శరణు... శరణు...!
► రెండో టి20లో జింబాబ్వే చిత్తు
► 10 వికెట్లతో భారత్ ఘనవిజయం
► రాణించిన బరీందర్, బుమ్రా
► రేపు చివరి మ్యాచ్
బరీందర్ శరణ్ పదునైన స్వింగ్‌కు జింబాబ్వే విలవిల్లాడింది. సాధారణప్రదర్శన కూడా ఇవ్వలేక రెండో టి20లో తలవంచింది. గత మ్యాచ్‌లో అనూహ్య ఓటమికి తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటూ భారత్ పది వికెట్లతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. కెరీర్ తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లోనే చెలరేగిన బరీందర్‌కు తోడు బుమ్రా పేస్‌తో జింబాబ్వేను వణికిస్తే... స్వల్ప లక్ష్యాన్ని భారత ఓపెనర్లు ఊదేశారు.
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న టి20 సిరీస్‌లో భారత్ వెంటనే కోలుకుంది. గత మ్యాచ్‌లో ఓడిన జట్టు ఈ సారి అన్ని రంగాల్లో సమష్టిగా రాణించి ఏకపక్ష విజయం సాధించింది. సోమవారం ఇక్కడ జరిగిన రెండో టి20లో భారత్ 10 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 99 పరుగులకే కుప్పకూలింది. పీటర్ మూర్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బరీందర్ (4/10), బుమ్రా (3/11) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం భారత్ 13.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 103 పరుగులు చేసింది. మన్దీప్ సింగ్ (40 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును గెలిపించారు. తాజా ఫలితంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. మూడోదైన చివరి టి20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది.
బరీందర్ ధాటికి విలవిల
తొలి మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చిన జింబాబ్వే ఈ మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. పీటర్ మూర్ మినహా మరెవరూ కనీస ప్రదర్శన ఇవ్వలేకపోయారు. తొలి మ్యాచ్ ఆడుతున్న బరీందర్ తన రెండో ఓవర్లో చిబాబా (10)ను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. అతని తర్వాతి ఓవర్ జింబాబ్వేను పూర్తిగా కష్టాల్లో పడేసింది. రెండో, ఐదో, చివరి బంతులకు అతను మసకద్జ (10), రజా (1), ముతుంబొజి (0)లను వెనక్కి పంపాడు. టి20ల్లో ఒక భారత బౌలర్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం ఇది రెండో సారి మాత్రమే కావడం విశేషం. అనంతరం వాలర్ (14)ను చహల్ అవుట్ చేయగా... బుమ్రా తర్వాతి మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్‌తో ధావల్, బరీందర్ అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు.
అలవోకగా ఛేదన
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురు కాలేదు. జింబాబ్వే పేలవ ఫీల్డింగ్ కూడా జట్టుకు కలిసొచ్చింది. ఓపెనర్లు రాహుల్, మన్దీప్ స్వేచ్ఛగా ఆడుతూ జట్టును లక్ష్యం వైపు నడిపించారు. ఇద్దరూ పోటీ పడుతూ చక్కటి షాట్లతో మరో 41 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ను గెలిపించారు. భారత విజయానికి ఒక్క పరుగు అవసరమైన దశలో బౌండరీ కొట్టడం ద్వారా మన్దీప్ కెరీర్లో తొలి అర్ధసెంచరీ సాధించాడు.
► బరీందర్ శరణ్ భారత్ తరఫున టి20ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు (4/10) నమోదు చేశాడు. అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో ఒక భారత బౌలర్‌కు ఇదే ఉత్తమ ప్రదర్శన కాగా... ఓవరాల్‌గా రెండో అత్యుత్తమం. ఇలియాస్ సన్నీ (బంగ్లాదేశ్) తన తొలి మ్యాచ్‌లో 13 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.
► ఒకే ఏడాదిలో టి20ల్లో అత్యధిక వికెట్లు (24) తీసిన భారత బౌలర్‌గా బుమ్రా...అశ్విన్ (21)ను అధిగమించాడు.
స్కోరు వివరాలు
జింబాబ్వే ఇన్నింగ్స్: చిబాబా (సి) అంబటి రాయుడు (బి) బరీందర్ 10; మసకద్జ (బి) బరీందర్ 10; మూర్ (సి) అక్షర్ (బి) బుమ్రా 31; రజా (సి) రాహుల్ (బి) బరీందర్ 1; ముతుంబొజి (ఎల్బీ) (బి) బరీందర్ 0; వాలర్ (సి) అక్షర్ (బి) చహల్ 14; చిగుంబురా (బి) బుమ్రా 8; క్రీమర్ (సి) రాయుడు (బి) ధావల్ 4; మద్జివ (బి) బుమ్రా 1; తిరిపానో (నాటౌట్) 11; ముజరబని (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 99.
వికెట్ల పతనం: 1-14; 2-26; 3-28; 4-28; 5-57; 6-75; 7-81; 8-83; 9-91.
బౌలింగ్: బరీందర్ 4-0-10-4; ధావల్ 4-0-32-1; అక్షర్ 4-0-23-0; చహల్ 4-1-19-1; బుమ్రా 4-0-11-3.
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (నాటౌట్) 47; మన్దీప్ (నాటౌట్) 52; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (13.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 103.
బౌలింగ్: తిరిపానో 3-0-11-0; మద్జివ 2.1-0-19-0; ముజరబని 2-0-17-0; క్రీమర్ 3-0-24-0; చిబాబా 2-0-23-0; రజా 1-0-9-0.