుబానికి చెందిన బార్బరా.. ఎవ్వరూ ఊహించని విధంగా డెమోక్రటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ కోసం నిధులు సేకరించే కార్యక్రమానికి హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హిల్లరీ కీలక సహాయకురాలు హుమా అబెదిన్ శనివారం న్యూయార్క్ రాష్ట్రంలోని పారిస్ లో నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో బార్బరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆ కార్యక్రమానికి బార్బరా వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అవికాస్త వైరల్ అయిపోవడం విశేషం. బార్బరా మద్దతుతో ఆమె కుటుంబమంతా సొంత పార్టీ(రిపబ్లికన్) అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకులని బాహాటంగా తేలిపోయింది.. ఒక్క జార్జి బుష్(జూనియర్) తప్ప! అయితే జార్జి బుష్ నేరుగా హిల్లరీకి మద్దతు ప్రకటించలేదుకానీ మొదటి నుంచి ఆయన ట్రంప్ వ్యతిరేకి. అందుకే ఇప్పటివరకూ రిపబ్లికన్ అభ్యర్థి కోసం ప్రచారంలోనూ పాల్గొనలేదు. ఆయన సోదరుడు జెబ్ బుష్ రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం ట్రంప్ తో పోటీపడి, నెగ్గలేక ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పుకుని.. ప్రస్తుతం ప్రత్యర్థిని(ట్రంప్ ను) ఓడించేలా వ్యూహాలు రచిస్తున్నారు.
జార్జి డబ్ల్యూ బుష్ తండ్రి, సీనియర్ బుష్ అయితే గతనెలలో 'హిల్లరీకి ఓటు వేయాల'ని బాహాటంగా పిలుపునిచ్చారు. జూనియర్ బుష్ భార్య లారా కూడా హిల్లరీని పరోక్షంగా సమర్థించారు. బుష్ కుటుంబానికి చెందిన పలువురు(ప్రస్తుతం వివిధ పదవుల్లో ఉన్నవారు)కూడా సొంతపార్టీ అభ్యర్థిని కాదని, హిల్లరీకి జై కొడుతున్నారు. కాగా, ట్రంప్ మాత్రం బుష్ లాంటి కొన్ని కీలక రాజకీయ కుటుంబాల మద్దతు లేకపోయిన గెలుపునాదేనని ప్రకటిస్తున్నారు. చూద్దాం.. వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిదో?